Salaar Trailer Update: గెట్ రెడీ.. సలార్ ట్రైలర్‌పై అధికారిక ప్రకటన వచ్చేస్తోంది
Salaar Trailer Update: సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ ట్రైలర్ విడుదల డేట్, టైమ్‍ను రేపు (నవంబర్ 12) మూవీ యూనిట్ ప్రకటించనుందని తెలుస్తోంది.
Salaar Trailer Update: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీకి వాయిదా పడింది. దీంతో సలార్ అప్‍డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. కాగా, ‘సలార్ పార్ట్ 1- సీజ్‍ఫైర్’ సినిమా ట్రైలర్ గురించి అప్‍డేట్ వచ్చింది.
సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‍ను ఆ మూవీ యూనిట్ రేపు (సెప్టెంబర్ 12) ప్రకటించనుందని సమాచారం బయటికి వచ్చింది. దీపావళి సందర్భంగా రేపు ఈ అప్‍డేట్‍ను హొంబాలే ఫిల్మ్స్ వెల్లడించనుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డిసెంబర్ 1వ తేదీన సలార్ ట్రైలర్ వస్తుందని కొంతకాలంగా బజ్ విపరీతంగా నడుస్తోంది. ఈ విషయంపై రేపు క్లారిటీ రానుంది. ట్రైలర్ కట్ పనులు కూడా ఇప్పటికే షురూ అయినట్టు తెలుస్తోంది. ట్రైలర్ లాంచ్ కోసం ఈవెంట్ కూడా జరిగే అవకాశం ఉంది.
సలార్ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‍ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ పాట షూటింగ్ జరగాల్సి ఉంది. ఈ స్పెషల్ సాంగ్‍లో పంజాబీ బ్యూటీ సిమ్రత్ కౌర్ చిందేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సలార్ షూటింగ్ జరుగుతోంది.
కాగా, మోకాలికి సర్జరీ తర్వాత ప్రభాస్ ఇటీవలే హైదరాబాద్‍కు తిరిగి వచ్చారు. యూరప్‍లో ఆయన సర్జరీ చేయించుకున్నట్టు తెలిసింది. సలార్ ప్రోమోషన్లను ఈనెల మూడో వారంలోనే మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సలార్ సినిమాలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‍గా నటిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‍గా చేస్తున్నారు. జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. రవిబస్రూర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 22వ తేదీన సలార్ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. షారుఖ్ ఖాన్ సినిమా డుంకీతో బాక్సాఫీస్ వద్ద సలార్ తలపడనుంది.