Director Surya Kiran: టాలీవుడ్‍లో విషాదం.. సత్యం మూవీ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత
Director Surya Kiran Dies: టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. సత్యం చిత్రంతో ఆయన చాలా పాపులర్ అయ్యారు.
Director Surya Kiran: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నేడు (మార్చి 11) చెన్నైలో మృతి చెందారు. సత్యం సినిమాతో దర్శకుడిగా సూర్యకిరణ్ చాలా పాపులర్ అయ్యారు. బిగ్‍బాస్ తెలుగు నాలుగో సీజన్‍లో కంటెస్టెంట్‍గానూ ఆయన పాల్గొన్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు సూర్యకిరణ్ మృతి చెందారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సూర్యప్రకాశ్. ఆ తర్వాత సత్యం (2003) చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆయన డైరెక్ట్ సత్యం సినిమా సూపర్ హిట్ అయింది. దర్శకుడిగా సూర్య కిరణ్ చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ధన 51 (2005), బ్రహ్మాస్త్రం (2006), రాజుభాయ్ (2007), చాప్టర్ 6 (2010) సినిమాలకు దర్శకత్వం వహించారు.
యాక్టర్‌గా..
తమిళనాడుకు చెందిన సూర్యకిరణ్.. దర్శకుడిగా మారే ముందు బాలనటుడిగా, నటుడిగా చాలా చిత్రాల్లో సూర్యకిరణ్ నటించారు. కెరీర్ తొలి నాళ్లతో తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా యాక్ట్ చేశారు. తెలుగులో రాక్షసుడు, దొంగమొగుడు, స్వయంకృషి, సంకీర్తన, కొండవీటి దొంగ సహా మరిన్ని చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా సూర్యకిరణ్‍కు రెండు జాతీయ అవార్డులు కూడ వచ్చాయి. నటన తర్వాత దర్శకత్వంపై పూర్తి దృష్టిసారించారు. సత్యంతో డైరెక్టర్ అయ్యారు.
బిగ్‍బాస్‍లో..
రియాల్టీ షో బిగ్‍బాస్ తెలుగు 4వ సీజన్‍లోనూ కంటెస్టెంగ్‍గా సూర్య కిరణ్ పాల్గొన్నారు. అయితే, తొలి వారమే ఆయన ఎలిమినేట్ అయ్యారు. బిగ్‍బాస్ హౌస్‍లో ఏడు రోజులు మాత్రమే ఉన్నారు.
హీరోయిన్ కల్యాణితో సూర్య కిరణ్ వివాహం జరిగింది. అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల అంశం గతంలో వివాదంగానూ మారింది.
పచ్చకామెర్లతో కొంతకాలంగా సూర్య కిరణ్ బాధపడుతున్నట్టు సమాచారం. ఇది తీవ్రం కావడం, గుండెపోటు రావడం వల్ల ఆయన నేడు (మార్చి 11) మృతి చెందారని తెలుస్తోంది. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సూర్యకిరణ్ మృతి పట్ల టాలీవుడ్‍కు చెందిన కొందరు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంచి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆయన మరణవార్త కలచివేస్తోందంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యకిరణ్ దర్శకత్వం వహించిన సత్యం సినిమా 2003 డిసెంబర్ 19న రిలీజైంది. టాలీవుడ్‍లో ఒకానొక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ చిత్రంలో సుమంత్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించారు. లవ్, కామెడీ, ఎమోషన్స్, మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచాయి. సంగీత దర్శకుడు దర్శకుడు చక్రి ఈ చిత్రానికి అందించిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి. మొత్తంగా సత్యం చిత్రం భారీ హిట్ అయింది. సుమంత్‍ను కెరీర్ ఆరంభంలో హీరోగా నిలబెట్టింది.
మంచు మనోజ్ హీరోగా సూర్యకిరణ్ తెరకెక్కించిన రాజుభాయ్ కూడా మోస్తరు హిట్ అయింది. కామెడీ లవ్ మూవీగా దీన్ని రూపొందించారు. ఈ చిత్రంలోనూ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. చివరగా 2010లో చాప్టర్ 6 అనే మూవీని డైరెక్ట్ చేశారు సూర్యకిరణ్.