Sattam En Kaiyil Review: దృశ్యం సినిమాకు మించి ట్విస్ట్‌లతో సాగే తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Sattam En Kaiyil Review: తమిళ్ కమెడియన్ సతీష్ హీరోగా నటించిన సట్టం ఎన్ కైయిల్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ మూవీకి చాచి దర్శకత్వం వహించాడు.
Sattam En Kaiyil Review: కోలీవుడ్ కమెడియన్ సతీష్ హీరోగా నటించిన తమిళ మూవీ సట్టం ఎన్ కైయిల్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి చాచి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో హిట్టైన ఈ మూవీ ఎలా ఉందంటే?
కారులో డెడ్‌బాడీ...
తన తల్లిదండ్రులను కలవడం కోసం సొంతూరు ఏర్కాడ్‌కు కారులో ఒంటరిగా బయలుదేరుతాడు గౌతమ్(సతీష్). హఠాత్తుగా తన కారుకు ఓ వ్యక్తి అడ్డురావడంతో చీకట్లో కనిపించక అతడిని గుద్దేస్తాడు గౌతమ్. ఈ ప్రమాదంలో ఆ అపరిచిత వ్యక్తి చనిపోవడంతో భయంతో డెడ్‌బాడీని తన కారు డిక్కీలో దాచేస్తాడు. సీక్రెట్‌గా ఎక్కడైనా పూడ్చేయాలని గౌతమ్ ప్లాన్ చేస్తాడు.
కానీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అతడిని అడ్డగిస్తారు. కారు చెక్ చేస్తోండగా...ఏఎస్ఐ భాషాను (పావెల్ నవగీతం) కావాలనే గౌతమ్ కొడతాడు. డెడ్‌బాడీ పోలీసుల కంట పడకుండా గొడవను క్రియేట్ చేస్తాడు. తనను కొట్టిన గౌతమ్‌ను భాషా అరెస్ట్ చేస్తాడు. ఏఎస్ఐ భాషతో ఎస్ఐ నాగరాజ్‌కు(అజయ్ రాజ్) ఈగో ఇష్యూస్ ఉంటాయి. గౌతమ్‌పై తప్పుడు కేసు పెట్టాలని భాషా ప్రయత్నిస్తుంటే ఎస్ఐ నాగరాజ్ అతడిని కాపాడే ప్రయత్నం చేస్తాడు.
ఏర్కాడ్ ఏరియాలోనే నివేథా అనే అమ్మాయి డెడ్‌బాడీ దొరుకుతుంది. చైన్ స్నాచర్ బాలు ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో బయపడుతుంది. నివేథాను చంపి పారిపోతున్న బాలు తన కారు కిందనే పడ్డాడని స్టేషన్‌లోనే ఉన్న గౌతమ్‌కు అర్థమవుతుంది. పోలీసులు తన కారులో ఉన్న బాలు డెడ్‌బాడీని కనిపెట్టేలోపు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని గౌతమ్ ప్లాన్స్ వేస్తుంటాడు.
కానీ ఎస్ఐ నాగరాజుకు దొరికిపోతాడు. మీడియా ముందు మాత్రం బాలును ఎస్ఐ నాగరాజు చంపాడని ఆధారాలు చూపిస్తాడు. అదేలా జరిగింది? నివేథాకు గౌతమ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? నివేథా మర్డర్ వెనుక ఎవరున్నారు? బాలును తానే చంపిన గౌతమ్ ఆ నేరాన్ని నాగరాజ్‌పై ఎందుకు నెట్టివేశాడు? నాగరాజ్, బాషా మధ్య ఉన్న గొడవల్ని అడ్డుపెట్టుకొని తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే సట్టం ఎన్ కైయిల్ మూవీ కథ.
క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్...
సట్టం ఎన్ కయిల్ లో బడ్జెట్‌లో తెరకెక్కిన క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ. స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆడియెన్స్ ఊహలకు అందని ట్విస్ట్‌లు, టర్న్‌లతో డైరెక్టర్ చాచి ఈ మూవీని తెరకెక్కించాడు. అధికారం బలంతో ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన కుట్రలను ఓ సాధారణ యువకుడు తన తెలివితేటలతో ఎలా బయటపెట్టాడు? అతడిని ఏ విధంగా శిక్షించాడన్నదే ఈ సినిమా కథ. సింపుల్ స్టోరీని తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో గ్రిప్పింగ్‌గా డైరెక్టర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. క్లైమాక్స్‌లో రివీలయ్యే ట్విస్ట్‌లు అదిరిపోతాయి.
కథ మొత్తం పోలీస్ స్టేషన్‌లోనే...
ఈ సినిమా కథ మొత్తం పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. హీరో స్టేషన్‌లోనే కూర్చొని కథను నడిపిస్తుంటాడు. హీరో కారులో డెడ్‌బాడీ... అది పోలీస్ స్టేషన్ ముందే పార్క్ చేసి ఉండటం...ఆ చనిపోయిన వ్యక్తి మరో మర్డర్ కేసులో అనుమానితుడిగా ఉండటం...అతడి కోసం పోలీసుల అన్వేషణ చుట్టూ కథను నడిపించాడు డైరెక్టర్. హీరో పోలీసులకు ఎక్కడ దొరికిపోతాడో అనే క్యూరియాసిటీని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు.
పజిల్స్‌కు ఆన్సర్...
తనను కాపాడటానికి ప్రయత్నించిన ఎస్ఐ నాగరాజు పైనే గౌతమ్ ఆరోపణలు చేయడం దగ్గర నుంచి అప్పటివరకు తాను దాచిపెట్టిన ఒక్కో పజిల్‌కు ఆన్సర్ ఇస్తూ వెళ్లిపోయాడు డైరెక్టర్.
సింపుల్ లాజిక్స్...
పోలీస్ స్టేషన్ నుంచి గౌతమ్ తప్పించుకోవడానికి వేసే ఎత్తుల్లో ఆసక్తి లోపించింది. సినిమా కథ మొత్తం ఒకే చోట సాగడంతో కొన్ని సీన్స్ రిపీటెడ్ అనిపిస్తాయి. కొన్ని సింపుల్ లాజిక్స్‌ను డైరెక్టర్ వదిలిపెట్టాడు.
గౌతమ్ పాత్రలో సతీష్ యాక్టింగ్ బాగుంది. కమెడియన్‌గా ఇప్పటివరకు పలు సినిమాలు చేసిన సతీష్...సీరియస్ రోల్‌లో ఒదిగిపోయాడు. ఎస్ఐగా నాగరాజ్, ఏఎస్ఐగా పావెల్ నవగీతం పోటాపోటీగా నటించారు.
మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ...
మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలని అనుకునే వారికి మంచి ఛాయిస్‌గా సట్టం ఎన్ కైయిల్ నిలుస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో కేవలం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.