సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం శుభం. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మించిన శుభం మే 9న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
సినిమాలో కామెడీ యూనిక్‌గా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా మూవీ టీమ్ శుభం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శుభం డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తన మూవీ టీమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. "వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్ ఇచ్చాక భయం వేసింది. సినిమా ఆడకపోయి ఉంటే నా మీద చాలా మీమ్స్ వేసేవాళ్లు. మూవీ మీదున్న నమ్మకంతోనే ఆ రోజు అలా మాట్లాడాను" అని అన్నారు.
"ఈ సినిమాను ముందుండి నడిపించేది డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. నా టీంలో ఏ ఒక్కరూ ప్రతీది సూపర్ ఉందని చెప్పరు. తప్పులుంటే మొహం మీదే చెబుతుంటారు. నా డైరెక్షన్ టీం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. పాలు నీళ్ల బంధం పాటను అభి రాశాడు. ప్రొడక్షన్ డిజైనర్ రామ్ నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. 2004 టైం లైన్‌ను అద్బుతంగా చూపించాడు" అని ప్రవీణ్ కండ్రేగుల తెలిపారు.
"నాకు క్యాస్టూమ్స్ గురించి ఏమీ తెలియదు. ఆ విషయంలో నాకు పూజిత సపోర్ట్ చేసింది. కెమెరామెన్ మృదుల్ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాజ్ సర్ సహకారంతోనే ఈ మూవీని ఇంత బాగా తీయగలిగాను. ఆయన ప్రతీ క్రాఫ్ట్‌లో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. ఆయన నా వెనకలా ఉండి నన్ను ముందుకు నడిపించారు" అని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల చెప్పుకొచ్చారు.
"సమంత గారు లేకపోతే ఈ మూవీని ఎవరు చూస్తారు? సమంత గారి వల్లే ఈ మూవీ జనాల్లోకి వెళ్లింది. ఇలాంటి చిన్న చిత్రాలని ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుండాలి. శుభం లాంటి మూవీని సక్సెస్ చేస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి" అని ప్రవీణ్ కండ్రేగులు అన్నారు.
"మేం నిజాయితీగా తీసిన ఈ మూవీని థియేటర్‌లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి కథకు ప్రతీ భాషలో రీమేక్ అయ్యే సత్తా ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాలను సమంత ఇంకా ఇంకా నిర్మిస్తూనే ఉండాలి. కొత్త వారికి సమంత గారు ఇలానే ట్రాలాలా బ్యానర్ మీద సపోర్ట్ చేస్తుండాలి" అని తన స్పీచ్ ముగించారు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల.
సంబంధిత కథనం