Samantha Ruth Prabhu: ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో మీకు తెలియదు
Samantha Ruth Prabhu: సమంత తాజాగా తన సెల్ఫీని షేర్ చేస్తూ వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో సూచించింది.
శాకుంతలం మూవీ రిలీజ్ కోసం నటి సమంత ఎదురుచూస్తోంది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన తాజా సెల్ఫీ షేర్ చేస్తూ వ్యక్తులు పరస్పరం దయతో ఉండాలని కోరింది. ఎవరు ఎలాంటి సమస్యలతో పోరాడుతున్నారో ఎవరికీ తెలియదని, అందుకే పరస్పరం దయతో ఉండాలని సూచించారు.
గ్రే కలర్ ఔట్‌ఫిట్‌లో సెల్ఫీ తీసుకున్న సమంత ‘ఎవరు ఎలాంటి పోరాటం చేస్తున్నారో మీకు ఎప్పటికీ తెలియక పోవచ్చు. దయతో ఉండండి..’ అని ఆ పిక్చర్ షేర్ చేసింది.
సమంత గత రెండేళ్లలో వ్యక్తిగతంగా చాలా పరిణామాలు ఎదుర్కొంది. గత ఏడాది నవంబరులో ఆమె అరుదైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. గత నెలలో ఓ సందర్భంలో భావోద్వేగానికి గురైన సమంత తాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సినిమా పట్ల ఉన్న ప్రేమలో ఎలాంటి మార్పులేదని చెప్పింది. శాకుంతలం ట్రైలర్ లాంచ్ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
‘నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఒకటి మాత్రం మారదు. సినిమా పట్ల ఉన్న నా ప్రేమ ఎప్పటికీ మారదు. సినిమా కూడా నన్ను అంతే ప్రేమిస్తుంది. శాకుంతలంతో ఇది మరిన్ని రెట్లు పెరుగుతుందని నమ్ముతున్నా..’ అని సమంత చెప్పింది.
తన అరుదైన వ్యాధి గురించి సమంత చెప్పిన తరువాత తనపై వచ్చిన రూమర్లకు చెక్ పడింది. సమంత ఆసుపత్రి పాలైందంటూ అనేక రూమర్లు వచ్చాయి. తన గత సినిమా యశోద విడుదల సందర్భంగా సమంత తన ఆరోగ్యం గురించి కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘నేను నా పోస్టులో చెప్పినట్టు కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఇంకో అడుగు ముందుకు వేయడం కూడా కష్టంగా అనిపించేది. కానీ నేను వెనక్కి తిరిగి చూస్తే.. చాలా దూరం వచ్చానని ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇక్కడ పోరాడడానికే ఉన్నాను..’ అని చెప్పుకొచ్చింది.
తన ఆరోగ్య పరిస్థితి ప్రాణాంతకమైనది కాదని స్పష్టత ఇచ్చింది. ‘నేను ఒక్కటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నా అనారోగ్యం ప్రాణాంతకమైందని చాలా వార్తలు రాశారు. నేను ఇప్పుడున్న పరిస్థితి ప్రాణాంతకమైందేమీ కాదు. ఈ క్షణం నేనింకా చనిపోలేదు. అలాంటి హెడ్ లైన్స్ అవసరం అని నేను అనుకోవడం లేదు..’ అని సమంత చెప్పింది.
గత వారం సమంత తమిళనాడులోని పళని ఆలయం సందర్శించింది. 600 మెట్లు ఎక్కి ప్రతి మెట్టుపై కర్పూరం వెలిగించింది. ఆలయంపైకి చేరుకోవడానికి ఉన్న ఆచారాన్ని ఆమె ఆచరించింది. ఆ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.