Jiiva: లైంగిక వేధింపులు కేరళలో మాత్రమే జరుగుతాయి, ఇక్కడ కాదు.. యాత్ర 2 హీరో కామెంట్స్‌పై సింగర్ కౌంటర్
Singer Chinmayi Sripada Jiiva Comments: లైంగిక వేధింపులు కేరళలో మాత్రమే జరుగుతాయని యాత్ర 2 హీరో, తమిళ యాక్టర్ జీవా షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. హీరో జీవా కామెంట్స్‌పై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది.
Singer Chinmayi Sripada Slams Jiiva: మలయాళ చిత్ర పరిశ్రమలో హేమా కమిటీ రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ రిపోర్ట్ స్టార్ హీరోలను సైతం ఇబ్బందిపెడుతోంది. దీని ప్రభావం కోలీవుడ్‌కు కూడా పాకింది. అయితే, ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో యాత్ర 2 హీరో, తమిళ నటుడు జీవా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాలీవుడ్‌లో లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చిన హేమా కమిటీ నివేదిక గురించి జీవాకు ఓ విలేకరి నుంచి ప్రశ్న ఎదురైంది. అయితే, కోలీవుడ్‌లో లైంగిక వేధింపులు లేవని జీవా సమాధానం ఇచ్చాడు. మళ్లీ అలాంటి ప్రశ్నే జీవాకు ఎదురుకాగా సహనం కోల్పోయారు. దీంతో జీవా, జర్నలిస్ట్ మధ్య కొద్దిపాటి తోపులాట జరిగినట్లు తెలుస్తోంది.
పార్ట్ 1- పార్ట్ 2
అయితే, ఆ కార్యక్రమంలో జీవా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. "దాని హేమ కమిటీ గురించి విన్నాను. గతంలో పార్ట్ 1 #MeToo చూశాం. ఇప్పుడు పార్ట్ 2 వచ్చింది. ఇప్పుడు, ప్రజలు బహిరంగంగా వారి (వేధింపులకు పాల్పడినవారు) పేర్లు చెబుతున్నారు. అది తప్పు. సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి'' అని జీవా అన్నారు.
"మరి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఎలా నెలకొనాలి" అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి జీవా నిరాకరించారు. "నేను ఒక మంచి ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చాను. కాబట్టి మంచి విషయాలు అడగండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. తేనవట్టు మూవీ షూటింగ్ ముగుంచుకున్నా" అని జీవా చెప్పాడు.
ఇక్కడ జరగవు
"సినీ పరిశ్రమలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మా పని మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం. నటులుగా మేము చాలా మంది వ్యక్తుల ముఖాల్లో చిరు నవ్వులు పూయిస్తాం. దీనిపై నేను ఇప్పటికే సమాధానం ఇచ్చాను. మళ్లీ మళ్లీ సమాధానం చెప్పలేను. అలాంటివి తమిళ ఇండస్ట్రీలో జరగవు. కేవలం కేరళలో మాత్రమే జరుగుతాయి" అని జీవా చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలోనే విలేకరిని సెన్స్ ఉందా అని జీవా అనడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కాసేపు అక్కడ తోపులాట జరిగినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఇక తాజాగా జీవా చేసిన కామెంట్స్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. "తమిళ పరిశ్రమలో లైంగిక వేధింపులు లేవని వారు ఎలా అంటున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఎలా?" అని చిన్మయి కౌంటర్ ఇచ్చింది.
సమాధానం చెప్పని రజనీ
కాగా ఇదివరకు తమిళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి చిన్మయి సోషల్ మీడియా వేదికగా గళమెత్తిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎయిర్ పోర్టులో కనపడిన రజినీకాంత్‌ను హేమ కమిటీపై మీడియా ప్రశ్నించింది. దానికి "నాకు తెలియదు. దాని గురించి నాకేమీ తెలియదు. క్షమించండి" అని రజనీకాంత్ సమాధానం ఇచ్చారు.
2017లో మహిళా నటిపై దాడి కేసు తర్వాత కేరళ ప్రభుత్వం జస్టిస్ కె.హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దోపిడీ ఘటనలను తన నివేదికలో వెల్లడించింది. అప్పటి నుంచి సిద్ధిఖీ, రంజిత్ వంటి నటులు, దర్శకులపై పలువురు నటులు లైంగిక వేధింపులు, వేధింపుల ఆరోపణలు చేశారు.