Shanmukha Review: ష‌ణ్ముఖ రివ్యూ - ఆది సాయికుమార్ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-shanmukha telugu movie review aadi saikumar avika gor latest telugu devotional thriller movie review and rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shanmukha Review: ష‌ణ్ముఖ రివ్యూ - ఆది సాయికుమార్ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Shanmukha Review: ష‌ణ్ముఖ రివ్యూ - ఆది సాయికుమార్ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu

Shanmukha Review: ఆది సాయికుమార్‌, అవికాగోర్ జంట‌గా న‌టించిన ష‌ణ్ముఖ మూవీ మార్చి 21న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజైంది. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

ష‌ణ్ముఖ రివ్యూ

ఆది సాయికుమార్‌, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన మూవీ ష‌ణ్ముఖ‌. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.ఆదిత్యం ఓం, అరియానా గ్లోరీ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

అమ్మాయిల మిస్సింగ్‌....

సిటీలో అమ్మాయిలు వ‌రుస‌గా మిస్స‌వుతుంటారు. ఆ త‌ర్వాత నెల‌లోపే వారి బాయ్‌ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకుంటుంటారు. ఈ మిస్ట‌రీపై రీసెర్చ్ చేస్తుంటుంది క్రిమినాల‌జీ స్కాల‌ర్ సారా (అవికాగోర్‌). ఈ అన్వేష‌ణ‌లో మాజీ బాయ్‌ఫ్రెండ్ పోలీస్ ఆఫీస‌ర్‌ కార్తీ(ఆది సాయికుమార్) సాయం కోరుతుంది.

తొలుత సారా మాట‌లు అబ‌ద్ధ‌మ‌ని కొట్టిప‌డేసిన కార్తీ సాయం చేయ‌డానికి ఒప్పుకోడు. ఆ త‌ర్వాత ఆమె మాట‌లు నిజ‌మ‌ని తెలుసుకొని కార్తీ మిస్సింగ్‌ల‌పై ఇన్వేస్టిగేష‌న్ మొద‌లుపెడ‌తాడు. మ‌రోవైపు ఓ మారుమూల ప‌ల్లెటూరికి చెందిన‌ విగాండ‌కు (చిరాగ్ జానీ) ఆరు ముఖాల‌తో ఉన్న కొడుకు ష‌ణ్ముఖ‌ పుడ‌తాడు. ష‌ణ్ముఖ‌ను చూసిన వారంతా భ‌యంతో పాటు అస‌హ్యించుకోవ‌డం విగాండ‌ను బాధ‌పెడుతుంది. భిన్న రాశుల‌కు చెందిన అమ్మాయిల‌ను బ‌లిస్తే ష‌ణ్ముఖ‌ అంద‌గాడిగా మారుతాడ‌ని విగాండ‌కు ఓ మాంత్రికుడు చెబుతాడు.

కొడుకు వికృత రూపం పోవ‌డానికి మాంత్రికుడు చెప్పిన‌ట్లుగా అమ్మాయిల‌ను కిడ్నాప్ చేస్తూ హ‌త్య చేస్తుంటాడు విగాండ‌. విగాండ‌కు సిటీలో అమ్మాయిల మిస్సింగ్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ఆ కిడ్నాప‌ర్ చేతికే సారా ఎలా చిక్కింది? కాలేజీలో ఒక‌రినొక‌రు ప్రాణంగా ప్రేమించుకున్న సారా, కార్తీ ఎలా విడిపోయారు? విగాండ కొడుకు అంద‌గాడిగా మారాడా? క‌మ‌ల్ (ఆదిత్యం ఓం), వ‌ర్షిత‌(అరియానా గ్లోరీ)ల‌కు కార్తీ, సారాల‌తో ఉన్న సంబంధం ఏమిటి అన్న‌దే ష‌ణ్ముఖ మూవీ క‌థ‌.

డివోష‌న‌ల్ ట్రెండ్‌...

కొన్నాళ్లుగా డివోష‌న‌ల్, మైథ‌లాజిక‌ల్‌ సినిమాల ట్రెండ్ ఎక్కువైంది. పురాణాలు, ఇతిహానాల, దేవుళ్ల, పురాత‌న ఆల‌యాల నేప‌థ్యాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ పెద్ద విజ‌యాల‌ను అందుకుంటున్నారు ద‌ర్శ‌కులు. ష‌ణ్ముఖ కూడా ఆ కోవ‌కు చెందిన మూవీనే. క్షుద్ర పూజ‌లు అనే కాన్సెప్ట్‌కు అమ్మాయిల మిస్సింగ్ అంశాన్ని జోడించి ద‌ర్శ‌కుడు ష‌ణ్ముగం సాప్ప‌ని ఈ మూవీని తెర‌కెక్కించాడు.

రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ...

ఓ వైపు విగాండ క‌థ‌, మ‌రోవైపు కార్తీ, సారా ఇన్వేస్టిగేష‌న్ రెండు వేర్వేరు నేప‌థ్యాల‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంఉది. ఆ త‌ర్వాత వాటిని లింక్ చేసే విధానం థ్రిల్లింగ్‌ను పంచుతుంది.డ్ర‌గ్స్ మాఫియా లాంటి అంశాల‌తో పాటు రొమాంటిక్ ల‌వ్‌స్టోరీని ఈ మూవీలో చూపించాడు.

క‌మ‌ర్షియ‌ల్ సినిమా...

వికృత రూపంలో ష‌ణ్ముఖ జ‌ననం, అంద‌గాడిగా మారిడం కోసం అమ్మాయిల‌ను బ‌లి ఇవ్వ‌డం లాంటి అంశాల‌తో ఈ సినిమా ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మ‌వుతుంది. కార్తీగా ఆది క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా మారిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది. డ్ర‌గ్స్ మాఫియాపై ఆది పోరాటాన్ని యాక్ష‌న్ ఆడియెన్స్ కోస‌మే డిజైన్ చేసిన‌ట్లుగా అనిపిస్తాయి. ఆది, అవికాగోర్ ల‌వ్‌స్టోరీ టైమ్‌పాస్ చేస్తుంది.

అమ్మాయిల‌ను కిడ్నాప్ చేస్తుంది ఎవ‌రు? బాయ్‌ఫ్రెండ్స్ ఎందుకు చ‌నిపోతున్నారు అనే ప్ర‌శ్న‌ల‌ను ఫ‌స్ట్ హాఫ్‌లో రేకెత్తించి వాటికి స‌మాధానాల‌ను సెకండాఫ్‌లో ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు.

ఊహ‌ల‌కు భిన్నంగా...

ఆరంభంలో కాస్తంత క‌న్ఫ్యూజ‌న్ చేసిన ద‌ర్శ‌కుడు ప్రీ క్లైమాక్స్‌లో మాత్రం ప‌ట్టు క‌న‌బ‌రిచాడు. ఊహ‌ల‌కు భిన్నంగా క్లైమాక్స్‌ను ఎండ్ చేయ‌డం బాగుంది.సింపుల్ స్టోరీ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌ల‌తో కొత్త‌గా చెప్పాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో కొన్ని చోట్ల త‌డ‌బ‌డ్డాడు. కొన్ని లాజిక్‌ల‌ను మిస్ చేశాడు. ఆది, అవికా గోర్ ల‌వ్‌స్టోరీని రొమాన్స్‌, కామెడీ పాళ్లు ఇంకాస్త ఉంటే బాగుండేది.

ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్‌...

పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల‌కు తాను ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అని ష‌ణ్ముక సినిమాతో ఆది మ‌రోసారి నిరూపించాడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో అద‌ర‌గొట్టాడు. అవికాగోర్ యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించింది. గ్లామ‌ర్‌తో మెప్పించింది. విల‌న్లుగా బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్య ఓంతో పాటు చిరాగ్ జానీ క‌నిపించారు. మ‌నోజ్ నందం, కృష్ణుడు, ఆరియానా గ్లోరీ, చిత్రం శ్రీనుతో పాటు ప‌లువురు సీనియ‌ర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో క‌నిపించారు. ద‌ర్శ‌కుడు కూడా ఓ నెగెటివ్ షేడ్ పాత్ర‌లో త‌ళుక్కున మెరిశారు.

ఏఐ సాంగ్‌...

ర‌వి బ‌స్రూర్ బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. క్లైమాక్స్ అత‌డి మ్యూజిక్ గూస్‌బంప్స్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. చివ‌ర‌లో ఏఐతో క్రియేట్ చేసిన డివోష‌న‌ల్ ఫీల్‌ను క‌లిగిస్తుంది.

థ్రిల్ల‌ర్ మూవీ ల‌వ‌ర్స్‌...

థ్రిల్ల‌ర్ మూవీస్‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను కొంత వ‌ర‌కు ష‌ణ్ముఖ మెప్పిస్తుంది. ఆది సాయికుమార్ గ‌త సినిమాల‌తో పోలిస్తే కాన్సెప్ట్, మేకింగ్ ప‌రంగా ష‌ణ్ముఖ కొత్త‌గా అనిపిస్తుంది.

రేటింగ్: 2.75/5

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం