Siddharth on Pushpa 2: పుష్ప 2పై నోరు పారేసుకున్న సిద్ధార్థ్.. బిర్యానీ, క్వార్టర్ కోసం కూడా వస్తారంటూ..
Siddharth on Pushpa 2: పుష్ప 2 మూవీపై తమిళ నటుడు సిద్ధార్థ్ నోరు పారేసుకున్నాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను పాట్నాలో నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Siddharth on Pushpa 2: తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పేరు సంపాదించిన నటుడు సిద్ధార్థ్ ఈ మధ్య పుష్ప 2 మూవీ గురించి చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. పాట్నాలో జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అభిమానుల గురించి అతడు మాట్లాడుతూ.. అదంతా మార్కెటింగ్ వ్యూహం అని, ఇండియాలో ఓ దగ్గరికి జేసీబీని తీసుకొచ్చినా చూడటానికి ఎగబడి జనాలు వస్తారంటూ అతడు అనడం గమనార్హం.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
పుష్ప 2.. అదేమంత పెద్ద విషయం కాదు: సిద్ధార్థ్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఓ వైపు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటే.. మరోవైపు సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ వీడియోను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. "షాకింగ్.. పుష్ప 2 కోసం వచ్చిన జనాలను సిద్ధార్థ్ మరీ దారుణంగా జేసీబీని చూడటానికి వచ్చే జనంతో పోల్చాడు" అంటూ అతడు ఆ వీడియోను పోస్ట్ చేశాడు.
అందులో సిద్ధార్థ్ ఏమన్నాడంటే.. "అదంతా మార్కెటింగ్. ఇండియాలో జనాల్ని పోగు చేయడం పెద్ద విషమేమీ కాదు. ఓ నిర్మాణం కోసం జేసీబీని తీసుకురండి.. జనాలు ఎగబడి చూస్తారు. బీహార్ లో జనాలను పోగు చేయడం పెద్ద విషమే కాదు. వాళ్లకో పాట ఉంది. సినిమా ఉంది. అది సహజమే. ఇండియాలో భారీ సంఖ్యలో జనం రావడానికి, క్వాలిటీకి సంబంధం లేదు. అలా అయితే అన్ని రాజకీయ పార్టీలు గెలుస్తాయి. ఆ రోజుల్లో బిర్యానీ, క్వార్టర్ బాటిల్స్ కోసం కూడా వచ్చేవారు" అంటూ సిద్ధార్థ్ అనడం షాక్ కు గురి చేసింది.
గత నెల 17న పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్ బీహార్ లోని పాట్నాలో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ అల్లు అర్జున్ ను చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వాళ్లను నియంత్రించడానికి పోలీసులు చాలానే శ్రమించాల్సి వచ్చింది.
సిద్ధార్థ్ మిస్ యూ మూవీ..
మరోవైపు సిద్ధార్థ్ నటించిన మిస్ యూ మూవీ ఈ శుక్రవారం (డిసెంబర్ 13) థియేటర్లలోకి రానుంది. అయితే తన సినిమాకు పుష్ప 2 నుంచి గట్టి పోటీ ఉండనుండటంపైనా గతంలో సిద్ధార్థ్ స్పందించాడు. "రెండో వారం కూడా నా సినిమా థియేటర్లలో ఉండాలంటే చాలా విషయాలు జరగాలి.
అందులో మొదటిది నా సినిమా బాగుండాలి. ప్రేక్షకులకు నచ్చాలి. తర్వాత వచ్చే సినిమా అంటారా అది వాళ్లు చూసుకోవాలి. నా సమస్య కాదు. ఒక సినిమా బాగుంటే అది థియేటర్లలో ఉండాల్సిందే. మంచి సినిమాను తీసేయలేరు. ముఖ్యంగా సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉన్న ఈ రోజుల్లో" అని సిద్ధార్థ్ అన్నాడు.