సామజవరగమనా, ఓం భీమ్ బుష్ తర్వాత మరోసారి కామెడీని నమ్ముకొని శ్రీవిష్ణు చేసిన మూవీ సింగిల్.ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. వెన్నెలకిషోర్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. సింగిల్ ఎలా ఉంది? ఈ మూవీతో శ్రీవిష్ణుకు హ్యాట్రిక్ హిట్ దక్కిందా? లేదా? అంటే?
విజయ్ (శ్రీవిష్ణు) ఓ బ్యాంక్ ఎంప్లాయ్. జీవితంలో ఒక్క అమ్మాయినైనా ప్రేమలో పడేయాలన్నది అతడి లక్ష్యం. స్కూల్, కాలేజీ డేస్‌లో చాలా మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిలంతా విజయ్ ప్రేమను రిజెక్ట్ చేస్తారు. జీవితాంతం సింగిల్‌నే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి టైమ్‌లోనే పూర్వ (కేతికా శర్మ) అనే అమ్మాయి అతడి మనసును దోచేస్తుంది. తొలిచూపులోనే పూర్వతో ప్రేమలో పడతాడు విజయ్. ఆమెప్రపోజ్ చేస్తాడు.
అదే టైమ్‌లో విజయ్ లైఫ్‌లోకి హరిణి ( ఇవానా) వస్తుంది. విజయ్‌ని ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. విజయ్ ప్రేమను తిరస్కరించిన పూర్వ మళ్లీ అతడికి ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది? హరిణి ప్రపోజల్‌కు విజయ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? పూర్వ, హరిణిలలో ఎవరి ప్రేమను విజయ్ దక్కించుకున్నాడు? సింగిల్‌నే ఉండాలని అనుకున్న విజయ్ ఎవరితో మింగిల్ అయ్యాడు? విజయ్ ఫ్రెండ్ అరవింద్ (వెన్నెల కిషోర్) లవ్‌స్టోరీ ఏ మలుపులు తిరిగింది? ఈ కథలోకి మూర్తి (రాజేంద్ర ప్రసాద్ ) ఎలా ఎంటర్ అయ్యాడు? అన్నదే ఈ మూవీ కథ.
ఓ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలంటే కథను ఇన్నోవేటివ్‌గా రాసుకోవాలి లేదంటే పాత కథను కొత్త చెప్పే నేర్పు అయినా ఉండాలి. సింగిల్ రెండో కోవకు చెందిన సినిమా. ఓ అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడ్డ యువకుడు...అతడిని ఇష్టపడ్డ మరో అమ్మాయి...ఈ ముగ్గురి ట్రయాంగిల్ లవ్‌స్టోరీతోనే సింగిల్ సాగుతుంది. ఈ సినిమాతో ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. కథలోని లోపాలను గురించి ఆలోచించే టైమ్ ఆడియెన్‌కు ఇవ్వకుండా హిలేరియస్‌గా నవ్వించారు.
స్టార్ హీరోలను శ్రీవిష్ణు ఇమిటేట్ చేసే సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ సీన్స్‌ను రీక్రియేట్ చేసిన విధానం, ఉపయోగించుకున్న సందర్భాలు ఫన్నీగా అనిపిస్తాయి. వెన్నెలకిషోర్ ప్రేమను చెడగొట్టాలని శ్రీవిష్ణు అనుకోవడం, ఈ క్రమంలో ఇద్దరి కాంబోలో వచ్చే ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ట్రయాంగిల్ లవ్‌స్టోరీని కూడా వినోదాత్మకంగానే నడిపించారు. పూర్వను లవ్‌లో పడేయటానికి విజయ్ వేసే ప్లాన్స్.షోరూమ్‌లో అతడు చేసే హంగామా...మరోవైపు విజయ్‌ని లవ్‌లో దించడానికి హరిణి చేసే ప్రయత్నాల నుంచి చక్కటి కామెడీ జనరేట్ అయ్యింది.
సెకండాఫ్‌లో మూర్తి క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత కథ ఎమోషనల్‌గా మారుతుంది. విజయ్‌ను వెతుక్కుంటూ పూర్వ రావడం, హరిణిని విజయ్ ఇష్టపడటం ఈ క్రమంలో ఎదురయ్యే సంఘర్షణ కాస్తంత సాగతీసినట్లుగా అనిపిస్తుంది. కానీ కామెడీతోనే ఆ లోపాలను కవర్ చేసుకున్నారు. కీలకమైన ఎమోషనల్ పాయింట్‌ను కూడా కథలో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.
క్లైమాక్స్ విషయంలో దర్శకుడు వేసిన ఎత్తు మెప్పిస్తుంది. రెగ్యులర్ లవ్‌స్టోరీస్‌కు భిన్నంగా పతాక ఘట్టాలను రాసుకున్నారు. సీక్వెల్‌కు ఇచ్చిన హింట్ బాగుంది.
సింగిల్ మూవీకి వన్ మెన్ షోగా నిలిచాడు శ్రీవిష్ణు. కామెడీ ప్రధాన పాత్రలో చెలరేగిపోయాడు. విచిత్రమైన డైలాగ్ డెలివరీతో నవ్వించాడు. అతడి పంచ్ డైలాగ్స్ అన్ని పేలాయి. శ్రీవిష్ణుకు ధీటుగా వెన్నెలకిషోర్ నవ్వించాడు. వీరిద్దరి కాంబో ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
హీరోయిన్లలో కేతికా శర్మ గ్లామర్‌తో మెప్పించగా...ఇవానా యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. మూర్తి పాత్రకు రాజేంద్రప్రసాద్ న్యాయం చేశాడు. మ్యాడ్ హీరో నార్నే నితిన్, రెబా మోనికా జాన్ చివరల్లో అతిథి పాత్రల్లో మెరిశారు.
నందు- భాను డైలాగ్స్ యూత్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. విశాల్ చంద్రశేఖర్ పాటలు బాగున్నాయి. బీజీఎమ్ పర్వాలేదు.
సింగిల్ రెండు గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వించే హిలేరియస్ ఎంటర్‌టైనర్ మూవీ. శ్రీవిష్ణు, వెన్నెలకిషోర్ కామెడీ కోసం ఈ మూవీని చూడొచ్చు.
రేటింగ్: 3.25/5
సంబంధిత కథనం