Sankranthi Movies Ticket Prices: సంక్రాంతి సినిమాలకు ఏపీలో భారీగా పెరగనున్న టికెట్ల ధరలు.. గేమ్ ఛేంజర్‌కే ఎక్కువ?
Sankranthi Movies Ticket Prices: సంక్రాంతి సినిమాల టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఒక్కో సినిమాకు ఒక్కోలా టికెట్ల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
Sankranthi Movies Ticket Prices: సంక్రాంతి సినిమాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బడా ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను ఈ పండుగకు తీసుకురావడానికి ఆసక్తి చూపుతారు. అలా ఈసారి కూడా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకూ మహరాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వస్తున్నాయి. తెలంగాణలో ఇక నుంచి టికెట్ల ధరల పెంపు లేదని ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఏపీలో మాత్రం ఈ సినిమాల టికెట్ల ధరలు భారీగా పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏ సినిమాకు ఎంత పెంపు అంటే?
సంక్రాంతికి ఈసారి ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి. అయితే వీటిలో ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన క్రేజ్ ఉంది. ఈ మూడింట్లో ఎక్కువ ఆసక్తి రేపుతున్న సినిమా మాత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీయే. దీనికోసం ఎన్నో రోజులుగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఊహించినట్లే ఈ సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
గేమ్ ఛేంజర్ మూవీకి సింగిల్ స్క్రీన్ అయితే రూ.135, మల్టీప్లెక్స్ అయితే రూ.175 వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతోందట. ఇక ఈ మూవీ బెనిఫిట్ షోలు అర్ధరాత్రి ఒంటి గంట నుంచే ప్రారంభం కానున్నాయి. వీటికి మాత్రం రూ.600 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిగిలిన రెండు సినిమాలకు ఇలా..
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ కు పోటీగా బాలకృష్ణ డాకూ మహరాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుండగా.. జనవరి 12న డాకూ మహరాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కాబోతున్నాయి. ఇక డాకూ మహరాజ్ మూవీకి అయితే సింగిల్ స్క్రీన్ అయితే రూ.110, మల్టీప్లెక్స్ అయితే రూ.135 వరకు ఈ పెంపు ఉండబోతున్నట్లు సమాచారం. ఇక డాకూ మహారాజ్ బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకే ప్రారంభం కానుండగా.. వీటికి రూ.500 వరకు పెంపు ఉండొచ్చు.
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మరో సంక్రాంతి మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు కూడా టికెట్ల పెంపుకు అనుమతి ఇచ్చినా.. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండనుంది. ఈ సినిమా సింగిల్ స్క్రీన్ అయితే రూ.75, మల్టీప్లెక్స్ అయితే రూ.100 పెంపు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో ఇక నుంచి టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండబోదని ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీపైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు.