Sivarapalli Review: సివరపల్లి వెబ్ సిరీస్ రివ్యూ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కామెడీ - పంచాయత్ తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Sivarapalli Review: రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ సివరపల్లి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. పంచాయత్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Sivarapalli Review: బాలీవుడ్ వెబ్‌సిరీస్ పంచాయత్‌కు తెలుగు రీమేక్‌గా రూపొందిన సివరపల్లి వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌లో రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించాడు. ఈ రీమేక్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? పంచాయత్ స్థాయిలో నవ్వించిందా? లేదా? అంటే?
సివరపల్లి పంచాయతీ సెక్రటరీ..
శ్యామ్ ప్రసాద్ (రాగ్ మయూర్) ఇంజినీరింగ్ పూర్తిచేస్తాడు. అతడికి వచ్చిన మార్కులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ రాదు. తండ్రి బలవంతంతో పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగంలో చేరుతాడు. కామారెడ్డి జిల్లాలోని సివరపల్లి అనే మారుమూల పల్లెటూల్లో పోస్టింగ్ వస్తుంది.
ఉద్యోగ నిమిత్తం ఆ పల్లెటూళ్లో అడుగుపెట్టిన శ్యామ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? సిటీలో పుట్టిపెరిగిన శ్యామ్ పల్లెటూరి వాతావరణంలో ఎలా అడ్జెస్ట్ అయిపోయి బతికాడు?
తమ రాజకీయ అవసరాల కోసం సర్పంచ్ భర్త సుధాకర్ (మురళీధర్‌గౌడ్) ఉపసర్పంచ్ మల్లిఖార్జున్ ( ఉదయ్ గుర్రాల) శ్యామ్‌ను ఎలా వాడుకున్నారు? జీమ్యాట్ ఎగ్జామ్ రాసి అమెరికా వెళ్లిపోవాలనే శ్యామ్ కల తీరిందా? సర్పంచ్ సుశీలతో (రూప లక్ష్మి) పాటు ఊరిఆడవాళ్లలో మార్పు తీసుకురావడానికి శ్యామ్ ఏం చేశాడు? అన్నదే ఈ వెబ్‌సిరీస్.
హిందీ రీమేక్...
హిందీలో సూపర్ హిట్టైన పంచాయత్ వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా సివరపల్లి వెబ్‌సిరీస్ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథ, కామెడీలో పలు మార్పులు చేర్పులు చేస్తూ దర్శకుడు భాస్కర్ మౌర్య ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో సివరపల్లి వెబ్‌సిరీస్ రూపొందింది.
పల్లె జీవితం కళ్ల ముందుకు...
కంప్లీట్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించారు. నాచురల్ లొకేషన్స్‌లో షూట్ చేయడంతో నిజంగానే ఓ పల్లె జీవితాన్ని ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఓ వైపు కామెడీతో నవ్విస్తూనే సొసైటీలోని పలు సమస్యలను కథలో టచ్ చేయడం బాగుంది. మహిళల వెనుకబాటుతనం, ఆడపిల్లలనుచదువు పట్ల ఉన్న వివక్ష, మూఢనమ్మకాలులను ఈ వెబ్‌సిరీస్‌లో చూపించారు. పల్లెటూళ్లలో రాజకీయాలు ఎలా ఉంటాయి? చాలా ఊళ్లలో సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్‌గా మహిళలే ఎన్నికైనా....పెత్తనం మాత్రం వాళ్ల భర్తలదే కనిపిస్తుంది. ఆ అంశాలను వాస్తవిక కోణంలో ఈ సిరీస్‌లో మేకర్స్ చూపించారు.
ఫస్ట్ ఎపిసోడ్ ఫన్...
ఇంజినీరింగ్ పూర్తిచేసిన యువకుడిగా శ్యామ్ పాత్ర పరిచయమయ్యే సీన్‌తోనే ఈ సిరీస్ మొదలవుతుంది. తన స్నేహితులంతా విదేశాలకు వెళుతుంటే శ్యామ్ మాత్రం సివరపల్లిలోకి పంచాయతీ సెక్రటరీగా ఎంట్రీ ఇచ్చే సన్నివేశంతో అసలు కథ మొదలవుతుంది. పంచాయతీ ఆఫీస్ తాళాన్ని సర్పంచ్ భర్త పొగొట్టడం, పుట్టింటి వారు ఇచ్చిన ఆ తాళాన్ని పగలగొట్టడానికి సర్పంచ్ ఒప్పుకోకపోవడం ...మధ్యలో శ్యామ్ నలిగిపోయే సీన్స్‌తో ఫస్ట్ ఎపిసోడ్‌లో మంచి ఫన్ జనరేట్ అయ్యింది.
