Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం కొత్త వ్యూహం.. సక్సెస్ అయితే మళ్లీ పునర్వైభవం
Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొత్త వ్యూహాన్ని పాటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు ఇవే..

ఇటీవలి కాలంలో సినిమాలు ముందుగా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చిన తర్వాత మరికొన్ని నెలలకు టీవీ ఛానెల్‍లో ప్రసారం అవుతున్నాయి. డిజాస్టర్ అయి డీల్ జరగని అతికొన్ని చిత్రాలు మాత్రమే ఓటీటీలోకి రాకుండా టీవీల్లోకి వస్తున్నాయి. ఇవి కూడా అరుదే. అత్యధిక చిత్రాలు ఓటీటీలోకి వచ్చాకే టీవీ ఛానెల్‍ల్లో టెలికాస్ట్ అవుతున్నాయి. దీంతో టీవీ ప్రీమియర్లకు పెద్దగా టీఆర్పీలు దక్కడం లేదు. ఈ తరుణంలో బంపర్ బ్లాక్‍బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఓ విభిన్నమైన వ్యూహం అనుసరిస్తోంది. ఈ మూవీకి ఎంతో క్రేజ్ ఉండగా.. ముందు ఓటీటీలో కాకుండా టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి నెలకొంది.
వర్కౌట్ అయితే.. పూర్వవైభవం
ఓటీటీ హవా ఉన్న ప్రస్తుత తరుణంలో సూపర్ హిట్ అయిన చిత్రాలు కూడా టీవీల్లో సరైన టీఆర్పీలు దక్కించుకోలేకపోతున్నాయి. ఎక్కువ మంది ఓటీటీల్లోనూ చూస్తుంటడంతో.. టీవీల్లో తొలిసారి టీవీ ప్రీమియర్లలో చాలా చిత్రాలకు టీఆర్పీ రేటింగ్ 10కు కూడా దాటడం లేదు. దీంతో ఇటీవల శాటిలైట్ హక్కులకు రేట్లు బాగా తగ్గిపోయాయి. ఓటీటీ డిజటల్ హక్కులకు ధరలు పెరిగాయి. ఈ తరుణంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది.
ఓటీటీలో కాకుండా ముందుగా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తీసుకొస్తున్నామంటూ ప్రకటన వచ్చేసింది. త్వరలో ఈ చిత్రం టెలికాస్ట్ కానుందనంటూ జీ తెలుగు అధికారికంగా వెల్లడించింది. ఒకవేళ ఈ మూవీకి జీ తెలుగులో భారీ టీఆర్పీ వస్తే.. భవిష్యత్తులో మరికొన్ని చిత్రాలు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. టీవీ ప్రీమియర్లకు పూర్వవైభవం దక్కే ఛాన్స్ ఉంటుంది.
ఓటీటీ కంటే ముందు టీవీలోకి సినిమాలను తీసుకొచ్చే ట్రెండ్ వస్తే.. మళ్లీ శాటిలైట్ హక్కులకు ఒకప్పటి డిమాండ్ కనిపించే అవకాశం ఉంటుంది. టీవీలో ఒక్కసారి ప్రసారం చేయడం వల్ల ఓటీటీ స్ట్రీమింగ్‍పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అందుకే ఈ వ్యూహం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తెలుగు సినీ జనాలంతా సంక్రాంతికి వస్తున్నాం.. కొత్త వ్యూహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తోందననే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు ఇలా..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. అదే గ్రూప్‍నకు చెందిన జీ తెలుగు ఛానెల్ శాటిలైట్ హక్కులను తీసుకుంది. ఈ చిత్రం కూడా మిగిలిన వారిలాగే ముందుగా ఓటీటీలోకి వస్తుందని భావించినా.. మేకర్స్ ట్విస్ట్ ఇచ్చేశారు. ఓటీటీ కంటే ముందే టీవీలో ప్రీమియర్ అవడం అధికారికంగా ఖరారైంది. త్వరలోనే టెలికాస్ట్ డేట్ వెల్లడి కానుంది.
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సుమారు రూ.300కోట్ల కలెక్షన్లు దక్కించుకొని భారీ హిట్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ రూ.50కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అందరి అంచనాలను దాటి భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
సంబంధిత కథనం