Jawan Movie Release Date : సెప్టెంబర్ 7న వస్తున్నాడు జవాన్
Shah Rukh Khan Jawan : పఠాన్ సినిమాతో ఈ ఏడాది మెుదట్లో అదరగొట్టిన షారూఖ్ ఖాన్.. జవాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. జవాన్ సినిమాను సెప్టెంబరులో విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది పఠాన్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan). ఇప్పుడు మరోసారి ‘జవాన్’గా ఆడియెన్స్‌ను అలరించటానికి రెడీ అయ్యాడు. అట్లీ(Atlee) దర్శకత్వంలో జవాన్(Jawan) సినిమా రూపొందుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘జవాన్’ సినిమాను విడుదల(Jawan Release) చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ మాస్క్ ధరించిన హీరో పదునైన ఈటెను పట్టుకుని ఎగురుతున్నాడు. పోస్టర్ చూస్తుంటే.. మరోసారి షారూఖ్ యాక్షన్ తో ఆకట్టుకోనున్నట్టుగా తెలుస్తోంది.
షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కీలక పాత్రలో నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara) కూడా ఉంది. ఈ సినిమా పోస్టర్ తో భారీ అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ రవిచందర్(anirudh ravichander) సంగీతం, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జవాన్ సినిమా జూన్ 2న విడుదల అవుతుందని మెుదట ప్రకటించింది. ఆ తర్వాత విడుదల వాయిదా వేశారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా ప్రకటించారు.
కొన్ని రోజుల కిందట.. జవాన్ సినిమాకు సంబంధించి.. వీడియో క్లిప్స్ లీక్(Jawan Movie Videos Leak) అయ్యాయి. ఇందులో ఒక వీడియోలో షారూఖ్ ఖాన్ ఫైట్ సీన్లు చేస్తున్నట్టుగా ఉంది. మరో వీడియోలో నయనతారతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపించింది. ఇవి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యాయి. దీనిపై షారూఖ్ ఖాన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. జవాన్ సినిమాకు సంబంధించి.. కంటెంట్ ను ఎక్కడా ప్రసారం చేయకూడదని ఆదేశించింది. ఈ క్లిప్స్ ను తొలగించాలని యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లను కోర్టు ఆదేశించింది.