Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాపై మరోసారి విరుచుకుపడ్డ బాలీవుడ్ రైటర్.. నా కొడుకే దొరికాడా అంటూ..
Sandeep Reddy Vanga: యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై మరోసారి విరుచుకుపడ్డాడు బాలీవుడ్ రైటర్ జావెద్ అక్తర్. తన కెరీర్లో ఎలాంటి తప్పులు వెతకలేక.. తన కొడుకు దగ్గరకు వెళ్లాడంటూ అతడు విమర్శించడం గమనార్హం.
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డీ.. నా 53 ఏళ్ల కెరీర్లో నేను చేసిన ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. సిగ్గుండాలి అంటూ బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్ మరోసారి యానిమల్ డైరెక్టర్ పై విమర్శలు గుప్పించాడు. మొదట యానిమల్ సినిమాను అక్తర్ విమర్శించడం.. తర్వాత దానికి మీర్జాపూర్ వెబ్ సిరీస్ పేరు చెప్పి సందీప్ కౌంటర్ వేయడంతో వీళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
నీకు ఒక్క తప్పూ దొరకలేదా?
సందీప్ రెడ్డి వంగా చేసిన విమర్శలపై తాజాగా మోజో స్టోరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జావెద్ అక్తర్ స్పందించాడు. తాను యానిమల్ తీసిందుకు డైరెక్టర్ ను ఏమీ అనడం లేదని, అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ చెప్పాడు.
"నేను ఫిల్మ్ మేకర్ ను అసలు విమర్శించడం లేదు. ఈ ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్, ఎన్నో యానిమల్స్ తీసే హక్కు అతనికి ఉంది. నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించే అతనికి ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది" అని అక్తర్ అన్నాడు. తాను యానిమల్ మూవీ చూడలేదని, అయితే వాళ్లూ వీళ్లూ చెప్పిన దానిని బట్టి సినిమా గురించి కామెంట్స్ చేసినట్లు చెప్పాడు.
మీర్జాపూర్ వెబ్ సిరీస్‌పై..
తన యానిమల్ సినిమాలో మహిళలను కించ పరిచానని అన్న జావెద్ అక్తర్ కు.. తన కొడుకు ఫర్హాన్ అక్తర్ రూపొందించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ కనిపించలేదా అని గతంలో సందీప్ రెడ్డి వంగా కౌంటర్ ఇచ్చాడు. దీనిపైనా తాజా ఇంటర్వ్యూలో జావెద్ అక్తర్ స్పందించాడు. తన 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పునూ పట్టుకోలేక, తన కొడుకు దగ్గరికి వెళ్లావా అంటూ నిలదీశాడు.
"అతడు స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటనూ కనిపెట్టలేకపోయాడు. దీంతో అతడు నా కొడుకు ఆఫీస్ నిర్మించిన ఓ టీవీ సీరియల్ ను పట్టుకున్నాడు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ ఈ మధ్య చాలా నిర్మిస్తోంది. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నాడు. దాని వల్ల ఉపయోగం లేదు. 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పూ వెతకలేకపోయావా.. సిగ్గుచేటు" అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించాడు.
గతేడాది డిసెంబర్ 1న రిలీజైన యానిమల్ మూవీని తీవ్రంగా విమర్శించిన బాలీవుడ్ ప్రముఖుల్లో జావెద్ అక్తర్ కూడా ఒకడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రణ్‌బీర్ కపూర్.. ఓ సీన్లో ఓ యువతిని తన షూ నాకాల్సిందిగా చెప్పడంపై అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. ఇదే విషయాన్ని ఆయన కొడుకు ఫర్హాన్ అక్తర్ కు ఎందుకు చెప్పడు అని నిలదీశాడు.