Citadel Honey Bunny Review: యాక్షన్ సీన్స్‌‌తో ‘సిటాడెల్ హనీ బన్నీ’లో కట్టిపడేసిన సమంత.. ట్విస్ట్‌లు ఉన్నా అదొక్కటే లోటు-samantha and varun dhawan spy thriller citadel honey bunny review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Citadel Honey Bunny Review: యాక్షన్ సీన్స్‌‌తో ‘సిటాడెల్ హనీ బన్నీ’లో కట్టిపడేసిన సమంత.. ట్విస్ట్‌లు ఉన్నా అదొక్కటే లోటు

Citadel Honey Bunny Review: యాక్షన్ సీన్స్‌‌తో ‘సిటాడెల్ హనీ బన్నీ’లో కట్టిపడేసిన సమంత.. ట్విస్ట్‌లు ఉన్నా అదొక్కటే లోటు

Galeti Rajendra HT Telugu
Nov 07, 2024 02:40 PM IST

Citadel Honey Bunny Web Series Review: ది ఫ్యామిలీ మెన్-2 తర్వాత వెబ్ సిరీస్‌లో నటించిన సమంత.. సిటాడెల్ హనీ బన్నీలో ఏజెంట్‌గా యాక్షన్ సీన్స్‌తో మెప్పిస్తూనే.. తల్లి పాత్రలో కన్నీళ్లు పెట్టించింది. ఈ సిరీస్ ఎలా ఉందంటే?

సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ
సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ
  • వెబ్ సిరీస్ : సిటాడెల్: హనీ బన్నీ
  • నటీనటులు : సమంత, వరుణ్ ధావన్, కశ్వీ మజుందార్, కేకే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీమ్, సిమ్రాన్, శివాంకిత్ పరిహార్, సోహమ్ మజుందార్
  • దర్శకులు : రాజ్ నిడిమోరు , కృష్ణ డీకే
  • ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఎపిసోడ్స్ మొత్తం : 6
  • రన్ టైం : ఒక్కో ఎపిసోడ్ 43 – 55 నిమిషాలు


సినీ ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూసిన ఫుల్ యాక్ష‌న్ ప్యాక్‌డ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్ : హనీ బన్నీ’ గురువారం (నవంబరు 7) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్‌ ఎలా ఉంది? రెండేళ్లుగా కెరీర్‌లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమంత ఆశ నెరవేరిందా? బీ టౌన్ స్టార్‌గా ఉన్న వరుణ్ ధావన్‌కి ఈ వెబ్ సిరీస్‌తో లక్ కలిసొచ్చిందా? యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఈ సిరీస్‌లో ఇద్దరి మధ్య పండిందా? ఓవరాల్‌గా ఈ సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ ఏంటంటే?

హనీ (సమంత) సినిమాల్లో నటించాలనే కోరికతో ముంబయికి వచ్చేసి చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తుంటుంది. బన్నీ (వరుణ్ ధావన్) కూడా సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా ఉంటాడు. ఇద్దరూ సినిమా సెట్స్‌లో లవ్‌లో పడతారు. అయితే.. బన్నీ స్టంట్ మాస్టర్‌గానే కాకుండా బాబా అలియాస్ గురు (కేకే మీనన్) స్థాపించిన ప్రైవేట్ సంస్థలో నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. అనూహ్య పరిస్థితుల్లో ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన హనీ జీవనోపాధి కోసం బన్నీ చేస్తున్న సంస్థలోనే ఏజెంట్‌గా చేరుతుంది.

బాబా శత్రువుగా భావించే సిటాడెల్ (రక్షణ సంస్థ) ప్రాజెక్ట్ తల్వార్‌ మిషన్‌ని తెరపైకి తెస్తుంది. ఈ మిషన్‌ పూర్తి కాకుండా బాబా తన టీమ్‌లోని హనీ, బన్నీతో పాటు కేడీ (సాకిబ్ సలీమ్)తో కలిసి బెల్‌గ్రేడ్‌లో స్కెచ్ వేస్తాడు. ఈ క్రమంలో మిషన్‌‌‌లో అత్యంత కీలకమైన ‘వెపన్స్ ప్రోగ్రామ్‌’ని పొందుపరిచిన బాక్స్ గురించి ఏజెంట్ టీమ్‌కి తెలుస్తుంది.

