Prabhas: ‘అవసరమా డార్లింగ్స్’: ప్రభాస్ స్పెషల్ వీడియో.. క్లాస్ లుక్‍లో రెబల్ స్టార్
Prabhas: డ్రగ్స్ నిర్మూలన కోసం ఓ అవగాహన వీడియో చేశారు ప్రభాస్. డ్రగ్స్ వద్దంటూ సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఈ వీడియో చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో సైన్స్ ఫిక్షన్ మూవీ సుమారు రూ.1,200కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ది రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. హను రాఘవపూడితో ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు. మరిన్ని సినిమాలు కూడా లైనప్‍లో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రభాస్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు డ్రగ్స్ రహిత సమాజం కోసం ఓ అవగాహన వీడియోలో మాట్లాడారు.
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్
డ్రగ్స్ వాడొద్దంటూ ప్రభాస్ సందేశం ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. “లైఫ్‍లో మనకు బోలెడన్ని ఎంజాయ్‍మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‍మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవారు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్‌కు నో చెప్పండి” అని ప్రభాస్ అన్నారు.
తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‍ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని ప్రభాస్ సూచించారు. వారు పూర్తిగా కోలుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోంది. డ్రగ్స్ గురించి ఏవరైనా సమాచారం ఇచ్చేందుకు 8712671111 అనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది.
క్లాస్ లుక్‍లో ప్రభాస్
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేసిన చేసిన ఈ వీడియోలో ప్రభాస్ క్లాస్ లుక్‍తో ఉన్నారు. ది రాజాసాబ్ మూవీలో ఈ లుక్‍లోనే రెబల్ స్టార్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రెండో రోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజా సాబ్ చిత్రాన్ని హారర్ కామెడీ రొమాంటిక్ మూవీగా మారుతీ తెరకెక్కిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే వెల్లడించింది.
ప్రభాస్, హను రాఘవపూడి సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. పీరియడ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఫౌజీ అనే పేరు కూడా ఖరారైనట్టు రూమర్లు ఉన్నాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రం కూడా ప్రభాస్ లైనప్‍లో ఉంది. ఈ చిత్రం సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా రెబల్ స్టార్ నటించనున్నారు. ప్రశాంత్ నీల్‍తో సలార్ 2 కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. కల్కి 2 చిత్రం కూడా లైనప్‍లో ఉంది. ఇలా వరుస సినిమాలతో బిజిబీజీగా ఉన్నారు ప్రభాస్.
సంబంధిత కథనం