Shah Rukh Khan to Allu Arjun: పుష్ప మూవీ మూడు రోజుల్లో మూడుసార్లు చూశా.. నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి: బన్నీతో షారుక్
Shah Rukh Khan to Allu Arjun: పుష్ప మూవీ మూడు రోజుల్లో మూడుసార్లు చూశా అంటూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జవాన్ మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించడంతో షారుక్ ఇలా స్పందించాడు.
Shah Rukh Khan to Allu Arjun: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.600 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు సెలబ్రిటీలకు కూడా బాగా నచ్చింది. జవాన్ మూవీని ప్రశంసిస్తూ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
"జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో టీమ్ అందరికీ శుభాకాంక్షలు. సినిమాలోని నటీనటులు, టెక్నీషియన్లు, సిబ్బంది, ప్రొడ్యూసర్లకు అభినందనలు. షారుక్ ఖాన్ గారి మాసీయెస్ట్ అవతార్ ఇది. తన స్వాగ్ తో ఇండియాను, ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్" అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. దీనికి తాజాగా షారుక్ స్పందించాడు.
"స్వాగ్ విషయానికి వస్తే ఫైరే నన్ను పొగుడుతోంది. వావ్.. చాలా సంతోషంగా ఉంది. జవాన్ సక్సెస్ రెట్టింపైంది. నేను పుష్ప మూవీ మూడు రోజుల్లో మూడుసార్లు చూశాను. నీ నుంచి నేను నేర్చుకోవాలి. నా నుంచి నీకో పెద్ద హగ్. టైమ్ దొరికినప్పుడు నేరుగా వచ్చి కౌగిలించుకుంటా. కీప్ స్వాగింగ్. లవ్ యూ" అని షారుక్ ఖాన్ అనడం విశేషం.
పుష్ప మూవీకిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ నటనకు ఫిదా కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడతడు పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నట్లు ఈ మధ్యే మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.
మరోవైపు షారుక్ నటించిన జవాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. ఈ మూవీలో షారుక్ సరసన నయనతార నటించింది. అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.600 కోట్లకుపైగా వసూలు చేసింది.