Swag BGM Meaning: స్వాగ్ బీజీఎమ్‌లో వినిపించేది బూతు కాదు నీతి.. శ్రీమహాభాగవతంలోని పద్యంతో కంపోజ్.. ఇదిగో వీడియో!
Swag Movie Interval BGM Meaning In Telugu: శ్రీ విష్ణు స్వాగ్ మూవీ ఇంటర్వెల్ సీన్‍లో వచ్చే బీజీఎమ్ చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఆ బ్యాంక్ గ్రౌండ్ స్కోర్‌ను బూతు పదాలతో కంపోజ్ చేశారని తెగ మీమ్స్ పడిపోయాయి. అయితే, అవి బూతులు కాదని, శ్రీమహాభాగవతంలోని పద్యమని అసలు అర్థం చెప్పే ఓ వీడియో వైరల్ అవుతోంది.
Swag Movie Interval BGM Meaning In Telugu: చాలా ఫాస్ట్‌గా వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ వంటి సినిమాలతో వరుసగా మంచి హిట్ ట్రాక్ అందుకున్నాడు శ్రీ విష్ణు. అయితే సినిమాల్లో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు, బూతు పదాలు, మనోభావాలు దెబ్బతీసే డైలాగ్స్ లేకుండా ఫిల్టర్ చేస్తుంది సెన్సార్ బోర్డ్.
సెన్సార్ బోర్డ్ కనిపెట్టకుండా
కానీ, సెన్సార్ బోర్డ్ కనిపెట్టకుండా, బోర్డ్ సభ్యులకు దొరకకుండా తాను అనుకున్న డైలాగ్స్ చెప్పే ఏకైక టాలీవుడ్ హీరో శ్రీ విష్ణునే అని సోషల్ మీడియాలో తెగ మీమ్స్ పడ్డాయి. అందుకు కారణం సామజవరగమన నుంచి స్వాగ్ వరకు సినిమాల్లో శ్రీ విష్ణు వాడిన డైలాగ్సే. నిజానికి అభ్యంతరకర పదాలు అయినప్పటికీ ఎవరికీ అర్థం కాని విధంగా చాకచక్యంగా పలికి కామెడీ జెనరేట్ చేశాడు శ్రీ విష్ణు.
అసలు డైలాగ్ తెలుసుకుని
థియేటర్‌లో సినిమా చూస్తున్నంతసేపు ఆ పదాలు ఏంటీ, వాటి అర్థం ఏంటో తెలియని ఆడియెన్స్‌కు సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ద్వారా తెలుసుకుని షాక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పదాలు ఓం భీమ్ బుష్ మూవీలో చాలానే ఉన్నాయి. అయితే, ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న స్వాగ్ మూవీలో డైలాగ్ కాకుండా బూతు పదాలతో ఓ బీజీఎమ్ కంపోజ్ చేశారని ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెగ పోస్టులు దర్శనం ఇచ్చాయి.
నా జోలికి వస్తే..
స్వాగ్ మూవీ ఇంటర్వెన్ సీన్‌లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తెగ వైరల్ అయింది. ఈ బీజీఎమ్‌ను "నా జోలికి వస్తే.. XXXXXXXతా" వంటి బూతు పదంతో కంపోజ్ చేశారని, అలాగే అందరికి వినిపిస్తోందని తెగ మీమ్స్ పడ్డాయి. అయితే, ఆ బీజీఎమ్‌లో వినిపించేవి బూతులు కాదని, బమ్మెర పోతన రాసిన శ్రీమహాభాగవతంలోని ఏకాదశ స్కందంలో శ్రీమన్నారాయణుడిని వర్ణించే ఓ పద్యమని అసలు అర్థం చెబుతూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్వాగ్ బీజీఎమ్‌లో వినిపించే పదాలు ఏంటో, వాటి అసలు అర్థం ఏంటో తెలిపారు.
"నవ వికచ సరసిరుహ నయనయుగ!
నిజ చరణ గగనచర నది జనిత!!"
ఇవి స్వాగ్ బీజీఎమ్‌లో వినిపించే పదాలు. అయితే వీటి అర్థం "నవ వికచ సరసిరుహ నయనయుగ = తాజాగా వికసించిన పద్మముల వంటి జంట కన్నులు కలవాడా", "నిజ చరణ గగనచర నది జనిత = తన పాదముల వద్ద ఆకాశము నందు ప్రవహించే నది అయినా దేవ గంగను పుట్టించిన వాడా" అని. అయితే, ఈ బీజీఎమ్ అసలు మీనింగ్ అనేదానిపై స్వాగ్ మూవీ డైరెక్టర్ హర్షిత్ గోలి ఓ సందర్భంలో స్పందించారు.
డైరెక్టర్ క్లారిటీ
"స్వాగ్ సినిమా ఇంటర్వెల్‌లో వచ్చే బీజీఎమ్ పూర్తిగా సంస్కృత లిరిక్స్. సోషల్ మీడియాలో వాటిని బూతులు అనుకున్నారు" అని హర్షిత్ గోలి క్లారిటీ ఇచ్చారు. దానికి పక్కనే ఉన్న సరిపోదా శనివారం సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ "వాళ్ల వర్షనే బాగుంది" అని నవ్వేశాడు. ఇలా శ్రీ విష్ణు తన సినిమాలో బూతులను ఎవరు కనిపెట్టకుండా చెప్పినా స్వాగ్ మూవీ ఇంటర్వెల్ బీజీఎమ్ మాత్రం బూతు కాదని తేలిపోయింది.