Salman Khan: అల్లు అర్జున్ వద్దనుకున్న మూవీ.. సల్మాన్ ఖాన్ కెరీర్లో అతిపెద్ద హిట్.. ఆ సినిమా ఏదో తెలుసా?
Salman Khan: అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లు వద్దనుకున్న సినిమా.. సల్మాన్ ఖాన్ కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిన విషయం తెలుసా? అంతేకాదు ఈ సినిమాకు కథ అందించింది కూడా మన దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం.
Salman Khan: సినిమా ఇండస్ట్రీలో ఒకరు వద్దనుకున్న, చేయలేకపోయిన సినిమాలు మరొకరి కెరీర్ ను మలుపు తిప్పడం, వాళ్లకు పెద్ద హిట్ అందించడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఇది కూడా. బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్ చేసిన ఓ మూవీని అంతకుముందు అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లు వదులుకున్నారు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ గా నిలిచి ఏకంగా బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం.
భజరంగీ భాయ్‌జాన్.. అల్లు అర్జున్ వద్దంటే..
సల్మాన్ ఖాన్ తన కెరీర్లో సుల్తాన్, టైగర్ జిందా హైలాంటి వందల కోట్లు వసూళ్లు చేసిన సినిమాలు అందించాడు. అయితే భజరంగీ భాయ్‌జాన్ మాత్రం అతని కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మన విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. అయితే ఈ మూవీని మొదట అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్ లకు వినిపించాడట డైరెక్టర్ కబీర్ ఖాన్.
బన్నీకి అప్పటికే ఇతర ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో ఈ సినిమాను వదులుకున్నాడు. అటు ఆమిర్ ఖాన్ కు కూడా ఈ స్టోరీ చెప్పగా..అతడు ఇందులో కొన్ని మార్పులు సూచించాడు. కానీ దానికి కబీర్ ఖాన్ నో చెప్పడంతో అతడు కూడా ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చింది. చివరికి సల్మాన్ ఖాన్ దగ్గరికి ఈ కథ చేరింది. దీనికి అతడు ఓకే చెప్పడం, తర్వాత బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కావడం జరిగిపోయాయి.
భజరంగీ భాయ్‌జాన్.. బ్లాక్‌బస్టర్ హిట్
సల్మాన్ ఖాన్ నటించిన ఈ భజరంగీ భాయ్‌జాన్ మూవీని కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.918 కోట్లు వసూలు చేసింది. 2015లో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటికీ సల్మాన్ కెరీర్లో అతిపెద్ద హిట్ కావడం విశేషం. ఈ మూవీ పవన్ (సల్మాన్) అనే ఓ హనుమాన్ భక్తుడి చుట్టూ తిరిగే కథ.
హర్యానాలో అతనికి ఓ మూగ, చెవిటి బాలిక తప్పిపోయి కనిపిస్తుంది. ఆమె ఎవరా అని ఆరా తీస్తే.. పాకిస్థాన్ కు చెందిన బాలిక అని తెలుస్తుంది. ఆమెను ఎలాగైనా ఆమె దేశానికి పంపించి, వాళ్ల కుటుంబంతో కలపాలని అతడు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ఆ తర్వాత అతడు శత్రు దేశ ప్రజల మన్ననలు ఎలా అందుకుంటాడన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఐఎండీబీలో 8.1 రేటింగ్ నమోదైంది. అల్లు అర్జున్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లు ఈ సినిమాను తిరస్కరించడం సల్మాన్ ఖాన్ కు కలిసొచ్చింది. అతని కెరీర్లో ఇప్పటికే అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఈ భజరంగా భాయ్‌జాన్ మూవీయే. టైగర్ జిందా హై, సుల్తాన్ లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసినా.. దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు. సల్మాన్ ఇప్పుడు మురగదాస్ డైరెక్షన్ లో సికందర్ మూవీ చేస్తున్నాడు.