Samantha Buys Luxury Apartment: బాలీవుడ్‌పై సామ్ ఫోకస్.. ముంబయిలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు..?
Samantha Buys Luxury Apartment: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ముంబయిలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.15 కోట్ల పైగా సొమ్ముతో బీచ్‌కు సమీపంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను తీసుకున్నట్లు సమాచారం.

Samantha Buys Luxury Apartment: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బీటౌన్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. దీంతో ముంబయిలో లగ్జరీ అపార్ట్మెంట్ సైతం కొనుగోలు చేసి అక్కడ నుంచే తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటోంది. తాజాగా రష్మిక మార్గంలోనే సమంత రూత్ ప్రభు కూడా వెళ్తోంది. ఆమె మాదిరిగానే సామ్ కూడా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం లగ్జరీ అపార్ట్మెంట్‌ను కొనుగోలు చేసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం.
ఇటీవల సమంత ముంబయిలో బీచ్‌కు సమీపంలో ఉన్న ఓ ఎత్తైన లగ్జరీ అపార్ట్మెంట్ నుంచి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఆమె నగరంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందనే వార్తలు ఊపందుకున్నాయి. సముద్రతీరం ప్రత్యక్షంగా కనిపించేలా, అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించేలా ఈ ఫొటో ఉంది. ఈ అపార్ట్మెంట్ ఖరీదు వచ్చేసి దాదాపు రూ.15 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.
ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం తన రెండో హిందీ ప్రాజెక్ట్ సిటడెల్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో సామ్ సరసన వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్ ద్వారా మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించే అవకాశం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సామ్ నటించిన తెలుగు చిత్రం శాకుంతలం సినిమా అనుకున్న తేదీ కంటే మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం 3డీ తెరకెక్కించిన కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. చివరకు ఫిబ్రవరి 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అప్పుడు కూడా ఈ సినిమా విడుదల కావట్లేదని మంగళవారం నాడు మేకర్స్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.