Soppana Sundari Movie Review: స్వ‌ప్న సుంద‌రి మూవీ రివ్యూ - ఐశ్వ‌ర్య‌రాజేష్ కామెడీ థ్రిల్ల‌ర్ సినిమా ఎలా ఉందంటే-soppana sundari movie review aishwarya rajesh comedy thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Soppana Sundari Movie Review Aishwarya Rajesh Comedy Thriller Movie Review

Soppana Sundari Movie Review: స్వ‌ప్న సుంద‌రి మూవీ రివ్యూ - ఐశ్వ‌ర్య‌రాజేష్ కామెడీ థ్రిల్ల‌ర్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
May 15, 2023 05:44 AM IST

Soppana Sundari Movie Review: ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన స్వ‌ప్న సుంద‌రి ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైంది.

స్వ‌ప్న సుంద‌రి
స్వ‌ప్న సుంద‌రి

Soppana Sundari Movie Review: కోలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది ఐశ్వ‌ర్య‌రాజేష్‌(Aishwarya Rajesh). కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ల‌ను ఎంచుకుంటూ హీరోయిన్‌గా వైవిధ్య‌త‌ను చాటుకుంటోంది.

ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన తాజా చిత్రం స్వ‌ప్న‌సుంద‌రి(Soppana Sundari). ఎస్‌జీ ఛార్లెస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hot Star) ఈ సినిమా రిలీజైంది. కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే....

అహ‌ల్య క‌థ‌...

అహ‌ల్య (ఐశ్వ‌ర్య రాజేష్‌) ఎస్‌జీసీ అనే జ్యూవెల్ల‌రీ షాప్‌లో ప‌నిచేస్తుంటుంది. తాగుడుకు బానిసైన తండ్రి మంచాన ప‌డ‌టం, అన్న‌య్య దొర (క‌రుణాక‌ర్‌) ప్రేమ వివాహం చేసుకొని ఇళ్లు విడిచి వెళ్లిపోవ‌డంతో అహ‌ల్య‌పైనే కుటుంబ బాధ్య‌త‌లు ప‌డ‌తాయి. త‌మ జ్యూవెల్ల‌రీ షాప్‌లో న‌గ‌లు కొన్న వారి కోసం ఎస్‌జీసీ ఓ ల‌క్కీ డ్రా తీస్తుంది. అందులో అహ‌ల్య‌కు కారు బ‌హుతిగా వ‌స్తుంది.

త‌న అక్క పెళ్లికి క‌ట్నంగా ఆ కారును ఇవ్వాల‌ని అహ‌ల్య నిర్ణ‌యించుకుంటుంది. దొర కొన్న న‌గ‌ల‌ తాలూకు కూప‌న్‌కు ల‌క్కీ డ్రా కారు వ‌స్తుంది. దాంతో ఆ కారు త‌న‌కే ఇవ్వాల‌ని బావ గోపితో (మైమ్‌గోపి) క‌లిసి దొర త‌న ఫ్యామిలీమెంబ‌ర్స్‌పైనే దాడి చేస్తాడు. వీరి గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఆ గొడ‌వ‌కు ముందు రోజు రాత్రి త‌న‌కు కాబోయే భ‌ర్త‌తో క‌లిసి అహ‌ల్య అక్క‌య్య రాణి అదే కారుతో ఓ యాక్సిడెంట్ చేస్తుంది. ఆ ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి చ‌నిపోతాడు.

ఆ డెబ్‌బాడీని కారులో దాస్తారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును న‌గ‌ల‌ను కొన్న ఒరిజిన‌ల్ బిల్ ఎవ‌రి ద‌గ్గ‌ర ఉంటే వారికే ఇస్తాన‌ని పోలీస్ ఆఫీస‌ర్ క‌న్న‌న్‌ చెబుతాడు. ఆ బిల్ ఎలాగైనా సంపాదించాల‌ని ఓ వైపు దొర‌, గోపీ, మ‌రో వైపు అహ‌ల్య‌ ప్ర‌య‌త్నిస్తారు. ఈ ఇద్ద‌రిలో ఆ బిల్ ఎవ‌రికి దొరికింది?

పోలీసుల కంట ప‌డ‌కుండా కారులో ఉన్న డెడ్‌బాడీని అహ‌ల్య ఎలా త‌ప్పించింది? ఈ క్ర‌మంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి? పోలీస్ ఆఫీస‌ర్ క‌న్న‌న్ కార‌ణంగా అహ‌ల్య జీవితం ఏ విధంగా చిక్కుల్లో ప‌డింది అన్న‌దే స్వ‌ప్న సుంద‌రి సినిమా క‌థ‌.

సందేశం ప్ల‌స్ ఫ‌న్‌...

దురాశ దుఃఖానికి చేటు....ప‌రుల సొమ్ము కోసం పాకులాడేకంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండ‌టం ముఖ్య‌మ‌నే సందేశానికి కామెడీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు ఎస్‌జీ ఛార్లెస్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

కుటుంబ భారాన్ని మోయ‌డం కోసం ఉద్యోగాలు చేస్తోన్న మ‌హిళ‌ల‌కు సొసైటీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయ‌న్న‌దే అంత‌ర్లీనంగా ఈ సినిమాలో చూపించారు. క‌ష్ట‌ప‌డ‌కుండా వ‌చ్చే డ‌బ్బు కోసం కొంద‌రు ఎలా ఆశ‌ప‌డుతుంటార‌న్ని ఫ‌న్ వేలో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు.

రెడిన్ కింగ్‌స్లే హంగామా

త‌న కూప‌న్‌కు ల‌క్కీ డ్రాలో కారు బ‌హుమ‌తిగా రావ‌డం, ఆ కారును అక్క పెళ్లికి క‌ట్నంగా ఇవ్వాల‌నే అహ‌ల్య నిర్ణ‌యించుకునే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్‌తోనే ఈ సినిమా ఆరంభ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత ఆ కారు త‌న‌దే అంటూ దోర ఎంట్రీ ఇవ్వ‌డం, అంద‌రూ గొడ‌వ‌ప‌డే స‌న్నివేశాల నుంచి చ‌క్క‌టి కామెడీని రాబ‌ట్టుకున్నారు డైరెక్ట‌ర్‌.

అదే కారులో ఓ డెడ్‌బాడీ ఉందంటూ రాణి రివీల్ చేసే ట్విస్ట్‌తో సినిమాను మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వైపు ట‌ర్న్ అవుతుంది. ఆ కారును పోలీస్ స్టేష‌న్ నుంచి త‌ప్పించ‌డం కోసం అహ‌ల్య, దొర చేసే ప్ర‌య‌త్నాల న‌వ్విస్తూనే థ్రిల్‌ను పంచుతాయి. ఫేక్ కారు ఓన‌ర్‌గా రెడిన్ కింగ్‌స్లే పోలీస్ స్టేష‌న్‌లో చేసే హంగామా నుంచి కామెడీ బాగా ప‌డింది. క్లైమాక్స్ ఒరిజినాలిటీ మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది.

ఐశ్వ‌ర్య రాజేష్ వ‌న్ ఉమెన్ షో...

అహ‌ల్య‌గా ఐశ్వ‌ర్య రాజేష్ వ‌న్ ఉమెన్ షోగా స్వ‌ప్న సుంద‌రి సినిమా నిలిచింది. త‌న కుటుంబం బాగు కోసం ఆరాట‌ప‌డే మ‌హిళ‌గా ఆల్‌రౌండ్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టింది, ఐశ్వ‌ర్య రాజేష్ త‌ల్లి పాత్ర‌లో దీప శంక‌ర్ త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్న‌ది. క‌రుణాక‌ర్‌, మైమ్ గోపీ విల‌నిజం వ‌ర్క‌వుట్ కాక‌పోయినా న‌వ్వించ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

స్వ‌ప్న సుంద‌రి న‌వ్విస్తూనే ఆలోచింప‌జేసే మంచి సినిమా. టైమ్‌పాస్‌కు లోటు ఉండ‌దు.

IPL_Entry_Point