Horror OTT: ఓటీటీలోకి 7/జీ బృందావన కాలనీ హీరోయిన్ హారర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
Horror OTT: 7/జీ బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ 7/జీ ఈ వారమే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆగస్ట్ 9 నుంచి ఆహా ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
7/జీ బృందావన కాలనీ టైటిల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ఈజీగా ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లేలా ఈ హారర్ మూవీకి 7/జీ అనే పేరు పెట్టారు. టైటిల్ లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో మిస్సవ్వడంతో ఆడియెన్స్‌ను 7/జీ మెప్పించలేకపోయింది.
మిక్స్‌డ్ టాక్...
7/జీ మూవీకి హరూన్ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఇందులో సోనియా అగర్వాల్‌తో పాటు స్మృతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్ కీలక పాత్రలు పోషించారు. హీరోగా నటించిన సిద్ధార్థ్ విపిన్ 7/జీ సినిమాకు మ్యూజిక్ కూడా అందించాడు.
జూలై ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. సోనియా అగర్వాల్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వినిపించిన రొటీన్ స్టోరీ, రెగ్యులర్ హారర్ సీన్స్ కారణంగా 7/జీ సరైన వసూళ్లను రాబట్టలేకపోయింది.
7/జీ కథ ఇదే...
భార్య వర్ష (స్మృతి వెంకట్) కలను నెరవేరుస్తూ రాజీవ్ (సిద్ధార్థ్ విపిన్ ) సొంతంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంటాడు.7/జీ అనే ఫ్లాట్‌లో అడుగుపెడతారు. గృహ ప్రవేశం జరిగిన తర్వాత రోజే రాజీవ్ ఆఫీస్ పనిమీద వేరే ఊరికి వెళ్లిపోతాడు. కొడుకుతో కలిసి వర్ష ఒంటరిగా కొత్త ఇంట్లో ఉంటుంది.
ఆ ఇంట్లో ఆమెకు అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. తమతో పాటు ఓ దయ్యం కూడా ఆ ఇంట్లో ఉందనే నిజం వర్షకు తెలుస్తుంది. వర్ష కంటే ముందు ఆ ఇంట్లో ఉన్న మంజుల (సోనియా అగర్వాల్) చనిపోయి ఎలా దయ్యమైంది? ఆమె మరణానికి కారకులు ఎవరు? మంజుల బారి నుంచి తన కొడుకును వర్ష ఎలా కాపాడుతుంది? మంజుల పగ ఎవరిపై అన్నదే ఈ మూవీ కథ. లేడీ ఓరియెంటెడ్ హారర్ మూవీగా దర్శకుడు హరూన్ ఈ తమిళ మూవీని రూపొందించాడు.
7/జీ బృందావన కాలనీ తో హిట్...
7/జీ బృందావన కాలనీ తో తమిళంతో పాటు తెలుగులో పెద్ద విజయాన్ని అందుకున్నది సోనియా అగర్వాల్. ఈ లవ్ స్టోరీతో వచ్చిన క్రేజ్ కారణంగా తెలుగులో విన్నర్, అమ్మా నాన్న ఊరెళితే తో పాటు కొన్ని సినిమాలు చేసింది. అవేవీ ఆమెకు సక్సెస్‌లను తెచ్చిపెట్టలేకపోయాయి.
హారర్ సినిమాలు...
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఎక్కువగా హారర్ సినిమాల్లోనే కనిపిస్తోంది సోనియా అగర్వాల్. గత రెండేళ్లలో 7జీతో పాటు బిహైండ్, గ్రాండ్‌మా తో పాటు పలు హారర్ సినిమాలు చేసింది.