Shah Rukh Khan: పఠాన్, జవాన్ చెత్త సినిమాలన్న అభిమాని.. షారుక్ ఖాన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Shah Rukh Khan: పఠాన్, జవాన్ చెత్త సినిమాలన్న అభిమానికి దిమ్మదిరిగే జవాబిచ్చాడు షారుక్ ఖాన్. సోషల్ మీడియా ఎక్స్‌లో అభిమానులతో చాట్ చేసిన అతడు.. వాళ్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ బుధవారం (డిసెంబర్ 6) అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని పఠాన్, జవాన్ సినిమాలపై నోరు పారేసుకున్నాడు. అవి రెండూ చెత్త సినిమాలని, పీఆర్ బాగా చేయడంతో హిట్ అయ్యాయని అతడు అనడంతో షారుక్ అతనికి గట్టి జవాబిచ్చాడు.
సోషల్ మీడియా ఎక్స్ ద్వారా షారుక్ ఖాన్ #AskSrk సెషన్ నిర్వహించాడు. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుండగా.. ఓ అభిమాని అతని చివరి రెండు సినిమాల గురించి ఓ ప్రశ్న అడిగాడు. "మీ సమర్థవంతమైన పీఆర్ టీమ్ వల్ల మీ గత రెండు చెత్త సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఇప్పుడు డంకీ సినిమాను కూడా మరో గోల్డెన్ చెత్త సినిమాగా చేస్తారని మీ పీఆర్ టీమ్ పైన మీకు నమ్మకం ఉందా" అని ఆ అభిమాని అడిగాడు.
దీనికి షారుక్ స్పందించాడు. "మీలాంటి అద్భుతమైన తెలివైన వ్యక్తులకు నేను సాధారణంగా సమాధానం ఇవ్వను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నాను. ఎందుకంటే మీకు మలబద్ధకానికి చికిత్స అవసరం. మీకు గోల్డెన్ మెడిసిన్ పంపించమని మా పీఆర్ టీమ్ కు చెబుతాను.. త్వరలోనే కోలుకుంటావని ఆశిస్తున్నాను" అని షారుక్ రిప్లై ఇచ్చాడు.
2023లో పఠాన్, జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుక్ ఖాన్.. రెండు రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు ఇచ్చాడు. ఇప్పుడు డంకీతో మరోసారి రాబోతున్నాడు. మంగళవారం (డిసెంబర్ 5) డంకీ ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో షారుక్ పంజాబీ డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఈ డంకీ ట్రైలర్ తొలి 24 గంటల్లో అత్యధిక మంది చూసిన హిందీ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది.