OTT Sports Drama: జీవితం మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీరో హీరో అవుతారా లేక విలనా? ఇప్పుడు సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ టెస్ట్. తమిళ స్టార్ హీరోలు మాధవన్, సిద్ధార్థ్ తోపాటు నయనతార, మీరా జాస్మిన్ లాంటి వాళ్లు నటిస్తున్న ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే రాబోతోంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజైంది.
టెస్ట్ ఓ తమిళ స్పోర్ట్స్ డ్రామా. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ మూవీ రానుంది. మంగళవారం (మార్చి 25) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇండియా తరఫున ఓ గొప్ప క్రికెటర్ కావాలని కలలు కనేది ఒకరు.
అదే దేశం కోసం పొల్యూషన్ లేని వాహనాలను అందించాలనని కృషి చేసేది మరొకరు. తల్లి కావాలని ఆరాటపడుతూ తన చివరి అవకాశం అదే అని తెలుసుకొని తల్లడిల్లిపోయే వ్యక్తి ఇంకొకరు. ఈ ముగ్గురు చుట్టూ తిరిగే మూవీయే టెస్ట్ (Test). ఇందులో అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో సిద్ధార్థ్, శరవణన్ పాత్రలో మాధవన్, కుముద పాత్రలో నయనతార నటించారు.
తను నా భర్త అంటూ శరవణన్ (మాధవన్) ను అర్జున్ (సిద్ధార్థ్) కు కుముద (నయనతార) పరిచయం చేసే సీన్ తో ఈ టెస్ట్ ట్రైలర్ మొదలవుతుంది. నువ్వు ఆడిన ఓ టెస్ట్ సమయంలోనే తామిద్దరం కలుసుకున్నామని అతనితో చెబుతుంది. అర్జున్ ను గొప్పగా చూసే కుముద.. పొల్యూషన్ లేని వెహికిల్స్ కోసం ఎంతో కష్టపడే శరవణన్ ను మాత్రం చిన్నచూపు చూస్తుంది.
తనను పట్టించుకోవడం లేదని, తండ్రి అయ్యే ఉద్దేశం అతనికి లేదని నిందిస్తుంది. అటు తన క్రికెట్ కెరీర్లో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటాడు అర్జున్. ఇటు నీటి నుంచి ఫ్యుయెల్ స్టాక్ టెక్నాలజీని కనిపెట్టి ఆ భారీ ప్రాజెక్ట్ అనుమతి కోసం నేతలు, అధికారులు చుట్టూ తిరుగుతుంటాడు శరవణన్. అయితే ఆ ప్రాజెక్టుకు భారీ లంచం ఇవ్వాలన్న డిమాండ్ ఎదురవుతుంది. ఆ డబ్బు కోసం అతడు పక్కదారి పడతాడు.
తనను తాను నిరూపించుకోవాలనుకునే క్రికెటర్, దేశం కోసం మంచి చేయాలని తాపత్రయపడే శరవణన్.. ఈ ఇద్దరికీ జీవితం పరీక్ష పెట్టినప్పుడు ఎవరు హీరో అవుతారు? ఎవరు విలన్ అన్నది ఈ టెస్ట్ సినిమాలో చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం