Neha Kakkar: బాలీవుడ్ సింగర్ నేహా కక్కడ్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఈ మధ్య ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ కాన్సర్ట్ కు మూడు గంటలు ఆలస్యం రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఇప్పుడామె తన ఆలస్యానికి కారణమేంటో వివరించింది. నిర్వాహకులు తనను నిలువునా ముంచినట్లు ఆమె చెప్పింది.
నేహా కక్కడ్ గురువారం (మార్చి 27) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది. అందులో మెల్‌బోర్న్ కాన్సర్ట్ ఎందుకు అంత ఆలస్యమైంది? అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
“ఆమె 3 గంటలు ఆలస్యంగా వచ్చిందని వాళ్లు చెప్పారు. కానీ అసలు ఆమెకు ఏం జరిగిందో ఒక్కసారైనా అడిగారా? ఆమెకు, ఆమె బ్యాండ్ కు వాళ్లు ఏం చేశారో చెప్పారా? నేను స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మాకు ఏం జరిగిందో నేను చెప్పలేదు. ఎందుకంటే ఎవరినైనా శిక్షించడానికి నేనెవరిని? కానీ ఇప్పుడు నింద నాపై వేశారా కాబట్టి చెబుతున్నాను” అని నేహ చెప్పింది.
“నేను మెల్‌బోర్న్ కాన్సర్ట్ ఫ్రీగా చేశాను. ఆర్గనైజర్లు నా డబ్బుతో పారిపోయారు. నా బ్యాండ్ కు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని ఫ్రెండ్స్ వాళ్లకు భోజనం పెట్టించారు. ఇంత జరిగినా మేము స్టేజ్ మీదికి వచ్చాము. రెస్ట్ లేకుండా పర్ఫామ్ చేశాము. కేవలం నా ఫ్యాన్స్ గంటల తరబడి వేచి చూస్తున్నారన్న కారణంతోనే” అని నేహ రాసుకొచ్చింది.
“కనీసం సౌండ్ చెక్ చేసుకునే అవకాశం కూడా కలగలేదు. ఆర్గనైజర్లు మా మేనేజర్ కాల్స్ కూడా తీసుకోలేదు. స్పాన్సర్లు, అందరి నుంచి వాళ్లు దూరంగా పారిపోయారు. ఇంకా చెప్పాల్సింది చాలానే ఉన్నా.. ఇక చాలు” అని నేహ చెప్పింది. ఈ కాన్సర్ట్ లో స్టేజ్ పైనే ఏడుస్తూ ఆమె అభిమానులకు క్షమాపణ చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ వేచి చూసిన సమయాన్ని కూడా తాను కవర్ చేస్తానని చెప్పింది. అయితే తనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అసలు మెల్‌బోర్న్ లో ఏం జరిగిందో నేహ వివరణ ఇచ్చింది.
సంబంధిత కథనం