Singer Mangli on Road Accident: రోడ్డు ప్రమాదంపై స్పందించిన సింగర్ మంగ్లీ.. ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్
Singer Mangli on Road Accident: సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ఇటీవల స్పల్ప ప్రమాదానికి గురైంది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తరుణంలో మంగ్లీ ఈ ప్రమాదంపై స్వయంగా స్పందించారు.

Singer Mangli: తెలుగు గాయని మంగ్లీ చాలా పాపులర్ అయ్యారు. ముందుగా ప్రైవేట్ ఆల్బమ్‍లతో తన గాత్రంతో పాటు నృత్యంతోనూ ఆమె ఆకట్టుకున్నారు. దీంతో చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లోనూ పాటలు పాడుతున్నారు. మంగ్లీ పాడిన కొన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల సూపర్ సింగర్ షోలో జడ్జిగానూ ఆమె వ్యవహరించారు. కాగా, ఇటీవల మంగ్లీ ప్రయాణిస్తున్న కారు స్పల్ప ప్రమాదానికి గురైంది.
మంగ్లీ కారు ప్రమాదం విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం మంగ్లీ ప్రయాణిస్తున్న కారును డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఇలా జరిగిందని సమాచారం. ఈ ప్రమాదంలో మంగ్లీ సహా కారులోని ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వచ్చాయి. దీంతో సింగర్ మంగ్లీ నేడు (మార్చి 18) ఈ విషయంపై స్పందించారు.
రూమర్లు నమ్మొద్దు
రెండు రోజుల క్రితం ఈ స్వల్ప ప్రమాదం జరిగిందని, రూమర్లను ఎవరూ నమ్మొద్దని మంగ్లీ నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. “నేను సురక్షితంగా ఉన్నా. ఈ స్వల్ప ప్రమాదం రెండు రోజుల క్రితం జరిగింది. రూమర్లను ఎవరూ నమ్మొద్దు. మీ ప్రేమకు ధన్యవాదాలు” అని మంగ్లీ పేర్కొన్నారు.
ఈ ప్రమాదం విషయాల గురించి మంగ్లీ టీమ్‍లోని ఓ వ్యక్తి కూడా వెల్లడించారు. కంగారు పడాల్సిందేమీ లేదని, తాము అందరం సురక్షితంగానే ఉన్నామని అన్నారు. “ఆరోజు కారులో ప్రయాణించిన అందరూ సేఫ్‍గా ఉన్నారు. మేం ఓ ఈవెంట్‍కు హాజరై తిరిగి వస్తుండగా బెంగళూరు - హైదరాబాద్ హైవేపై ఈ ఘటన జరిగింది. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. మేడమ్ (మంగ్లీ)తో పాటు కారులో ఉన్న అందరూ క్షేమంగా ఉన్నారు. కారువైపునకు లారీ దూసుకొచ్చింది. కారు వెనుకవైపున లైట్ మాత్రమే దెబ్బ తినింది. మేం అందరూ సేఫ్‍గా ఉన్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఆ వ్యక్తి వెల్లడించారు.
హైదరాబాద్ సమీపంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమచారం బయటికి వచ్చింది. ఐపీసీ సెక్షన్ 279 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ముందుగా తెలంగాణ పాటలతో మంగ్లీ అలియాజ్ సత్యవతి చాలా ఫేమస్ అయ్యారు. ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. ఆ తర్వాత చిత్రాల్లోనూ వరుసగా పాటలు పాడుతున్నారు. అల వైకుంఠపురములో చిత్రంలో రాములో రాములా సాంగ్‍తో చాలా పాపులర్ అయ్యారు మంగ్లీ. లవ్ స్టోరీ చిత్రంలో ఆమె పాడిన సారంగదరియా కూడా హిట్ అయింది. అలాగే, ఆమె పాడిన చాలా పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా, ఫ్యామిలీ స్టార్ చిత్రంలో పెళ్లి పాట అయిన ‘కల్యాణి వచ్చా వచ్చా’ను కూడా మంగ్లీనే ఆలపించారు. స్టార్ మా ఛానెల్‍లో ఇటీవల సూపర్ సింగర్ షోలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు.