Satya Review: సత్య మూవీ రివ్యూ - టీనేజ్ లవ్‌స్టోరీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా?
Satya Review: హమరేష్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన సత్య మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ టీనేజ్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
Satya Review: హమరేష్, ప్రార్ధన సందీప్ ప్రధాన పాత్రల్లో నటించిన సత్య మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. టీనేజ్ లవ్‌స్టోరీగా దర్శకుడు వాలీ మోహన్‌దాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. శివ మల్లాల నిర్మించాడు. సత్య మూవీ ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే?
సత్య ప్రేమకథ...
సత్య (హమరేష్) ఓ టీనేజ్ కుర్రాడు. గాజువాకలో గవర్నమెంట్ స్కూల్‌లో ప్లస్‌వన్ చదువుతుంటాడు. చదువులోనే కాదు అల్లరిలోనూ సత్యముందుంటాడు. సత్య తండ్రి గాంధీ (ఆడుకాలం మురుగదాస్) లాండ్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఓ రోజు తోటి విద్యార్థులతో జరిగిన గొడవలో సత్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సివస్తుంది. గవర్నమెంట్ స్కూల్‌లోని చెడు సావాసాల వల్లే సత్య దారి తప్పుతున్నాడని భావించిన గాంధీ అప్పులు చేసి మరి కొడుకును ఓ ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేస్తాడు.
ప్రైవేటు స్కూల్‌లో చదవడం ఇష్టం లేకపోయినా తండ్రి కోసం ఒప్పుకుంటాడు సత్య. ఆ స్కూల్‌లో ఇమడలేక సత్య ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అదే ప్రైవేటు స్కూల్‌లో చదువుతోన్న పార్వతితో (ప్రార్ధన సందీప్) సత్యకు ఎలా పరిచయం ఏర్పడింది? తనను ప్రేమించిన సత్యను పార్వతి ఎందుకు కొట్టాల్సివచ్చింది? సత్యను అతడి స్కూల్‌మేట్ గౌతమ్ ఎందుకు టార్గెట్ చేశాడు? గౌతమ్ చేసిన తప్పుకు సత్య ఎలా బలయ్యాడు? తన చదువు కోసం తండ్రి పడుతోన్న కష్టాన్ని సత్య అర్థం చేసుకున్నాడా? చదువుపై దృష్టిపెట్టాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
అనుభూతులు, అనుభవాలు...
టీనేజ్ లవ్‌స్టోరీస్‌లో పెద్దగా మలుపులు ఉండవు. తొలి ప్రేమ తాలూకు అనుభూతులు, అనుభవాలను ఎంత అందంగా, పొయేటిక్‌గా చూపిస్తే ఈ సినిమాలు అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సత్య మూవీ కూడా అలాంటి సినిమానే. టీనేజ్ కుర్రాడిజీవితంలో సరదాలు, సంతోషాలు అల్లర్లు ఎలా ఉంటాయన్నది నాచురల్‌గా ఈ మూవీలో చూపించారు డైరెక్టర్ వాలీ మోహన్‌దాస్. ప్రేమకథతో పాటు అంతర్లీనంగా తండ్రీకొడుకుల బంధానికి సమప్రాధాన్యతనిస్తూ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మలిచారు.
కార్పొరేట్ కల్చర్...
కార్పొరేట్ స్కూల్ కల్చర్ కారణంగా పిల్లల చదువు కోసం మిడిల్, లోయర్ మిడిల్ క్లాస్ వర్గాలు వారు పడే కష్టాలను ఆలోచనాత్మకంగా ఆవిష్కరించారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలను వాస్తవిక కోణంలో చూపించిన సినిమా ఇది. ఈ సన్నివేశాలన్నీనాచురల్‌గా...ప్రతి ఒక్కరికి తమ బాల్య జీవితాన్ని గుర్తుచేసుకునేలా ఉంటాయి.
తొలి ప్రేమకథ...
సత్యమూర్తి , పార్వతి లవ్‌స్టోరీని నడిపించిన విధానం బాగుంది. తొలిచూపులోనే పార్వతితో ప్రేమలో పడిన సత్య ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించడం, క్లాస్ రూమ్‌లో ఎవరికి తెలియకుండా లవర్‌ను చూసేందుకు పడే పాట్లను సింపుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన తీరు బాగుంది.
ఓ వైపు లవ్‌స్టోరీతో పాటు గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్‌లో చేరిన సత్య...అక్కడి పోటీతత్వానికి అడ్జెస్ట్ కాలేక పడిన ఇబ్బందుల నుంచి కామెడీ జనరేట్ చేశారు. సెకండాఫ్‌లో ఎక్కువగా తండ్రీకొడకుల బంధానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు.తండ్రి బాధను అర్థం చేసుకొని సత్య తీసుకునే నిర్ణయాన్ని డైరెక్టర్ కన్వీన్సింగ్‌గా రాసుకున్నాడు.
నెమ్మదిగా సాగే కథ...
టీనేజ్ లవ్‌స్టోరీలో నిదానంగా సాగే కథనమే కొంత ఇబ్బంది పెడుతుంది. సత్య తల్లిదండ్రులు పడే కష్టాలను కావాలనే డైరెక్టర్ ఎక్కువ చేసి చూపించినట్లుగా అనిపిస్తుంది. సత్య, పార్వతి లవ్‌స్టోరీని మరింత కొత్తగా రాసుకుంటే బాగుండేది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటులు లేకపోవడం కూడా మైనస్‌గా అనిపిస్తుంది.
నాచురల్ యాక్టింగ్...
సత్యగా హమరేష్ నటన బాగుంది. అల్లరి కుర్రాడిగా, ప్రేమికుడిగా తన క్యారెక్టర్‌లో చక్కటి వేరియేషన్స్ చూపించాడు. ప్రార్ధన సందీప్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా ఆడుకాలం మురుగదాస్ ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా ఎక్కువగా హైలైట్ అయ్యాడు. కొడుకును బాగా చదివించాలని అనుక్షణం తపించే తండ్రి పాత్రలో జీవించాడు. మిగిలిన వారు కూడా నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచారు.
అంచనాలు పెట్టుకోకుండా చూస్తే...
సత్య సమకాలీన సందేశంతో కూడిన బ్యూటీఫుల్ టీనేజ్ లవ్‌స్టోరీ. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5
టాపిక్