Sir Movie Review: సార్ మూవీ రివ్యూ - ధ‌నుష్ తెలుగులో హిట్ కొట్టాడా? లేదా?-sir movie review dhanush samyuktha menon movie review vaathi review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sir Movie Review Dhanush Samyuktha Menon Movie Review Vaathi Review

Sir Movie Review: సార్ మూవీ రివ్యూ - ధ‌నుష్ తెలుగులో హిట్ కొట్టాడా? లేదా?

Nelki Naresh Kumar HT Telugu
Feb 17, 2023 06:55 AM IST

Sir Movie Review: ధ‌నుష్ హీరోగా న‌టించిన ద్విభాషా చిత్రం సార్ శుక్ర‌వారం (నేడు)విడుద‌లైంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా ఎలా ఉందంటే...

ధ‌నుష్, సంయుక్త మీన‌న్‌
ధ‌నుష్, సంయుక్త మీన‌న్‌

Sir Movie Review: కోలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు ధ‌నుష్(Dhanush). వైవిధ్య‌త‌కు, కొత్త‌ద‌నానికి అత‌డి సినిమాలు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తాయి. ధ‌నుష్ హీరోగా న‌టించిన తాజా చిత్రం సార్‌. తొలిప్రేమ‌, రంగ్ దే ఫేమ్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయిసౌజ‌న్య సార్ సినిమాను నిర్మించారు. సందేశాత్మ‌క క‌థాంశంతో రూపొందిన ఈసినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది? ఈ సినిమాతో ధ‌నుష్ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? టాలీవుడ్‌లో హిట్ అందుకున్నాడా? లేదా? అన్న‌ది చూద్దాం?

బాల గంగాధ‌ర్ తిల‌క్ క‌థ‌...

బాల గంగాధ‌ర్ తిల‌క్ (ధ‌నుష్‌) ఓ లెక్చ‌ర‌ర్‌. డ్రైవ‌ర్ కొడుకైన అత‌డు ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువును పూర్తిచేసి ఉద్యోగంలో చేరుతాడు. త్రిపాఠి విద్యాసంస్థ‌ల ఛైర్మ‌న్ శ్రీనివాస్ త్రిపాఠి (స‌ముద్ర‌ఖ‌ని) రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకుంటాడు. అందులో భాగంగా త‌మ కాలేజీలో ప‌నిచేసే ఫ్యాక‌ల్టీతో ప్ర‌భుత్వ కాలేజీల్లోని పిల్ల‌ల‌కు ఉచితంగా చ‌దువుచెప్పించాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.

ఆ ఒప్పందంలో భాగంగా త్రిపాఠి కాలేజీలో ప‌నిచేసే బాల గంగాధ‌ర్ తిల‌క్ సిరిపురం అనే ఊరిలోని ప్ర‌భుత్వ కాలేజీకి వెళ‌తాడు. త‌మ లెక్చ‌ర‌ర్ల‌తో చ‌దువు స‌రిగా చెప్పించ‌కుడా ప్ర‌భుత్వ కాలేజీల‌ను పూర్తిగా దెబ్బ‌తీయాల‌ని త్రిపాఠి ప్లాన్ చేస్తాడు. కానీ అత‌డి ప్లాన్‌ను త‌ల‌క్రిందులు చేస్తూ బాల గంగాధ‌ర్ తిల‌క్ చ‌దువు చెప్పిన సిరిపురం ఊరిలోని స్టూడెంట్స్ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస్ అవుతారు.

ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? బాలును టార్గెట్ చేసిన త్రిపాఠి అత‌డు పిల్ల‌ల‌కు అత‌డు విద్య‌ను బోధించ‌కుండా ఎలాంటి అడ్డంకుల‌ను సృష్టించాడు? సిరిపురం ఊరి నుంచి బాలును ఊరి ప్రెసిడెంట్ (సాయికుమార్‌)ఎందుకు బ‌హిష్క‌రించాడు? త‌న ల‌క్ష్యాన్ని బాలు చేరుకున్నాడా? ఈ ప్ర‌యాణంలో అత‌డికి తోడుగా నిలిచిన మీనాక్షి ఎవ‌ర‌న్న‌దే (Sir Movie Review)ఈ సినిమా క‌థ‌.

