OTT Action Thriller Movie: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళం స్లో-బర్న్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Adithattu OTT Release: సముద్రంలో వేటకి వెళ్లిన జాలర్ల బృందంలో ఒకరు హత్యకి గురవుతారు. దాంతో తమలో హంతకులు ఎవరో తెలియక ఆ జాలర్లు ఒకరిపై మరొకరు అనుమానం పెంచుకుని దాడులు, మర్డర్ మిస్టరీని ఛేదించే విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.
ఓటీటీలో ఇప్పటికే మలయాళం సినిమాలు దుమ్ముదులిపేస్తుండగా.. ఈ జాబితాలోకి మరో సినిమా కూడా చేరబోతోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల్ని కట్టిపడేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఆదితట్టు’.. ఈ వారంలోనే ఓటీటీలోకి రాబోతోంది.
జిజో ఆంటోని దర్శకత్వంలో సన్నీ వేన్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించిన ఆదితట్టు మూవీ.. సముద్రంలో వేటకి వెళ్లిన జాలర్ల చుట్టూ తిరుగుతుంది. వేటకి వెళ్లిన సమయంలో ఆ బృందంలోని ఒకరు హత్యకి గురవగా.. మిగిలిన వాళ్లు ఒకరిపై మరొకరు అనుమానం పెంచుకుంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటారు.
ఈ క్రమంలో సముద్రంలోనే ఆ మర్డర్ మిస్టరీని జాలర్లు ఛేదిస్తారా? ఆ హత్య చేసింది ఎవరు? చివరికి జాలర్లలో ఎంత మంది ఇంటికి చేరుతారు? ఇలా స్లో బర్న్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆదితట్టు అప్పట్లో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
వాస్తవానికి 2022, జూన్ 1న ఈ మలయాళం సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ.. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో.. వివిధ కారణాలతో స్ట్రీమింగ్‌కి ఉంచలేదు. అయితే ఎట్టకేలకి నవంబరు 15 నుంచి ఓటీటీలో ఈ క్రైమ్ థిల్లర్ మూవీ స్ట్రీమింగ్‌కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
కనైల్ ఫిల్మ్స్, మార్చి స్టూడియోస్ సంయుక్తంగా ఈ ఆదితట్టు సినిమాని నిర్మించగా.. ఫీనిక్స్ ప్రభు సముద్రంపై యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పోశారు. మార్కోస్‌గా సన్నీ వేన్, అంబ్రోస్‌గా షైన్ టామ్ చాకో , స్రాంక్ రాయన్‌గా అలెగ్జాండర్ ప్రశాంత్, నెల్సన్‌గా మురుగన్ మార్టిన్ నటించారు. ఈ సినిమాకి నెజర్ అహమ్మద్, శ్రీహరి కె. నాయర్ సంగీతం అందించారు.
ఒక గంట 34 నిమిషాలు నిడివి ఉన్న ఈ ఆదితట్టు మూవీకి ఐఎండీబీలో 6.3 రేటింగ్ వచ్చింది. సినిమాకి అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం ఆశించిన మేర రాలేదు. అయితే.. ఓటీటీలో ఈ సినిమాని చూసేందుకు అప్పట్లో నెటిజన్లు చాలా ఆసక్తి కనబర్చారు. కానీ.. రెండేళ్లు ఆలస్యంగా వస్తోంది.
థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసేవారు.. ఈ సినిమాను బాగా ఆస్వాదిస్తారు.