Sivaji on Pallavi Prashanth: బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై బిగ్‌బాస్ కంటెస్టెంట్, హీరో శివాజీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.శివాజీ అండతోనే తాను బిగ్‌బాస్ టైటిల్ గెలిచినట్లు పల్లవి ప్రశాంత్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అభిమానులు చేసిన అల్లర్ల కారణంగా విజేతగా నిలిచిన కొన్ని గంటల్లోనే పల్లవి ప్రశాంత్ జైలు పాలయ్యాడు.
అతడి అరెస్ట్‌పై ఓ వీడియో ద్వారా శివాజీ స్పందించాడు. ప్రశాంత్‌కు ఏమీ కాదని, చట్టం మీద అతడికి గౌరవం ఉందని, అతడు ఎక్కడికి పారిపోలేదని శివాజీ అన్నాడు. ఒక్కోసారి గెలిచాననే ఆనందం మనిషిని డామినేట్ చేస్తుందని శివాజీ చెప్పాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జైట్‌మెంట్‌తో ర్యాలీలో పల్లవి ప్రశాంత్ పాల్గొన్నాడని శివాజీ చెప్పాడు. అయితే ఫ్యాన్స్ ఇతర కంటెస్టెంట్స్ కార్ల అద్దాలు పగలగొట్టిన విషయం పల్లవి ప్రశాంత్‌కు తెలియదని, అతడు స్టూడియో నుంచి బయటకు రాకముందే ఇదంతా జరిగిందని శివాజీ పేర్కొన్నాడు.
“వాళ్లు ఎవరి అభిమానులో కూడా తెలియదు. చేసింది ఎవరైనా జరిగింది పెద్ద తప్పు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశాంత్‌ఫై కేసు నమోదైన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. వాడికి నేను ఏమిటో తెలుసు. నాకు వాడంటే ఏమిటో తెలుసు. ప్రతిది ప్రూవ్ చేసుకోవాలని అవసరం లేదు.
ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్టప్రకారమే బయటకు వస్తాడు. ప్రశాంత్ నిర్ధోషి...నిర్ధోషిగానే అతడు జైలు నుంచి విడుదల అవుతాడు. అతడి ఫ్యామిలీ మొత్తం నాతో టచ్‌లో ఉన్నారు. ఎవరూ బయపడాల్సిన పనిలేదు. బాధపడాల్సిన పనిలేదు. ప్రశాంత్ క్రిమినల్ కాదు. నిందితుడు కాదు. బాధితుడు” అని శివాజీ అన్నాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. అమర్‌దీప్ ఫ్యాన్స్‌పై ఎటాక్ చేసేందుకు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఈ దాడిలో అతడితో పాటు గీతూరాయల్ కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలాగే ఐదు ఆర్టీసీ బస్ అద్దాలతో పాటు కొన్ని ప్రైవేటు వెహికిల్స్ అద్దాలు పగిలిపోయాయి. ఈ గొడవలకు సంబంధించి పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.