Salman Khan: ప్రస్తుతం బాలీవుడ్ లో తమ సొంత సినిమాలనే విమర్శించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. సౌత్ సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతున్న వేళ.. హిందీ సినిమా మేకర్స్ అసలు మూవీస్ ఎలా తీయాలో మరిచిపోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ సినిమాలు బోల్తా ఎందుకు పడుతున్నాయన్న ప్రశ్నకు సల్మాన్ ఖాన్ నిజాయతీగా స్పందించాడు. “ఇంత చెత్త సినిమాలు తీసినప్పుడు ఫ్లాప్ కావాల్సిందే కదా. తీసే సినిమాలన్నీ చెత్తగానే ఉంటున్నాయి. నా సినిమాలు కూడా. అది ఫ్లాప్ అయిందంటే చెత్త సినిమా అనే. హిట్ అయితే బాగుందని అర్థం” అని సల్మాన్ స్పష్టం చేశాడు.
సల్మాన్ ఖాన్ కు కూడా చాలా రోజుల తర్వాత 2023లో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ రూపంలో పెద్ద ఫ్లాప్ ఎదురైంది. పోస్టర్లు, థియేటర్లలో కనిపించే స్టార్లు.. సినిమా ఫ్లాపయినప్పుడు ఆ బాధ్యతను కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సల్మాన్ చెప్పాడు.
అసలు బాలీవుడ్ కొన్నాళ్లు వెనుకబడిపోవడానికి కారణమేంటో కూడా సల్మాన్ వెల్లడించాడు. ఇక్కడ ప్రేక్షకుల కోసం కాకుండా ఒకరికొకరు పోటీ పడటానికి సినిమాలు తీస్తున్నారని విమర్శించాడు. “వాళ్ల కోసం వాళ్లే కథలు రాసుకుంటున్నారు. డైరెక్టర్లతో పోటీ పడుతున్నారు. ప్రొడ్యూసర్లు ఇతర ప్రొడ్యూసర్లతో పోటీ పడుతున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా ఎలా తీయాలో అవతలి వ్యక్తికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రేక్షకుల కోసం ఎవరూ సినిమాలు చేయడం లేదు. మొదటి వరుసలో కూర్చొని మూవీ ఎంజాయ్ చేసేలా కథలు రాయాలి. ప్రేక్షకులకు అర్థం కాదు అని అనుకోవడం తప్పు. మీరెలా చెప్పగలరు. ప్రేక్షకులకు అరటిపండు ఒలిచి పెడుతున్నారు. కానీ ఆడియెన్స్ చాలా ముందుకు వెళ్లిపోయారు. ఓటీటీ వచ్చిన తర్వాత ఎలాంటి సినిమాలకైనా యాక్సెస్ దొరుకుతోంది” అని సల్మాన్ అన్నాడు.
బాలీవుడ్ లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలను తప్పుడు కారణాలతో తీస్తున్నారని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. “ఈ విషయం నాకు మా నాన్న చెప్పారు. యాక్టర్స్ డేట్స్ అందుబాటులో ఉన్నప్పుడే సినిమాలు చేస్తున్నారు. లేదంటే హీరోయిన్లు పెళ్లి చేసుకునే ముందు చేస్తున్నారు. లేదంటే వాళ్ల దగ్గర డబ్బు ఉంటే చేస్తున్నారు. కానీ ఓ సినిమాను మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడే చేయాలి. అంతే” అని సల్మాన్ స్పష్టం చేశాడు.
సినిమాలు ఎలా ఉన్నా ఇప్పటికీ దేశంలో ఎక్కువ మంది చూసే వినోదం అని ఈ సందర్భంగా సల్మాన్ చెప్పాడు. నైట్ క్లబ్స్ కు వెళ్లే వాళ్లు కూడా ఉన్నా.. ఎక్కువ మంది ఇంట్లో కూర్చొని సినిమాలు చూడటానికే ఇష్టపడతారని అన్నాడు. సల్మాన్, రష్మిక నటించిన సికందర్ మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ మూవీకి మురగదాస్ దర్శకత్వం వహించాడు.
సంబంధిత కథనం