కథలో ఊహించని మలుపు

ఆ బాక్స్‌ని దొంగలించడానికి బాబా టీమ్‌ చేసిన ఆపరేషన్‌ మధ్యలో.. హనీ చేసే హనీ ట్రాప్.. ఆ తర్వాత ఆపరేషన్ మధ్యలోనే హనీ మనసు మార్చుకోవడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. బాబా ఆశించినట్లుగా ఆ బాక్స్‌ ఏజెంట్ టీమ్‌కి దొరుకుతుందా? హనీ మనసు మార్చుకోవడంతో ఏజెంట్ టీమ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? సిటాడెల్‌కి హనీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అనేది సిరీస్‌ను చూడటం ద్వారా తెలుసుకోవాల్సిందే.

రెండు టీమ్స్ మధ్య ఆ బాక్స్ కోసం జరిగే ఛేజింగ్ సీన్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. సిటాడెల్‌కి సపోర్ట్ చేసిన హనీని బన్నీ ఏం చేశాడు? ఆ బాక్స్ ఎవరి దగ్గర ఉంటుంది? అందులో ఏం ఉంటుంది? అనే సస్పెన్స్‌తో నాలుగు ఎపిసోడ్స్‌ను డైరెక్టర్స్ నడిపించేస్తారు. మధ్యలో హనీ కూతురుని వెంటాడే సీన్స్, ఆమె గతం గురించి ట్విస్ట్‌లను రివీల్ చేస్తుండటంతో కథపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది.

ఎవరెవరు ఎలా చేశారు?

ఆరు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్‌లో వరుసగా ట్విస్ట్‌లు ఇస్తూ కథపై ఆసక్తి సడలకుండా దర్శకులు రాజ్, డీకే జాగ్రత్తపడ్డారు. హనీ కూతురుగా చేసిన నదియా (కశ్వీ మజుందార్)ని చాలా సహజంగా నటించింది. మరీ ముఖ్యంగా బాబా ఏజెంట్ టీమ్ నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె చేసే చిన్న చిన్న స్టంట్స్ ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇక సమంత సిరీస్ మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఏజెంట్‌గా యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్స్‌ని కూడా పండిస్తూ ఒక తల్లిగా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది.

వరుణ్ ధావన్ ఎమోషన్స్ పండించడానికి తక్కువ స్కోప్ దొరికినా.. యాక్షన్ సీన్స్‌లో మాత్రం చాలా కష్టపడ్డాడు. చివర్లో నదియాపై అతను ప్రేమని కురిపిస్తూ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాడు. కేకే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీమ్, సిమ్రాన్, శివాంకిత్ పరిహార్, సోహమ్ మజుందార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సిమ్రాన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్‌లో చేసింది.

ఆఫ్ స్క్రీన్ ఓకే.. ఆన్‌ స్క్రీన్ మాత్రం..

ఎపిసోడ్‌లు పెంచాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల కథని మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఎపిసోడ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్‌లు, కామెడీ, యాక్షన్ సీన్లతో ఆ ఫీలింగ్‌ను దర్శకులు తగ్గించే ప్రయత్నం చేశారు. వెబ్ సిరీస్‌కి ముందు హాట్ హాట్ ఫొటో షూట్‌లతో ప్రచారం చేసిన సమంత, వరుణ్ ధావన్ జోడి..  సిరీస్‌లో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపై అంచనాల్ని పెంచేసింది. కానీ.. సిరీస్‌లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరీ ఆకట్టుకునేలా లేదు. కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో సమంత ముందు వరుణ్ ధావన్ తేలిపోయాడు. ఇలాంటి వెబ్‌ సిరీస్‌లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఇందులో యాక్షన్ సీన్ల సమయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించినా.. కొన్ని చోట్ల డైలాగ్‌లను కూడా డామినేట్ చేసినట్లు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.. ఖర్చుకి వెనుకాడకుండా రిచ్‌గా సిరీస్ తీశారు.

ఓవరాల్‌గా సమంత కోసం ఈ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

Whats_app_banner