పెళ్లి గోల...
రెండో ఎపిసోడ్‌ను దయ్యం చెట్టు కథ అంటూ సాగుతుంది. ఆ సిరీస్‌లో ఫన్ అంతగా పండలేదు. చక్రల కుర్చీ కథ ఎపిసోడ్ మాత్రం సిరీస్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. పంచాయతీ ఆఫీస్‌లో మగ పెళ్లివారు విడిది చేయడం, వారికి మర్యాదలు చేసే క్రమంలో శ్యామ్ పడే తప్పలను హిలేరియస్‌గా చూపించారు. పెళ్లిని అడ్డుపెట్టుకొని శ్యామ్ కుర్చీని సర్పంచ్ కొట్టేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ కొడుకు పేరు...
ఊళ్లోని గోడలపై ప్రభుత్వ పథకాల గురించి స్లోగన్స్ రాయించే క్రమంలో ప్రజలకు, సర్పంచ్‌కు, పై ఆఫీసర్లకు మధ్య శ్యామ్ ఎలా నలిగిపోయాడో చూపించిన విధానం బాగుంది. అలాగే మానిటర్ దొంగతనం ఎపిసోడ్‌తో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా పేరును ఊరిలోని ఓ పిల్లాడికి శ్యామ్ పెట్టడం వల్ల వచ్చే గొడవలు నవ్విస్తాయి. చివరలో చక్కటి సందేశంతో మహిళా సాధికారతకు సంబంధించి చిన్న మెసేజ్‌తో సిరీస్‌ను ఎండ్ చేశారు.
స్వచ్ఛమైన డైలాగ్స్...
సివరపల్లి వెబ్‌సిరీస్‌లో డైలాగ్‌లు చాలా నాచురల్‌గా ఉన్నాయి. సినిమా కోసం కావాలనే రాసినట్లుగా కాకుండా నిజంగానే పల్లెటూళ్లో జనాలు ఎంత స్వచ్ఛంగా మాట్లాడుకుంటారో అలానే చూపించారు.
పంచాయత్‌తో పోలిస్తే కొన్ని చోట్ల ఫన్ అంతగా వర్కవుట్ కాలేదు. సర్పంచ్‌కు పోటీగా పంచాయత్ వెబ్‌సిరీస్‌లో విలన్ లాంటి క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ పాత్ర ఈ సిరీస్‌లోలేని లోటు స్పష్టంగా కనిపించింది. పోను పోను కామెడీ డోస్ తగ్గుతూ రావడం మైనస్‌గా మారింది. కామెడీ విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటేది.
మురళీధర్ గౌడ్...
పంచాయతీ సెక్రటరీ పాత్రలో రాగ్ మయూర్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పుడు ప్రస్టేషన్‌తో కనిపించే క్యారెక్టర్‌లో అతడి మ్యానరిజమ్స్ బాగున్నాయి. ఈ సిరీస్‌కు మురళీధర్ పాత్ర పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సర్పంచ్ భర్తగా తెలంగాణ స్లాంగ్‌లో తన డైలాగ్స్‌తో మెప్పించాడు.
భార్యకు భయపడే భర్తగా ఓ వైపు కనిపిస్తూనే పైకి మాత్రం డాంబికంగా కనిపించే క్యారెక్టర్‌కు పూర్తిగా న్యాయం చేశాడు. సర్పంచ్‌గా రూపలక్ష్మి నటన బాగుంది.
పంచాయతీ అసిస్టెంట్‌గా సన్నీ పల్లే కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. పుష్ప ఫేమ్ పావని కరణం చివరలో గెస్ట్ క్యారెక్టర్‌లో కనిపించింది. మిగిలిన వారు తమ క్యారెక్టర్స్‌కు న్యాయం చేశారు.
పంచాయత్ స్థాయిలో...
సివరపల్లి రియలిస్టిక్‌గా సాగే ఫన్ సిరీస్. తెలంగాణ నేటివిటీ, రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్ కామెడీ ఆకట్టుకుంటాయి. పంచాయత్ స్థాయిలో అంచనాలు పెట్టుకోకుండా చూస్తే టైమ్‌పాస్ చేస్తుంది.