Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి బయటపడ్డ స్టార్ హీరో.. అమెరికాలో సర్జరీ తర్వాత తొలి వీడియో
Shiva Rajkumar: కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు. అమెరికాలో సర్జరీ తర్వాత బుధవారం (జనవరి 1) తొలి వీడియో రిలీజ్ చేస్తూ.. తన అభిమానులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు.
Shiva Rajkumar: క్యాన్సర్ మహమ్మారిని జయించాడు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్. న్యూ ఇయర్ విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన వీడియోలో తనకు ఈ కష్ట కాలంలో అండగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మియామీలో అతనికి సర్జరీ నిర్వహించారు. క్యాన్సర్ బయటపడడానికి ముందే తాను ఎంతో భయపడ్డానని, అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అభిమానులు తనకెంతో ధైర్యాన్నిచ్చారని అతడు ఈ వీడియోలో తెలిపాడు.
క్యాన్సర్‌ను జయించిన శివ రాజ్ కుమార్
కన్నడనాట శివ రాజ్ కుమార్ ఓ పెద్ద స్టార్, ప్రొడ్యూసర్ కూడా. అలాంటి వ్యక్తి క్యాన్సర్ బారిన పడ్డాడని తెలియగానే అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. మొత్తానికి కీమో థెరపీ, సర్జరీ తర్వాత అతడు కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో తాను ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్ల గురించి వివరించాడు.
"నేను ముందే భయపడిపోయాను. కానీ అభిమానులు, బంధువులు, సహచర నటులు, డాక్టర్లు.. ముఖ్యంగా నాకు చికిత్స అందించిన డాక్టర్ శశిధర్, నర్సులు నాలో ధైర్యం నింపారు. కీమోథెరపీ కూడా చేయించుకున్నాను. కానీ దానిని ఎలా తట్టుకున్నానో నాకు తెలియదు. మియామీలో చికిత్స కోసం వెళ్లే సమయంలోనూ భయపడ్డాను. అయితే స్నేహితులు, కుటుంబ, శ్రేయోభిలాషులు నాకు అండగా నిలిచారు" అని శివ రాజ్ కుమార్ చెప్పాడు.
అందరికీ థ్యాంక్స్ చెప్పిన హీరో
ఈ వీడియోలో శివ రాజ్ కుమార్ తోపాటు అతని భార్య గీత కూడా ఉంది. ఆమె కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పింది. "నా కజిన్, భార్య గీత, ప్రశాంత్, నా ఫ్రెండ్ అను, మధు బంగారప్ప నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. డాక్టర్లు, మియామీ క్యాన్సర్ సెంటర్లోని సిబ్బంది మొత్తం చాలా బాగా సహకరించారు. కిడ్నీ బ్లాడర్ ను తొలగించారు. దాని స్థానంలో కొత్తది అమర్చారు. మీ అందరి దీవెనలు, డాక్టర్ల సలహాతో మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాను. త్వరలోనే మరింత బలంగా మీ ముందుకు వస్తాను. లవ్ యు ఆల్.. హ్యాపీ న్యూ ఇయర్" అని శివ రాజ్ కుమార్ అన్నాడు.
అందరి ఆశీస్సులు, ప్రార్థనలతో శివ రాజ్ కుమార్ బాగున్నాడని అతని భార్య గీత చెప్పింది. అన్ని రిపోర్టులు నెగటివ్ గా వచ్చినట్లు వెల్లడించింది. శివ రాజ్ కుమార్ క్యాన్సర్ ను జయించినట్లు అధికారికంగా ప్రకటించారని ఆమె తెలిపింది. బ్లాడర్ క్యాన్సర్ కోసం అతనికి సర్జరీ నిర్వహించారు. 62 ఏళ్ల శివ రాజ్ కుమార్ ఈ మధ్యే భైరతీ రణగల్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఆర్సీ16లోనూ అతడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే తమిళంలో దళపతి విజయ్ 69వ సినిమాలో నటిస్తున్నాడు.