Shah Rukh Khan: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్-shah rukh khan admitted to hospital due to heat stroke in ahmedabad day after kkr vs srh ipl 2024 match ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్

Shah Rukh Khan: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్

Chatakonda Krishna Prakash HT Telugu
May 22, 2024 09:56 PM IST

Shah Rukh Khan Hospitalised: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. అహ్మదాబాద్‍లో నేడు వడదెబ్బకు గురైన ఆయన చికిత్స కోసం హాస్పిటల్‍కు వెళ్లారు.

Shah Rukh Khan: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్
Shah Rukh Khan: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (PTI)

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‍షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. అహ్మదాబాద్‍లో వడదెబ్బకు గురైన ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ మధ్య మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్‍కు షారుఖ్ హాజరయ్యారు. కోల్‍కతా గెలిచిన తర్వాత స్టేడియంలో ఆ జట్టు ఓనర్ అయిన షారుఖ్ సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేశారు. అయితే, అహ్మదాబాద్‍లో అధిక ఉష్ణోగ్రత వల్ల నేడు (మే 22) షారుఖ్ ఖాన్ వడదెబ్బకు గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. షారూఖ్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది.

yearly horoscope entry point

కోలుకున్న షారుఖ్.. డిశ్చార్జ్

అహ్మదాబాద్‍లోని కేడీ ఆసుపత్రిలో షారుఖ్ ఖాన్ చేరినట్టు తెలుస్తోంది. “అహ్మదాబాద్‍లో సుమారు 45 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో షారుఖ్ డీహైడ్రేషన్‍కు గురయ్యారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆసుపత్రి చుట్టూ భద్రత పెంచాం” అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‍ఎస్ పేర్కొంది. అయితే, ఆయన ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్టు కూడా సమాచారం బయటికి వచ్చింది.

షారుఖ్‍తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్, ఫ్రెండ్ జూహి చావ్లా ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. షారుఖ్ పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సెలెబ్రేట్ చేసుకున్న షారుఖ్

ఐపీఎల్ 2024 సీజన్ క్వాలిఫయర్-1లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై గెలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్ ఫైనల్ చేరింది. మంగళవారం (మే 22) అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో కోల్‍కతా అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత మైదానంలో షారుఖ్ ఖాన్ సెలెబ్రేట్ చేసుకున్నారు. గ్రౌండ్ అంతా తిరుగుతూ స్టాండ్స్‌లో ప్రేక్షకులకు అభివాదం చేశారు. రెండు చేతులను చాపి తన ఐకానిక్ పోజ్ ఇచ్చారు బాద్‍షా. తన కూతురు సుహానా, కుమారుడు అబ్‍రామ్‍తో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.

గతేడాది హ్యాట్రిక్

షారుఖ్ ఖాన్ గతేడాది హ్యాట్రిక్ హిట్‍లతో మోత మోగించారు. షారూఖ్ హీరోగా నటించిన పఠాన్, జవాన్ సినిమాలు గతేడాది బ్లాక్‍బస్టర్ అయ్యాయి. చెరో రూ.1000కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకొని ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన డంకీ మూవీ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. కామెడీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం కూడా రూ.700కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. ఇలా.. 2023లో షారుఖ్ హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. అయితే, ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. ఐపీఎల్‍లో తన టీమ్ కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సీజన్‍లో కేకేఆర్ ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‍లకు హాజరయ్యారు.

ఈ ఏడాది ఐపీఎల్‍లో మెంటార్ గౌతమ్ గంభీర్ దిశానిర్దేశంలో శ్రేయర్ అయ్యర్ సారథ్యంలో కోల్‍కతా నైట్‍రైడర్స్ దుమ్మురేపుతోంది. లీగ్ దశలో టాప్‍లో నిలిచి సత్తాచాటింది. క్వాలిఫయర్-1లో గెలిచి ఫైనల్ చేరింది. మే 26న చెన్నై చెపాక్ వేదికగా తుదిపోరులో తలపడనుంది.

Whats_app_banner