Sandeep Reddy Vanga: మీర్జాపూర్ సిరీస్ తీసిన నీ కుమారుడికి చెప్పాల్సింది: జావేద్ అక్తర్‌పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్
Sandeep Reddy Vanga - Animal Movie: బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫైర్ అయ్యారు. యానిమల్ మూవీని పరోక్షంగా గతంలో డేంజరస్ అని కామెంట్ చేశారు జావేద్. దీనికి ఇప్పుడు స్ట్రాంగ్‍గా బదులిచ్చారు సందీప్.
Sandeep Reddy Vanga on Javed Akhtar: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా బంపర్ హిట్ అయింది. బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ గత డిసెంబర్‌లో రిలీజై బ్లాక్‍బాస్టర్ కొట్టింది. అయితే, విపరీతమైన హింస, మహిళలపై అభ్యంతరకరమైన సీన్లు ఉన్నాయంటూ కొందరు ప్రముఖులు కూడా యానిమల్ మూవీని విమర్శించారు. ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ కూడా ఈ చిత్రాన్ని పరోక్షంగా విమర్శించారు. డేంజరస్ అంటూ మరిన్ని కామెంట్లు చేశారు. అయితే, దీనికి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఘాటుగా బదులిచ్చారు.
తన బూట్లు నాకాలని మహిళకు ఓ పురుషుడు చెప్పే ఓ సినిమా బ్లాక్‍బాస్టర్ అయిందని, ఇది చాలా ప్రమాదకరం అంటూ యానిమల్ సినిమాను పరోక్షంగా విమర్శించారు జావేద్ అక్తర్. అప్పట్లో దీనికి యానిమట్ టీమ్ బదులిచ్చింది. అయితే, ఇప్పుడు స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే ఓ ఇంటర్వ్యూలో స్ట్రాంగ్ రిప్లే ఇచ్చారు. విపరీతమైన బూతులతో నిండిన మీర్జాపూర్ సిరీస్‍ను నిర్మించిన పర్హాన్ అక్తర్ (జావేద్ అక్తర్ కుమారుడు)కు జావేద్ ఆ మాట చెప్పాల్సిందని అన్నారు. తన కుమారుడి పనిని జావేద్ ఎందుకు చెక్ చేయడం లేదని ఇండియా గ్లిట్జ్ యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ ప్రశ్నించారు.
సినిమా చూడకుండా..
యానిమల్ సినిమా పేరును తన కామెంట్‍లో జావెద్ అక్తర్ ప్రస్తావించలేదని సందీప్ రెడ్డి వంగా అన్నారు. సినిమా చూడకుండా కామెంట్ చేసే వాళ్ల గురించి ఏం మాట్లాడతామని చెప్పారు. “ఆయన గురించే కాదు.. ఎవరైనా సరే.. ఒకరిపై రాయి వేసే ముందు (విమర్శించే ముందు) వారి చుట్టుపక్కల ఎందుకు చెక్ చేసుకోరు” అని సందీప్ ప్రశ్నించారు.
బూతులన్నీ మీర్జాపూర్‌లో ఉన్నాయ్
మహిళల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడడం గురించి జావేద్ అక్తర్ విమర్శించడం సరికాదని సందీప్ రెడ్డి వంగా అన్నారు. బూతులతో నిండిన మీర్జాపూర్‌ను ప్రొడ్యూజ్ చేసిన కుమారుడు పర్హాన్ అక్తర్‌కు జావేద్ ఆ మాట చెప్పాల్సిందని సందీప్ చెప్పారు.
“మీర్జాపూర్‌ను నిర్మించేటప్పుడు ఫర్హాన్ అక్తర్‌కు కూడా జావెద్ జీ అలా చెప్పాల్సింది. దునియాలో ఉన్న బూతులన్నీ మీర్జాపూర్ ఒక్క షోలో ఉన్నాయి. నేను పూర్తిగా షో కూడా చూడలేదు. యూట్యూబ్‍లో వస్తాయి కదా రెండు నిమిషాలవి 15 సీన్లు చూశా. తెలుగులో డబ్బింగ్ అయిన ఆ బూతులను మీరు వింటే వాంతి వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఒకవేళ హిందీ, తెలుగు డైలాగ్ మధ్య డిఫెరెన్స్ గుర్తిస్తే చిరాకు వస్తుంది. వీళ్లు నాకు చెబుతున్నారు చూడు.. ఇదంతా నాటకం. ఆయన ఎందుకు తన కుమారుడి పనిని చెక్ చేయడం లేదు” అని సందీప్ రెడ్డి వంగా అన్నారు.
మోసం చేసిందనే కోపంతో తన షూ నాకాలని యానిమల్ సినిమాలో జోయా(తృప్తి డిమ్రి) క్యారెక్టర్‌ను రణ్‍విజయ్ (రణ్‍బీర్ కపూర్) అంటారు. ఈ డైలాగ్‍పై చాలా విమర్శలు వచ్చాయి.
యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.950కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని బంపర్ హిట్ అయింది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం