మ్యూజిక్ డైరెక్టర్‌పై దర్శకుడు యశస్వి ఫైర్.. ఒకప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా..
Siddharth Roy - Music Director Radhan: మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధార్థ్ రాయ్ మూవీ దర్శకుడు యశస్వి. అతడు ఇక్కడ ఉండి ఉంటే గొడవలు అయ్యేవంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Siddharth Roy Movie: అతడు, ఆర్య సహా మరిన్ని చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన దీపక్ సరోజ్.. ఇప్పుడు హీరోగా మారారు. అతడు హీరోగా నటించిన ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీ రిలీజ్‍కు రెడీ అయింది. బోల్డ్ సీన్లు, డైలాగ్‍లతో ట్రైలర్ ఉండటంతో బజ్ నెలకొంది. ఈ చిత్రం రేపు (ఫిబ్రవరి 23) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మూవీ టీమ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍పై దర్శకుడు యశస్వి స్టేజీపైనే ఫైర్ అయ్యారు. రధన్ తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చారు.
సిద్ధార్థ్ రాయ్ మూవీ ఆలస్యమయ్యేందుకు మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కారణమని యశస్వి చెప్పారు. గొడవ పడేందుకే రధన్ మాట్లాడతాడని, అతడి చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందని అన్నారు. అతడు ఇక్కడ ఉండి ఉండే గొడవలు అయ్యేవని చెప్పారు.
“సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. ఆ ఆలస్యానికి కారణం రధన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. నాలాగా ఎవరూ మోసపోకూడదని చెబుతున్నా. అద్భుతమైన టెక్నిషియన్ అని అతడి వద్దకు వెళుతున్నాం కానీ.. అతడి చేతుల్లో సినిమా నలిగిపోతుందండి. రధన్ అనే వ్యక్తి గొడవ పడేందుకే మాట్లాడతాడు” అని యశస్వి ఫైర్ అయ్యారు.
ఇక్కడ ఉంటే గొడవలయ్యేవి
రధన్ ఒకవేళ ఇక్కడ ఉండి ఉండే గొడవలు అయ్యేవని డైరెక్టర్ యశస్వి చెప్పారు. “చెన్నైకు సిట్టింగ్‍కు రావాలని అపాయింట్‍మెంట్ అడిగా. రాజమండ్రిలో ఉన్నప్పుడు రధన్ ఫోన్ వస్తే మాట్లాడా. ఆ ఫోన్ కాల్ ముగిసే సరికి వైజాగ్ వచ్చింది. ఎంత వాదన జరిగిందో మీరే ఊహించుకోవచ్చు. అతడు మ్యూజిక్ ఎంత బాగా చేస్తాడో తెలియదు కానీ.. సినిమాను కార్నర్‌కు తీసుకెళ్లి మనల్ని వదిలేస్తాడు. రధన్ చెన్నైలో ఉండి బతికిపోయాడని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఉండే గొడవలు అయ్యేవి చాలా” అని డైరెక్టర్ యశస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడు సందీప్ రెడ్డి వంగా కూడా..
అర్జున్ రెడ్డి సమయంలో రధన్ తనను కూడా ఇబ్బంది పెట్టారని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అప్పుడు ఓ ఇంటర్య్వూలో చెప్పారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని వదిలేస్తే ఇప్పుడు ఏం చేస్తావని తనను రధన్ బెదిరించారని సందీప్ అప్పట్లో చెప్పారు. ఆ సమయంలో తాను ఏమీ అనలేకపోయానని తెలిపారు.
ఇప్పుడు సిద్ధార్థ్ రాయ్ సినిమా విషయంలో రధన్‍పై దర్శకుడు యశస్వి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైలర్ తర్వాత సిద్ధార్థ్ రాయ్‍లో అర్జున్ రెడ్డి ఛాయలు కనిపిస్తున్నాయని టాక్ వచ్చింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా అలాగే అనిపిస్తోంది.
సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో దీపక్ సరసన తన్వీ నేగి హీరోయిన్‍గా నటించారు. ఆనంద్, కల్యాణి నటరాజన్, మాథ్యు వర్గీస్, నందిని, కీర్తన కీరోల్స్ చేశారు. శ్రీరాధ దామోదర్ స్టూడియోస్, విహాన్ & వినిన్ క్రియేషన్స్ బ్యానర్లు నిర్మించారు. ఈ చిత్రం రేపు (ఫిబ్రవరి 23) రిలీజ్ కానుంది.