Telugu OTT: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి శర్వానంద్ మనమే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telugu OTT: థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత శర్వానంద్ మనమే మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ నెలలో ఈ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.
Telugu OTT: శర్వానంద్ మనమే మూవీ ఓటీటీ అడ్డంకులు తొలగిపోయినట్లు సమాచారం. ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ నెలలో థియేటర్లలో రిలీజైన రొమాంటిక్ కామెడీ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.
వివాదం కారణంగా...
మనమే సినిమా ఆగస్ట్‌లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ఓటీటీ రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించాడు.
ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కులను కొన్నవారు తమకు డబ్బులు చెల్లించలేదని, వారి మోసంపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. మనమే తర్వాత రిలీజైన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తూ తమ సినిమాను మాత్రం కావాలనే రిలీజ్ చేయకుండా ఆపేస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు.
వివాదం కొలిక్కి...
కాగా మనమే ఓటీటీ, శాటిలైట్ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో మనమే మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
విక్రమ్...సుభద్ర కథ...
ప్రేమ, పెళ్లి లాంటి బంధాలకు దూరంగా ఉంటూ లైఫ్‌ను సరదాగా గడిపేయాలన్నది విక్రమ్ (శర్వానంద్) సిద్ధాంతం (శర్వానంద్). విదేశాల్లో సెటిల్ అవుతాడు. అనాథ అయిన ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్) పెళ్లిని శాంతితో విక్రమ్ దగ్గరుండి జరిపిస్తాడు. ఓ పని మీద ఇండియా వచ్చిన అనురాగ్‌తో పాటు అతడి భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు ఖుషి ఒంటరివాడైపోతాడు. ఖుషి బాధ్యతల్ని విక్రమ్‌తో పాటు శాంతి స్నేహితురాలు సుభద్ర (కృతిశెట్టి) చేపడతారు.
పెళ్లి కాకుండానే ఖుషికి విక్రమ్, సుభద్ర తల్లిదండ్రులుగా ఎందుకు మారాల్సివచ్చింది. ఖుషిని పెంచే విషయంలో విక్రమ్, సుభద్ర లకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టాన్ని ఎలా తెలుసుకున్నారు? సుభద్ర లైఫ్‌లోకి వచ్చిన భర్త కార్తీక్ (శివ కందుకూరి) ఎవరు? వీరి ప్రేమకథలో జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్) పాత్ర ఏమిటనే అంశాలతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు.
సీరత్‌కపూర్...రాహుల్ రవీంద్రన్...
మనమే మూవీలో రాహుల్ రవీంద్రన్, సీరత్‌కపూర్, శివ కందుకూరి, ఆయేషాఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. దాదాపు పదహారు పాటలతో మనమే మూవీ రిలీజైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మనమే మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో...
ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోన్నాడు శర్వానంద్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న మూవీ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇందులో శర్వానంద్ బైక్ రైడర్ పాత్రలో కనిపించబోతున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న 36వ సినిమా ఇది. అలాగే సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.