అగ్ర హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ శుభం. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి, శ్రియా కొంతం, షాలిని కొండెపూడి కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? నిర్మాతగా సమంతకు హిట్ దక్కిందా? లేదా? అంటే?
భీమునిపట్నం ఊళ్లో కేబుల్ టీవీ రన్ చేస్తుంటాడు శ్రీను(హర్షిత్ రెడ్డి). బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో (శ్రియా) శ్రీను పెళ్లవుతుంది. భార్యను తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని అనుకున్న శ్రీనుకు ఫస్ట్ నైట్ రోజే ఊహించని షాక్ తగులుతుంది. జన్మజన్మల బంధం సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్లుగా వింతగా ప్రవర్తిస్తుంది శ్రీవల్లి.
తన ప్రాణ స్నేహితుల (శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి) ఇంట్లోనూ ఇదే సమస్య ఎదురవుతుందని శ్రీనుకు తెలుస్తుంది. వారి భార్యల ఫరిదా, గాయత్రి కూడా రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే జన్మజన్మల బంధం సీరియల్ చూస్తూ వింతంగా ప్రవర్తిస్తున్నారని, అడ్డుకోబోతే చంపడానికి కూడా వెనుకాడటం లేదనే నిజం బయటపడుతుంది.
ఆ సీరియల్ కారణంగా ముగ్గురు స్నేహితులు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఆ సీరియల్‌కు ఆత్మలకు ఉన్న సంబంధమేమిటి? ఈ కష్టం నుంచి వారిని మాయ మాత ఎలా గట్టెక్కించింది? డిష్ కుమార్‌కు ఈ సీరియల్‌కు ఏమైనా సంబంధం ఉందా అన్నదే ఈ మూవీ కథ.
నిర్మాతగా తన తొలి సినిమాను భారీ బడ్జెట్, పేరున్న నటీనటులతో సమంత చేయచ్చు. కానీ అలా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎంచుకొని పరిమిత బడ్జెట్‌తో శుభం సినిమా చేసి వైవిధ్యతను చాటుకుంది.
ఆడవాళ్లలో ఉండే సీరియల్ పిచ్చి ప్రధానంగా సాగే హారర్ కామెడీ మూవీ ఇది. సింపుల్ పాయింట్‌తో చివరి వరకు ఎంటర్‌టైన్ చేశాడు డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల.
సీరియల్ అంటేనే ఏళ్లకు ఏళ్లు సాగడం కామన్. ఓ టీవీ సీరియల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ..అది పూర్తికాకుండానే చనిపోయిన వాళ్లు ఆత్మలై తిరిగి వచ్చి సీరియల్‌ను చూస్తే ఏంటన్నదే శుభం సినిమా కథ. ఈ గమ్మత్తైన కథను మూడు యువ జంటల జీవితాలతో అంతే ఫన్నీగా తెరపై చూపించారు దర్శకుడు. టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా కనిపించే స్త్రీల అణిచివేత, పురుషాధిక్యత లాంటి సున్నితమైన అంశాలను వివాదాలకు తావు లేకుండా వినోదాత్మకంగా డీల్ చేసిన విధానం బాగుంది.
2004లో బ్యాక్‌డ్రాప్‌లో శుభం కథ మొదలవుతుంది. ముగ్గురు స్నేహితుల జీవితాలు, భార్యలపై వారి డామినేషన్‌కు హారర్ ఎలిమెంట్ మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్‌ను నడిపించారు డైరెక్టర్. శ్రీనును పెళ్లి చేసుకున్న శ్రీవల్లికి అత్తింట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. ఆడవాళ్ల ముందు తలవంచకూడదని పెళ్లిలో శ్రీవల్లికి శ్రీను ఉంగరం తొడగనీయకుండా చేసే సీన్స్ ఆలోచనను రేకెత్తిస్తాయి.
బ్యూటీపార్లర్ పెట్టాలనే కల ఉన్నా భర్త మాటలకు కట్టుబడి నాలుగు గోడలకే పరిమితమై ఫరిదా ఎదుర్కొనే సంఘర్షణ . భర్త ఆధిపత్య ధోరణి కారణంగా గాయత్రి పడే ఇబ్బందులను హృద్యంగా చూపించారు. ఈ డామినేషన్‌ను మెసేజ్ ఇస్తున్నట్లుగా సీరియస్‌గా కాకుండా కామెడీగా చెప్పడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు.
సీరియల్ కారణంగా తమ భార్యలు ఎదుర్కొంటోన్న సమస్యకు పరిష్కారం కోసం ముగ్గురు చేసే ప్రయత్నాల చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. కీలకమైన సెకండాఫ్‌లో దర్శకుడు తడబడటంతో సినిమా సాగతీతగా మారింది. అసలు ట్విస్ట్ రివీలైన తర్వాత కూడా వచ్చే సీన్స్ ఆకట్టుకోవు. ఆల్ఫా మేల్ పాయింట్‌తో కథను బాగానే రాసుకున్న స్క్రీన్‌పై ఆ మ్యాజిక్ కనిపించలేదు.చాలా వరకు రిపీటెడ్ సీన్స్‌తో సినిమా బోర్ కొట్టిస్తుంది.
పురుషాధిక్య భావాలు కలిగిన స్నేహితులుగా హర్షిత్, శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఎమోషనల్, హారర్ సీన్స్‌లో మాత్రం పరిణితి చూపించలేకపోయారు.శ్రీవల్లి పాత్రకు శ్రియా కొంతం న్యాయం చేసింది. షాలిని కొండెపూడి, శ్రావణి లక్ష్మి నటన బాగుంది.
మాయ మాతగా సమంత గెస్ట్ రోల్ ఈ సినిమా ప్లస్సయింది. డైలాగ్ డెలివరీతోనే నవ్వించింది.టెక్నికల్‌గా వివేక్ సాగర్ పాటలు, బీజీఎమ్ బాగున్నాయి. విజువల్స్ మెప్పిస్తాయి. చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడ కలగదు.
శుభం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన హారర్ కామెడీ మూవీ. కామెడీని ఆశించి థియేటర్‌లో అడుగుపెడితే మాత్రం డిసపాయింట్ చేయదు.
రేటింగ్: 2.75/5
టాపిక్