Samarasimha Reddy Re-Release Record: సమరసింహా రెడ్డి రీరిలీజ్.. సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న బాలయ్య మూవీ
Samarasimha Reddy Re-Release Record: నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన సమరసింహా రెడ్డి గ్రాండ్ రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. రికార్డు స్థాయి థియేటర్లలో ఈ రీరిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Samarasimha Reddy Re-Release Record: టాలీవుడ్ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ సమరసింహా రెడ్డి. బాలకృష్ణ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సినిమా రిలీజై 25 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. వచ్చే శనివారం (మార్చి 2) సమరసింహా రెడ్డి రీరిలీజ్ చేయనున్నట్లు శ్రీమాతా క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
సమరసింహా రెడ్డి రికార్డు
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఈ సమరసింహా రెడ్డి 1999లో రిలీజైంది. ఇప్పుడీ ఏడాది 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీని 4కే వెర్షన్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 25నే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో రీరిలీజ్ అవుతున్న సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసేలా భారీ స్థాయిలో సమరసింహా రెడ్డిని రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నైజాంలో 100 థియేటర్లు, ఆంధ్రాలో 250 థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇక కర్ణాటకలో 50 స్క్రీన్లతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాలాంటి ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున రీరిలీజ్ చేయనున్నారు. అతి ఎక్కువ థియేటర్లలో రీరిలీజైన సినిమాగా సమరసింహా రెడ్డి నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరి రిలీజ్ తర్వాత కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
సమరసింహా రెడ్డి సూపర్ హిట్
సమరసింహా రెడ్డి టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా. రాయలసీమ ఫ్యాక్షన్ కక్షల చుట్టూ అల్లుకున్న ఈ కథ అప్పట్లో సంచలన విజయం సాధించింది. బీ గోపాల్ డైరెక్ట్ చేయగా.. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. సిమ్రన్, అంజలా జవేరీ నటించారు. ఇక ఈ సినిమా ద్వారా బాలకృష్ణకు ఎంత పేరు వచ్చిందో విలన్ గా నటించిన జయప్రకాశ్ రెడ్డి కూడా అదే స్థాయిలో పేరు సంపాదించాడు.
సీమ యాసలో జేపీ చెప్పిన డైలాగులు తెలుగునాట మార్మోగిపోయాయి. ఢిల్లీలో కాదు.. సీమ సందుల్లో చూసుకుందామని జయప్రకాశ్ సవాలు విసరడం.. నేను గట్టిగా తొడ చరిచానంటే ఆ సౌండ్ కే గుండె ఆగి చస్తావురా నువ్వు అనే బాలయ్య బాబు కౌంటర్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. పవర్ ఫుల్ డైలాగులు, మణిశర్మ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సమరసింహా రెడ్డికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
ఈ సినిమా తర్వాత సీమ ఫ్యాక్షన్ ఆధారంగా టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కి సంచలన విజయం సాధించాయి. నరసింహనాయుడు, ఆది, ఇంద్ర, అరవింద సమేత, ఒక్కడు, జయం మనదేరాలాంటి సినిమాలు కూడా రాయలసీమ ఫ్యాక్షన్ ఆధారంగా తెరకెక్కిన సినిమాలే. ఈ మూవీస్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వీటికి బాలయ్యే స్ఫూర్తిగా నిలిచాడు.
అలాంటి సమరసింహా రెడ్డి ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. మార్చి 2న రీరిలీజ్ కానున్న ఈ సినిమా కోసం మీరూ సిద్ధమైపోండి.