Shah Rukh Khan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుక్ ఖాన్.. హిందూ సాంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు వైరల్-shah rukh khan visits tirumala temple with suhana khan nayanthara ahead jawan release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh Khan Visits Tirumala Temple With Suhana Khan Nayanthara Ahead Jawan Release

Shah Rukh Khan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుక్ ఖాన్.. హిందూ సాంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు వైరల్

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2023 08:06 AM IST

Shah Rukh Khan In Tirumala: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ఆయన కూతురు సుహానా ఖాన్‍తో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. హిందూ సాంప్రదాయ దుస్తుల్లో శ్రీవారి సేవలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు.

తిరుమలలో షారుక్ ఖాన్
తిరుమలలో షారుక్ ఖాన్

హిందీ చిత్ర సీమలో సీనియర్ అండ్ క్రేజీ హీరో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 5) తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. హిందూ సాంప్రదాయ దుస్తుల్లో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనతోపాటు భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, లేడి సూపర్ స్టార్ నయనతార ఉన్నారు. వీరంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు షారుక్ ఖాన్‍కు వేదాశీర్వచనాలు అందించారు.

అలాగే షారుక్ ఖాన్ కుటుంబానికి, నయనతారకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు షారుక్ ఖాన్‍కు ఆలయ ప్రధాన ద్వారా వద్ద ఘనంగా స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ తిరుమలను దర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముస్లిం అయిన షారుక్ ఖాన్ ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రమైన తిరుమలను దర్శించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొప్పవారికి మత బేధం ఉండదని, దేవుడు ఒక్కడే అని నమ్ముతారని ఆయన్ను కొనియాడుతున్నారు.

అయితే షారుక్ ఖాన్, నయనతార కలిసి తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ సినిమా సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే షారుక్ ఖాన్, నయనతార తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఏది ఏమైనా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ తిరుమలను సందర్శించడం ప్రస్తుతం నెట్టింట్లో ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జవాన్ ట్రైలర్, సాంగ్స్ అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటికే పఠాన్ వంటి భారీ హిట్ కొట్టిన షారుక్ ఖాన్ మరోసారి రికార్డులు బద్దలయ్యే హిట్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

IPL_Entry_Point