Squid Game 2 Review: స్క్విడ్ గేమ్ 2 రివ్యూ - నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన కొరియన్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Squid Game 2 Review: స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
Squid Game 2 Review: స్క్విడ్ గేమ్ 2 ఈ ఏడాది వరల్డ్ వైడ్‌గా ఓటీటీ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన వెబ్‌సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. 2022లో రిలీజైన స్క్విడ్ గేమ్ సీజన్ 1 సూపర్ హిట్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన స్క్విడ్ గేమ్ ఓటీటీ హిస్టరీలోనే హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న వెబ్‌సిరీస్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
చిన్న పిల్లలు ఆడుకునే ఆటలకు క్రైమ్, సర్వైవల్ ఎలిమెంట్స్ జోడిస్తూ తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఉత్కంఠ రేపే కథ, కథనాలు, ఊహలకు అందని మలుపులతో ఆడియోన్స్‌కు అసలైన థ్రిల్ అంటే ఏమిటో చూపించింది.
క్రైమ్ ఎలిమెంట్స్‌తో పాటుగానే సమాజంలోని ధనిక, పేద అంతరాలను, పెట్టుబడిదారి వ్యవస్థ ఆధిపత్యాన్ని ఈ సిరీస్‌లో చూపించాడు డైరెక్టర్ హ్యాంగ్ డాంగ్ హ్యూక్. సీజన్ వన్‌కు మించి అంచనాలతో స్క్విడ్ గేమ్ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సీజన్ లో లీ జాంగ్ జీ, వీ హా జూన్, ఇమ్సి వాన్ కీలక పాత్రల్లో కనిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సీరిస్ ఎలా ఉందంటే?
డబ్బు ఆశతో...
డబ్బు ఆశ చూపించి నాలుగు వందల యాభై ఆరు మందితో ఓ దీవిలో రహస్యంగా చిన్న పిల్లలు ఆడుకునే కొన్ని ఆటలు ఆడిపిస్తారు. కానీ ఈ గేమ్స్‌లోని రూల్స్ మాత్రం విచిత్రంగా ఉంటాయి. ఆటలో ఓడిపోయిన వారిని చంపేస్తుంటారు. మొత్తం ఆరు గేముల్లో విజేతగా నిలిచిన సియాంగ్ జీ హూన్ అలియాన్ 456 నంబర్ పెద్ద మొత్తంలో ప్రైజ్‌మనీ ఎలా గెలుచుకున్నాడు? ఈ క్రమంలో అయిన వాళ్లనే అతడు ఎలా మోసం చేశాడన్నది స్క్విడ్ గేమ్ సీజన్1లో మేకర్స్ చూపించారు.
సేమ్ స్టోరీ....
స్క్విడ్ గేమ్ సీజన్ 2 కూడా ఇంచుమించు ఇదే కథతో సాగుతుంది. స్క్విడ్‌గేమ్‌ను ఆడించేవారిని వారిని పట్టుకొని ఈ డెత్‌గేమ్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని సియాంగ్ జీ అనుకుంటాడు. తన రివేంజ్ కోసం ఈ ప్రమాదకరమైన గేమ్‌లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ అతడికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? స్వ్కిడ్‌గేమ్‌కు ఎండ్ చేయాలనే అతడి ప్రయత్నం నెరవేరిందా? అసలు ఈ గేమ్ వెనుక ఉన్నది ఎవరు అన్నదే సీజన్ 2 కథ.
మెరుపులు తక్కువే...
స్క్విడ్ గేమ్ సీజన్ వన్‌తో పోలిస్తే సీజన్ 2లో మెరుపులు తక్కువే ఉన్నాయి. సీజన్ వన్‌లో ఉన్న ఉత్కంఠ, హై మూవ్‌మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. హీరో పాత్రపై ఫస్ట్ సీజన్‌లో క్రియేట్ అయిన సింపథీ, ఎమోషన్స్ సెకండ్ పార్ట్‌లో మిస్సయ్యాయి. కేవలం సీజన్ వన్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకుంటూ సీజన్ 2 రూపొందించినట్లు అనిపించింది.
ఏడు ఎపిసోడ్స్...
మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో స్క్విడ్ గేమ్ సీజన్ 2ను రూపొందించారు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పేరుతో రూపొందించారు. ప్రతి ఎపిసోడ్ నిడివి దాదాపు గంటకుపైనే ఉంది. స్క్విడ్ గేమ్ సీజన్ 1లో మొత్తం ఆరు గేమ్స్ ఉండగా...సీజన్ 2లో కేవలం మూడు గేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. అందులో రోడో డాల్ గేమ్ సీజన్ వన్‌లో కనిపిస్తుంది. అదే గేమ్‌ను సెకండ్ సీజన్‌లో చూపించారు. అయినా ఈ గేమ్ సీన్స్‌తో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ బిల్డ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
మూడో ఎపిసోడ్ నుంచే..
ఫస్ట్, సెకండ్ ఎపిసోడ్స్‌లో కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తోపాటు హీరో లక్ష్యం ఏమిటన్నది చూపించడానికే ప్రయత్నించారు. మూడో ఎపిసోడ్ నుంచే అసలు కథ మొదలవుతుంది. రోబో డాల్‌తో ఆడే గేమ్‌తో సిరీస్ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆ తర్వాత రెండు కొత్త గేమ్స్‌ను మిగిలిన ఎపిసోడ్స్‌లో చూపించారు. గేమ్ ఐడియాలు, వాటి బ్యాక్‌డ్రాప్ కొత్తగా అనిపిస్తాయి.
ఈ గేమ్స్‌తోనే అంతర్లీనంగా ఎమోషనల్ యాంగిల్ టచ్ చేయడం బాగుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే డ్రామాకు సీజన్‌లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా అనిపించింది. సీజన్ వన్ స్థాయిలో పోటీలో నిలిచిన వారి మధ్య మోసాలు, ఎత్తులు, వెన్నుపోట్లు అంతగా పండలేదు. హీరో రివేంజ్ కోసమే కథను మొదలుపెట్టి చివరకు అసంపూర్తిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.
సీజన్ 3 కూడా...
ఫైనల్ ఎపిసోడ్ మొత్తం యాక్షన్‌తో నిండిపోయింది. కమర్షియల్ సెటప్‌తో సీజన్‌ను ఎండ్ చేయడం అంతగా ఆకట్టుకోదు. చివరలో సీజన్ 3ని కూడా అనౌన్స్‌చేసి మేకర్స్ చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు.
టెక్నికల్‌గా, యాక్టింగ్ వైజ్‌గా స్వ్కిడ్ గేమ్ సీజన్ 2కు ఎక్కడ వంక పెట్టలేం. మరోసారి సియాంగ్ జీ పాత్రలో లీ జాంగ్ జీ నటన ఆకట్టుకుంటుంది. అతడు ఆడే మైండ్ గేమ్స్, వేసే ఎత్తులు ఆడియెన్స్‌ను కథలో లీనమయ్యేలా చేశాయి. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్క క్యారెక్టర్ ఎక్కువగా హైలైట్ అవుతుంది.
కంపేరిజన్స్ లేకుండా...
స్క్విడ్ గేమ్ సీజన్ 1కు మించి అంచనాలు పెట్టుకుంటే సీజన్ 2 నిరాశపరుస్తుంది. సీజన్ వన్‌తో కంపేరిజన్స్ లేకుండా చూస్తే థ్రిల్‌ను పంచుతుంది.