సింగిల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ సాధించింది. శ్రీ విష్ణు కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. క్రమంగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్నాడతడు. తాజాగా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సింగిల్.. మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చి పెడుతోంది. మే 9న రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించగా.. తర్వాత కూడా జోరు కొనసాగిస్తూనే ఉంది.
సింగిల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. ఐదు రోజుల్లేనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లకుపైగా వసూలు చేసింది. శ్రీవిష్ణుకు టాలీవుడ్ లో పెరుగుతున్న క్రేజ్ కు ఈ సినిమా అద్దం పట్టింది. ట్రైలర్ తోనే వివాదాల్లో చిక్కుకున్నా.. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
సింగిల్ మూవీని రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే సినిమా రిలీజ్ కు ముందే ఇదంతా రికవర్ కావడం విశేషం. నాన్ థియేట్రికల్ అంటే ఓటీటీ, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారానే ఈ సినిమాకు రూ.12 కోట్లు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వసూళ్ల పర్వం మొదలు కాకముందే లాభాల్లోకి దూసుకెళ్లింది.
ఇక ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ.10 కోట్లకుపైగా షేర్ సాధించినట్లు సమాచారం. ఇవన్నీ అదనపు లాభాలే. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన సంచలనం సృష్టించిన ఈ సినిమా.. రెండో వీకెండ్ లో మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయం. అటు యూఎస్ఏలో ఇప్పటికే 5 లక్షల డాలర్లకుపైగా వసూలు చేసింది.
సింగిల్ మూవీకి పాజిటివ్ టాక్ తోపాటు పరిస్థితులు కూడా అనుకూలించాయి. ప్రస్తుతం శుభం తప్ప మరో మూవీ లేకపోవడం, ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోవడం కూడా కలెక్షన్లు భారీగా పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. ఈ శుక్రవారం కూడా పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు లేకపోవడంతో సెకండ్ వీకెండ్ వసూళ్లు కూడా భారీగానే ఉండనున్నాయి. దీంతో ఈ సమ్మర్ విజేతగా సింగిల్ నిలవడం ఖాయం.
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ లతో సక్సెస్ అందుకున్న శ్రీవిష్ణు.. ఇప్పుడీ సింగిల్ మూవీతో మరో లెవెల్ కు వెళ్లాడు. ఇప్పుడు వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నాడు.
సింగిల్ మూవీని గీతా ఆర్ట్స్ తెరకెక్కించింది. కార్తీక్ రాజు డైరెక్ట్ చేశాడు. ఇందులో ఓ బ్యాంకు ఉద్యోగిగా శ్రీవిష్ణు నటించాడు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సింగిల్ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్, కాల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ప్రొడ్యూజ్ చేశారు. భాను భోగవరపు, నందు డైలాగ్స్ అందించారు.
సంబంధిత కథనం