Squid Game 2: చరిత్ర సృష్టించిన కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్.. నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉన్న ప్రతి దేశంలోనూ టాప్
Squid Game 2: కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 (Squid Game 2) చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉన్న మొత్తం 93 దేశాల్లోనూ ఈ వెబ్ సిరీసే టాప్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
Squid Game 2: నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ తోనే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. దీంతో రెండో సీజన్ పై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 26న ఈ కొత్త సీజన్ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టగానే ఈ సిరీస్ ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి దేశంలోనూ ఈ వెబ్ సిరీస్ టాప్ లో ఉంది.
స్క్విడ్ గేమ్ 2.. కొత్త రికార్డు
నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ వెబ్ సిరీస్ కూ సాధ్యం కాని ఘనతను స్క్విడ్ గేమ్ సీజన్ 2 సొంతం చేసుకుంది. ఈ ఓటీటీ అందుబాటులో ఉన్న మొత్తం 93 దేశాల్లోనూ ఈ వెబ్ సిరీసే టాప్ లో ఉండటం విశేషం. ఫోర్బ్స్ ప్రకారం.. ప్రతి దేశంలోనూ ఈ సిరీస్ రెండో సీజన్ నంబర్ వన్ గానే అడుగుపెట్టింది. స్క్విడ్ గేమ్ సీజన్ 1కు 265.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అంటే సుమారు 2.2 బిలియన్ గంటల వ్యూయింగ్ నమోదైంది.
మొత్తం నెట్‌ఫ్లిక్స్ లో టాప్ 10 మోస్ట్ పాపులర్ షోలలో ఒకటిగా పేరు సంపాదించింది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 వ్యూయింగ్ మినట్స్ గురించి ఇప్పటి వరకూ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించలేదు. సీజన్ 1 రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. అయితే సీజన్ 1కు వచ్చినంత ఆదరణ దీనికి రావడం లేదు. ఆ సీజన్ తో పోలిస్తే ఈ రెండో సీజన్ అంత థ్రిల్లింగా లేదని ప్రేక్షకులు అంటున్నారు. రోటెన్ టొమాటోస్ లో సీజన్ 1కు 83 శాతం స్కోరు రాగా.. ఈ రెండో సీజన్ కు 63 శాతం మాత్రమే వచ్చింది.
స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎలా ఉందంటే?
స్క్విడ్ గేమ్ సీజన్ వన్‌తో పోలిస్తే సీజన్ 2లో మెరుపులు తక్కువే ఉన్నాయి. సీజన్ వన్‌లో ఉన్న ఉత్కంఠ, హై మూవ్‌మెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. హీరో పాత్రపై ఫస్ట్ సీజన్‌లో క్రియేట్ అయిన సింపథీ, ఎమోషన్స్ సెకండ్ పార్ట్‌లో మిస్సయ్యాయి. కేవలం సీజన్ వన్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకుంటూ సీజన్ 2 రూపొందించినట్లు అనిపించింది.
మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో స్క్విడ్ గేమ్ సీజన్ 2ను రూపొందించారు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పేరుతో రూపొందించారు. ప్రతి ఎపిసోడ్ నిడివి దాదాపు గంటకుపైనే ఉంది. స్క్విడ్ గేమ్ సీజన్ 1లో మొత్తం ఆరు గేమ్స్ ఉండగా...సీజన్ 2లో కేవలం మూడు గేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. అందులో రోడో డాల్ గేమ్ సీజన్ వన్‌లో కనిపిస్తుంది. అదే గేమ్‌ను సెకండ్ సీజన్‌లో చూపించారు. అయినా ఈ గేమ్ సీన్స్‌తో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ బిల్డ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.