Sapta Sagaragalu Dhaati Review: సప్త సాగరాలు దాటి రివ్యూ - రక్షిత్ శెట్టి మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా?
Sapta Sagaragalu Dhaati Movie Review: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన డబ్బింగ్ మూవీ సప్తసాగరాలు దాటి శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Sapta Sagaragalu Dhaati Movie Review: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన కన్నడ మూవీ సప్త సాగర దాచే ఎల్లో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను సప్త సాగరాలు దాటి పేరుతో అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులోకి డబ్ చేసింది. మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు హేమంత్ రావు దర్శకత్వం వహించాడు. కన్నడంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందంటే?
చేయని నేరాన్ని...
మను (రక్షిత్ శెట్టి) ఓ అనాథ. పెద్ద బిజినెస్‌మెన్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ప్రియ(రుక్మిణి వసంత్)ను ప్రాణంగా ప్రేమిస్తాడు మను. ఇద్దరు పెళ్లికి సిద్ధమయ్యే తరుణంలో ఓ యాక్సిడెంట్ కేసులో మనును అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపిస్తారు. డబ్బు కోసం చేయని నేరాన్ని మను తనపై ఎందుకు వేసుకున్నాడు? ఆ నిజం తెలిసి ప్రియ ఏం చేసింది?
మనును జైలు నుంచి విడిపిస్తానని మాటిచ్చిన అతడి యజమాని ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు? జైలులో ఓ గ్యాంగ్ కారణంగా మను ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ప్రియ ప్రేమను త్యాగం చేయాల్సిన పరిస్థితులు మనుకు ఎందుకు ఎదురయ్యాయన్నదే సప్త సాగరాలు దాటి మూవీ కథ.
ప్రేమికుల సంఘర్షణ
విధి కారణంగా విడిపోయిన ఓ జంట సంఘర్షణకు అద్ధంపడుతూ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా దర్శకుడు హేమంత్ రావు సప్త సాగరాలు దాటి సినిమాను తెరకెక్కించాడు. ప్రియురాలి కలను నెరవేర్చడం కోసం చేయని నేరాన్ని తనపై వేసుకున్న ఓ యువకుడు ఆమెకు శాశ్వతంగా ఎలా దూరమవ్వాల్సివచ్చిందనేది భావోద్వేగభరితంగా స్క్రీన్‌పై ఆవిష్కరించారు.
తమ నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి డబ్బును ఎరగా చూపించి అమాయకుల్ని ధనవంతులు ఎలా బలిపశువుల్ని చేస్తారు? జైలులో ఖైదీలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి? కొందరు కరుడుగట్టిన క్రిమినల్స్ జైలులో ఆధిపత్యం చెలాయిస్తూ తోటి ఖైదీలను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తారన్నది రియలిస్టిక్‌గా దర్శకుడు హేమంత్ రావు ఈ సినిమాలో చూపించారు.
కలిసి జర్నీ మొదలుపెట్టి...
సప్త సాగరాలు దాటి సినిమాను హీరోహీరోయిన్లు కలిసి జర్నీ చేసే సీన్‌తో మొదలుపెట్టి విడిపోయే సన్నివేశంతో ఎండ్ చేశాడు డైరెక్టర్. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ కెమిస్ట్రీని రెగ్యులర్ లవ్ స్టోరీస్‌కు భిన్నంగా పొయెటివ్ వేలో అందంగా చూపించారు. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా చాలా వరకు జైలు బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. జైలు నుంచి మను విడుదలవుతాడని అనుకుంటున్న టైమ్‌లో వచ్చే ట్విస్ట్ ఆసక్తిని పంచుతుంది.
సాగతీత...
జైలు సన్నివేశాలు మొత్తం సాగతీతగా అనిపిస్తాయి. జైలులో మనును ప్రియ కలిసే సీన్స్ రిపీటెడ్ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఒకటి, రెండు మినహా ఎలాంటి ట్విస్టులు, టర్న్‌లు లేకుండా స్క్రీన్‌ప్లే మొత్తం ఫ్లాట్‌గా సాగుతుంది. ఆ మెయిన్ ట్విస్ట్ కూడా ఈజీగా గెస్ చేసేలానే ఉంది.
కమర్షియల్ హీరోయిన్లకు భిన్నంగా...
ఒకరికొకరు దూరమై అనుక్షణం వేదనకు గురయ్యే జంటగా రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కమర్షియల్ హీరోయిన్లకు భిన్నంగా హీరోయిన్ పాత్రను సహజంగా దర్శకుడు రాసుకున్న తీరు బాగుంది. ఎమోషనల్ యాక్టింగ్‌తో రక్షిత్ శెట్టి మెప్పించాడు. సినిమా కథ మొత్తం హీరోహీరోయిన్ల పాత్రల నేపథ్యంలోనే సాగుతుంది. చరణ్ రాజ్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌గా నిలిచాయి. నాయకానాయికల సంఘర్షణను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు చరణ్ రాజ్.
మెస్మరైజ్...
సప్త సాగరాలు దాటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. యూనివర్సల్ పాయింట్ కావడంతో డబ్బింగ్ సినిమా అనే ఫీల్ ఎక్కడ కలగదు.
రేటింగ్: 3/5