Sapta Sagaralu Dhaati Side B in OTT: ఓటీటీలోకి అనుకోకుండా వచ్చేసింది సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ. ఈ మధ్యే మూవీ డిజిటల్ ప్రీమియర్ పై ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టి కీలకమైన అప్డేట్ ఇచ్చినా.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.
అయితే సడెన్ గా గురువారం (జనవరి 25) నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ గతేడాది నవంబర్ 17న రిలీజైంది. అంతకుముందే రిలీజైన సప్త సాగరాలు దాటి సైడ్ ఎ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. కన్నడ అభిమానులే కాదు.. తెలుగులోనూ చాలా మంది ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం విశేషం.
సెకండ్ పార్ట్ కూడా హిట్ కావడంతో మూవీ ఓటీటీ రిలీజ్ పైనా ఆసక్తి ఏర్పడింది. మొత్తానికి థియేటర్లలో రిలీజైన 70 రోజుల తర్వాత ఈ సప్త సాగరాలు దాటి సైడ్ బి ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందు గురువారం (జనవరి 25) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.
ఈ సినిమాను హేమంత్ ఎం రావ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో రక్షిత్ శెట్టితోపాటు చైత్ర అచార్, రుక్మిణి వసంత్, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, రమేష్ ఇందిరలాంటి వాళ్లు నటించారు. చరణ్ రాజ్ మ్యూజిక్ అందించాడు.
ప్రాణంగా ప్రేమించుకున్న మనూ (రక్షిత్ శెట్టి), ప్రియా (రుక్మిణీ వసంత్) ఊహించని ఘటనతో దూరమవుతారు. చేయని తప్పునకు మనూ జైలుకు వెళతాడు. దీంతో వీరిద్దరూ విడిపోవడం సప్తసాగరాలు దాటి సైడ్-ఏలో ఉంటుంది. దానికి కొనసాగింపుగా సప్తసాగరాలు దాటి సైడ్-బీ వచ్చింది. సైడ్-బీలో మనూ జైలు నుంచి విడుదలవుతాడు. అప్పటికే వేరే వ్యక్తితో ప్రియాకు పెళ్లి అవుతుంది.
అయితే, ప్రియా వైవాహిక జీవితం ఎలా ఉందో మనూ పరిశీలిస్తుంటాడు. ఆమె కష్టాలను తీర్చేందుకు నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మనూకు సురభి (చైత్ర జే అచార్) అనే వేశ్య పరిచయం అవుతుంది. ప్రియాకు దూరంగా ఉంటూనే సాయం చేస్తూనే ఉంటాడు మనూ. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రియా, మనూ ఎదురుపడ్డారా? మనూ జీవితంలో సురభి ఎలా వచ్చింది? అనేదే సప్తసాగరాలు దాటి సైడ్-బీ కథలో ముఖ్య అంశాలుగా ఉన్నాయి.
ఇంతకుముందు రక్షిత్ శెట్టి నటించిన 777 ఛార్లీ మూవీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ అతని సినిమాలకు తెలుగులో క్రేజ్ పెరిగింది. సప్త సాగరాలు దాటి సైడ్ ఎ మూవీ ప్రైమ్ వీడియోలో ఉండగా.. ఇప్పుడు సైడ్ బి కూడా అందులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.