కింగ్‍డమ్ సినిమా షూటింగ్‍ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూర్తి చేసుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అయితే మే 30 నుంచి జూలై 4వ తేదీకి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, బాద్‍షా షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడారు.
షారుఖ్ ఖాన్ నుంచి తాను స్పూర్తి పొందానని విజయ్ దేవరకొండ చెప్పారు. ఎవరో సక్సెస్ సాధిస్తే.. తాను ఎందుకు చేయలేనని అనిపించేదని చెప్పారు. “షారుఖ్ ఖాన్ సక్సెస్ నన్ను ఎంత ముందుకు నడిపించిందో నేను చెప్పలేను. కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది. నువ్వు చేసినప్పుడు.. నేనెందుకు చేయలేనని అనిపించింది. రిఫరెన్స్‌గా ఓ సక్సెస్‍ఫుల్ వ్యక్తిని తీసుకోవాలి. నేను పెద్దగా ఫేమస్ కానప్పుడు కూడా చాలా సినిమాలు చేసేందుకు తిరస్కరించా. పెద్ద విషయాలు చేసేందుకు నేను ఉన్నానని ఫీలయ్యే వాడిని. ఇలా ఉంటే నీకు ఎప్పటికీ అవకాశాలు రావని చాలా మంది అనే వారు. కానీ నాపై నాకు అంచనాలు చాలా ఉండేవి” అని విజయ్ తెలిపారు.
స్టార్లలో తానే లాస్ట్ అని గతంలో ఓ సందర్భంలో షారుఖ్ ఖాన్ అన్నారు. ఎప్పుడైనా షారుఖ్‍ను కలిస్తే ఆ మాట తప్పు అని తాను చెప్పాలనుకున్నానని విజయ్ దేవరకొండ చెప్పారు. “నేను ఆ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు.. షారుఖ్ ఖాన్ నువ్వు తప్పు.. నువ్వే లాస్ట్ స్టార్ కాదు. నేను వస్తున్నానని చెప్పాలనుకున్నా” అని విజయ్ వెల్లడించారు.
అనుపమ్ ఖేర్ హోస్ట్ చేసిన ‘అనుపమ్ ఖేర్ షో’లో గతంలో షారుఖ్ పాల్గొన్నారు. సక్సెస్, డామినేషన్‍లో ఎవరైనా మిమ్మల్ని దాటగలరా అనే ప్రశ్నకు షారుఖ్‍కు వచ్చింది. “లేదు. అది ఎప్పటికీ జరగదు. నేను నిజంగా ఓ మాట చెప్పాలనుకుంటున్నా. స్టార్లలో నేనే లాస్ట్” అని షారుఖ్ చెప్పారు. అప్పుడు అనుపమ్‍తో పాటు అక్కడి వారు హర్షధ్వానాలు చేశారు. ఆ కామెంట్ తప్పు అని తాను చెప్పాలని అనుకున్నానని విజయ్ ఇప్పుడు వెల్లడించారు.
పాన్ ఇండియా రేంజ్‍లో కింగ్‍డమ్ చిత్రం రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో రూపొందింది. జూలై 4న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించారు.
సంబంధిత కథనం