ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మరో వెబ్ సిరీస్ వస్తోంది. పవన్ సిద్ధు, సోనియా సింగ్ ప్రధాన పాత్రల్లో శశిమథనం వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ రేపు (జూలై 4) ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఇప్పటికే కొందరికి ప్రివ్యూల ద్వారా ఈ సిరీస్‍ను ఈటీవీ విన్ చూపించింది. ఆ సిరీస్ చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను, రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వస్తున్న శశిమథనం సిరీస్‍కు ఎలాంటి స్పందన వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
యూట్యూబ్ సిరీస్‍లతో చాలా పాపులర్ అయిన పవన్ సిద్ధు, సోనియా సింగ్ జోడీ.. శశిమథనం సిరీస్‍లోనూ అదరగొట్టిందనే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రేమికులుగా నటించిన పవన్, సోనియా మధ్య కెమెస్ట్రీ సూపర్‌గా ఉందని ఈ సిరీస్ చూసిన వారు పోస్టులు చేస్తున్నారు. ఇద్దరి పర్ఫార్మెన్స్ మెప్పించిందని అంటున్నారు.
శశిమథనం సిరీస్‍లో చాలా చోట్ల కామెడీ సీన్లు కూడా బాగా పండాయని కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీకి దొరికిపోతామని పవన్, సోనియా కంగారు పడడం చుట్టూ మంచి ఫన్ జనరేట్ అయిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ సిరీస్ థ్రిల్లింగ్‍గానూ ఉందని పోస్టులు చేస్తున్నారు. ఈ సిరీస్‍లో మ్యూజిక్ కూడా బాగుందని అభిప్రాయపడుతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా అలరించిందని అంటున్నారు.
శశిమథనం సిరీస్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ వీకెండ్ కుటుంబంతో కలిసి చూడొచ్చని రెకమెండ్ చేస్తున్నారు.
ప్రివ్యూ ద్వారా శశిమథనం వెబ్ సిరీస్‍కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ రేపు (జూలై 4) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.
శశిమథనం వెబ్ సిరీస్‍కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‍లో సోనియా సింగ్, పవన్ సిద్ధు మెయిన్ రోల్స్ చేశారు. కీర్తి, రూపలక్ష్మి, కృతిక, అశోక్ చంద్ర, కేశవ్ దీపక్, అవంతి దీపక్, శ్రీలలిత కీలకపాత్రలు పోషించారు. హరీశ్ కోహిర్కర్ నిర్మించిన ఈ సిరీస్‍కు సంజీత్ ఎర్రమల్లి మ్యూజిక్ ఇచ్చారు.
కుటుంబమంతా పెళ్లికి వెళ్లగా శశి (సోనియా సింగ్) ఒంటరిగా ఉంటుంది. తనను ఇంట్లోకి రానివ్వాలని తన లవర్ మదన్ (పవన్ సిద్ధు) అడుగుతాడు. ఆ ఇంట్లో శశి, మదన్ కలిసి ఉంటారు. ఇంతలోనే శశి కుటుంబ సభ్యులు హఠాత్తుగా తిరిగి వచ్చేస్తారు. దీంతో ఎవరి కంట పడకుండా ఇంట్లోనే మదన్‍ను శశి దాచేస్తుంది. మదన్ నానా తంటాలు పడుతుంటాడు. ఎవరో ఉన్నారంటూ కుటుంబ సభ్యులు అనుమానిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? మదన్ బయటపడ్డాడా? లేకపోతే శశి ఫ్యామిలీకి దొరికిపోయాడా? అనేదే శశిమథనం సిరీస్‍లో ప్రధాన అంశాలుగా ఉండన్నాయి.
ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకోవటంతో ఈ శశిమథనం సిరీస్‍పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రివ్యూల నుంచి కూడా టాక్ బాగానే వచ్చింది. రేపటి (జూలై 4) ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సిరీస్‍ను చూడొచ్చు.