Shaktimaan: శక్తిమాన్ ఈజ్ బ్యాక్.. ఇండియా తొలి సూపర్ హీరో మళ్లీ వచ్చేస్తున్నాడు.. 1990ల్లోకి మళ్లీ వెళ్తారా?
Shaktimaan: శక్తిమాన్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈ సూపర్ హీరో పాత్రతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు ముఖేష్ ఖన్నా.. ఈ విషయాన్ని రెండు రోజుల కిందట వెల్లడించగా.. తాజాగా మరోసారి ఈ పాత్ర పోషిస్తుండటంపై ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
Shaktimaan: ఇండియాలో తొలి సూపర్ హీరోగా ఫ్యాన్స్ అభివర్ణించే శక్తిమాన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పుడో 27 ఏళ్ల కిందట దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ ఓ ఊపు ఊపేసింది. మళ్లీ ఇప్పుడు అదే పాత్రలో వెటరన్ నటుడు ముఖేష్ ఖన్నా రాబోతున్నాడు. సుమారు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పాత్ర పోషిస్తుండటంపై ఏఎన్ఐతో మాట్లాడిన అతడు.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇది నాలో ఉన్న పాత్ర: ముఖేష్ ఖన్నా
ఇండియా ఒరిజినల్ సూపర్ హీరో శక్తిమాన్ 1997 నుంచి 2005 వరకు టెలికాస్ట్ అయింది. మొత్తం 450 ఎపిసోడ్ల పాటు సాగింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ శక్తిమాన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో ముఖేష్ ఖన్నా స్పందించాడు. "ఇది నాలో ఉన్న కాస్ట్యూమ్. నా వరకూ వ్యక్తిగతంగా ఈ కాస్ట్యూమ్ నాలో నుంచి వచ్చింది.
అలా వచ్చింది కాబట్టే ఈ పాత్రను నేను చాలా బాగా చేయగలిగాను. నటన అనేది పూర్తిగా ఆత్మవిశ్వాసానికి సంబంధించినదే. నేను షూటింగ్ చేస్తున్న సమయంలో కెమెరాను మరచిపోతాను. మళ్లీ శక్తిమాన్ అయినందుకు అందరి కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాను" అని ముఖేష్ ఖన్నా అన్నాడు.
అందుకే మళ్లీ శక్తిమాన్‌గా..
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ శక్తిమాన్ గా వస్తుండటంపై కూడా ముఖేష్ ఖన్నా తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు. "1997లో మొదలై 2005 వరకు నేను చేసిన డ్యూటీని మళ్లీ మోస్తున్నాను. 2027లోనూ నా నటన అందరికీ చేరాలి. ఎందుకంటే ఈ తరం గుడ్డిగా పరిగెత్తుతూనే ఉంది. వాళ్లను ఆపాలి. కాస్త ఊపిరి పీల్చుకునేలా చేయాలి" అని అన్నాడు.
2005లో ముగిసిన శక్తిమాన్ సీరియల్ మళ్లీ రాబోతున్నట్లు గత ఆదివారం (నవంబర్ 10) ముఖేష్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా తాను శక్తిమాన్ కాస్ట్యూమ్ లో ఉన్న ఫొటోలు, వీడియోలను కూడా అతడు షేర్ చేశాడు. "అతడు మళ్లీ వచ్చే సమయం వచ్చేసింది. మన తొలి ఇండియన్ సూపర్ టీచర్, సూపర్ హీరో. ఈ కాలం పిల్లలపై అంధకారం, దుష్టశక్తులు మరోసారి ఆవహించిన వేళ.. అతడు మళ్లీ రావాల్సిందే. అతడో సందేశంతో రాబోతున్నాడు. ఓ పాఠంతో రానున్నాడు. ఈ తరం వాళ్ల కోసం. అతన్ని రెండు చేతులతో స్వాగతించండి" అంటూ ముఖేష్ ఖన్నా పోస్ట్ చేశాడు.
ఇండియాలో వచ్చిన పాపులర్ సూపర్ హీరో షోలలో శక్తిమాన్ కూడా ఒకటి. 1997లో తొలిసారి దూరదర్శన్ లో టెలికాస్ట్ అయింది. ఎనిమిదేళ్ల పాటు 450 ఎపిసోడ్లు సాగింది. ఇప్పుడు మరోసారి వస్తుండటంతో ఆ కాలం పిల్లలు మళ్లీ 1990ల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి.