Sankranthi Movies Winner: ఈసారి సంక్రాంతి విజేత వెంకటేశే.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్-sankranthiki vasthuam is the clear winner of sankranthi movies game changer disaster daaku maharaaj in 2nd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sankranthi Movies Winner: ఈసారి సంక్రాంతి విజేత వెంకటేశే.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్

Sankranthi Movies Winner: ఈసారి సంక్రాంతి విజేత వెంకటేశే.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్

Hari Prasad S HT Telugu

Sankranthi Movies Winner: ఈ ఏడాది కూడా సంక్రాంతి విజేత ఓ భారీ బడ్జెట్, భారీ అంచనాలు ఉన్న సినిమాను వెనక్కి నెట్టింది. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్‌బస్టర్ హిట్ తో సంక్రాంతి విజేతగా నిలిచింది. గతేడాది హనుమాన్ కూడా అలాగే అంచనాలను తలకిందులు చేసిన విషయం తెలిసిందే.

ఈసారి సంక్రాంతి విజేత వెంకటేశే.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్

Sankranthi Movies Winner: సంక్రాంతి సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు ఈ టైమ్ లో వస్తుంటాయి. సహజంగానే అలాంటి సినిమాలే విజేతలుగా నిలవడం గతంలో చూశాం. కానీ గతేడాది, ఈ ఏడాది మాత్రం అంచనాలను తలకిందులయ్యాయి. 2024లో గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ లాంటి సినిమాలను హనుమాన్ వెనక్కి నెట్టగా.. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం విజేతగా నిలిచింది.

సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల విజేత సంక్రాంతికి వస్తున్నాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ లతో పోలిస్తే రిలీజ్ కు ముందు సంక్రాంతికి వస్తున్నాం మూవీపై మరీ అంత భారీ అంచనాలేమీ లేదు. కానీ ఆ రెండు సినిమాలను వెనక్కి నెట్టి వెంకటేశ్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.

గతేడాది సైంధవ్ తో తీవ్రంగా నిరాశ చెందిన వెంకటేశ్.. ఈసారి సంక్రాంతికి వస్తున్నాంతో మళ్లీ గాడిలో పడ్డాడు. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా రూ.131 కోట్లు వసూలు చేసింది. గేమ్ ఛేంజర్ తో నష్టపోయిన దిల్ రాజుకు ఈ సినిమా లాభాల పంట పండించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి సినిమాల్లో పూర్తిగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మ్యూజిక్ కు వందకు వంద మార్కులు పడ్డాయి.

గేమ్ ఛేంజర్.. డిజాస్టర్

నిజానికి సంక్రాంతి సినిమాల్లో అత్యధిక బజ్, భారీ బడ్జెట్, అంతకంటే భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ నటించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.170 కోట్ల గ్రాస్, రూ.88 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

అసలు లాభాల్లోకి రావాలంటే షేరే రూ.220 కోట్లుగా ఉండాల్సింది. కానీ ఇప్పుడు మేకర్స్ కు ఏకంగా రూ.130 కోట్ల నష్టం తప్పేలా లేదు. ఈ మూవీ దిల్ రాజు కొంప ముంచింది. ఔట్ డేటెడ్ డైరెక్టర్ శంకర్, ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

డాకు మహారాజ్.. ఫర్వాలేదు

బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. సంక్రాంతి రేసులో ఈ మూవీ రన్నరప్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆరు రోజుల్లో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కు దగ్గరవుతోంది. ఈ వీకెండ్ ఆ మార్క్ అందుకొని లాభాల్లోకి దూసుకెళ్లనుంది.

ఇప్పటికే మూవీ టీమ్ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీ.. బాలకృష్ణకు మరో హిట్ అందించిందనే చెప్పాలి. రెండేళ్ల కిందట సంక్రాంతికి వీరసింహారెడ్డితో వచ్చి కాస్త నిరాశపరిచిన బాలయ్య.. ఈసారి తన అభిమానులకు అసలు పండుగ అందించాడు.