విద్య వ్యాపారంగా మారితే...

విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోతుపాతుల‌ను ఆవిష్క‌రిస్తూ రూపొందిన సినిమా ఇది. అంద‌రికి అందుబాటులో ఉండాల్సిన విద్యా నేడు ఎలా వ్యాపారంగా మారిపోయింది? అధిక ఫీజుల కార‌ణంగా దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి పిల్ల‌లు చ‌దువుకు ఏ విధంగా దూర‌మ‌వుతోన్నార‌నే పాయింట్‌తో సార్ సినిమాను తెర‌కెక్కించారు వెంకీ అట్లూరి. సింపుల్ క‌థ‌కు ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా సుగ‌ర్ కోటెడ్‌లా సోష‌ల్ మెసేజ్‌ను జోడించి ప్రేక్ష‌కుల్ని మెప్పించేప్ర‌య‌త్నం చేశారు.

సుమంత్ క్యారెక్ట‌ర్ ద్వారా...

నేరుగా సినిమా క‌థ‌ను మొద‌లుపెట్ట‌కుండా అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి (సుమంత్‌) అంటూ ఓ కొత్త పాత్ర‌ను తెర‌పైకి తీసుకొచ్చి అత‌డి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా(Sir Movie Review) క‌థ‌లోని వెళ్ల‌డం బాగుంది. ఫ‌స్ట్ హాఫ్ సిరిపురం కాలేజీలో ధ‌నుష్ అడుగుపెట్ట‌డం, మీనాక్షితో ల‌వ్ స్టోరీ లాంటి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో సాగిపోతుంది.

సెకాండాఫ్‌లోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సిరిపురం పిల్ల‌ల‌కు చ‌దువు చెప్ప‌డానికి ధ‌నుష్ ప‌డే క‌ష్టాలు, అత‌డి ప్ర‌య‌త్నాల్ని సముద్ర‌ఖ‌ని అడ్డుకునే సీన్స్‌తో పోటాపోటీగా సెకాండాఫ్ సాగుతుంది.

మ‌లుపులు లేవు...

సార్ సినిమా కోసం వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా ఈ క‌థాంశంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో చాలా సినిమాలొచ్చాయి. వాటి ఛాయ‌ల‌తోనే సార్ సినిమా సాగుతుంది. హీరో ల‌క్ష్యాన్ని అడ్డుకోవ‌డానికి విల‌న్ వేసే ఎత్తుల‌న్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. వాటిని ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు అందకుండా చ‌క్క‌టి మ‌లుపుల‌తో రాసుకుంటే బాగుండేది.

నాచుర‌ల్ యాక్టింగ్‌...

బాల గంగాధ‌ర్ తిల‌క్ అనే లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో ధ‌నుష్ జీవించాడు. తాను ఎంత నాచుర‌ల్ యాక్ట‌రో ఈ పాత్ర మ‌రోసారి చాటిచెబుతుంది. కామెడీ, యాక్ష‌న్‌, సెంటిమెంట్ ఇలా అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. సంయుక్త పాత్ర రొటీన్‌గా ఉంది. స‌ముద్ర‌ఖ‌ని విల‌నిజంలో కొత్త‌ద‌నం లేదు. హైప‌ర్ ఆది కామెడీ కొన్ని చోట్ల ప‌ర్వాలేదు.

Sir Movie Review -మెసేజ్ బాగుంది...

సార్ చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో కూడిన అర్థ‌వంత‌మైన సినిమా. విద్య వ్యాపారంగా మార‌డం అనే స‌మ‌కాలీన స‌మ‌స్య‌ను చ‌ర్చిస్తూ తెర‌కెక్కిన సినిమా ఇది. కానీ కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు అల‌వాటు ప‌డిన ప్రేక్ష‌కులు ఇలాంటి సందేశాత్మ‌క చిత్రాల‌ను ఏ మేర‌కు ఆద‌రిస్తార‌న్న‌ది చూడాల్సిందే...

IPL_Entry_Point