Salaar Review: స‌లార్ రివ్యూ - ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ క‌లిసి బాక్సాఫీస్‌ను షేక్ చేశారా?-salaar movie review prabhas prashanth neel gangster action entertainer movie review prithviraj sukumaran shruti haasan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Review: స‌లార్ రివ్యూ - ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ క‌లిసి బాక్సాఫీస్‌ను షేక్ చేశారా?

Salaar Review: స‌లార్ రివ్యూ - ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ క‌లిసి బాక్సాఫీస్‌ను షేక్ చేశారా?

HT Telugu Desk HT Telugu
Dec 22, 2023 08:54 AM IST

Salaar Review: సలార్ మూవీ రివ్యూ: ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌లార్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?

ప్రభాస్ సలార్
ప్రభాస్ సలార్

Salaar Review: బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియ‌న్ లెవెల్‌ స‌క్సెస్ కోసం ప్ర‌భాస్ (Prabhas) చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. సాహో నుంచి ఆదిపురుష్ వ‌ర‌కు ప్ర‌భాస్ న‌టించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాయి. దాంతో స‌లార్‌పైనే ప్రభాస్ అభిమానులు భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది శృతిహాస‌న్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2023లోనే మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజైన స‌లార్ (Salaar) ఎలా ఉంది? ప్ర‌భాస్‌కు ప్ర‌శాంత్ నీల్ హిట్ ఇచ్చాడా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే…

ఖాన్సార్ ఆధిప‌త్య పోరు..

దేవా (ప్ర‌భాస్‌) ఓ మెకానిక్‌. అస్సాం ఏరియాలోని బొగ్గు గ‌నుల్లో ప‌నిచేస్తుంటాడు. విదేశాల నుంచి ఇండియాకు వ‌చ్చిన ఆద్య (శృతిహాస‌న్‌) అనే అమ్మాయిని చంప‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఆద్య‌ను కాపాడే బాధ్య‌త‌ను దేవా చేప‌డ‌తాడు. దేవా క‌ళ్ల ముందే ఆద్య‌పై ఎటాక్ చేసేందుకు కొంద‌రు రౌడీలు ప్ర‌య‌త్నిస్తారు. హింస‌, గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటాన‌ని త‌ల్లికి (ఈశ్వ‌రీరావు) మాట ఇవ్వ‌డంతో వారిని ఎదురించకుండా మౌనంగా ఉండిపోతాడు దేవా.

ఆ రౌడీల‌ను త‌ల్లి కొట్ట‌మ‌ని చెప్ప‌డంతో వారి బారి నుంచి ఆద్య‌ను కాపాడుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ఆద్య‌ను వెంటాడుతోన్న ఖాన్స‌ర్ మ‌నుషుల‌కు దేవాకు ఉన్న సంబంధం ఏమిటి? ఖాన్స‌ర్‌కు రాజు రాజ‌మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) కొడుకు వ‌ర‌ద‌రాజ‌ రాజ‌మ‌న్నార్‌కు (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ప్రాణ స్నేహితుడిగా దేవా ఎలా మారాడు? చిన్న‌త‌నంలో దేవా త‌ల్లి కోసం రాజ‌మ‌న్నార్ ఎలాంటి త్యాగం చేశాడు.

ఆ త్యాగానికి ప్ర‌తిఫ‌లంగా మ‌ళ్లీ రాజ‌మ‌న్నార్‌ను దొర‌ను చేయ‌డం కోసం దేవా సాగించిన పోరాటం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? ఖాన్స‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం కోసం రాజ‌మ‌న్నార్ కుటుంబంలోనే ఎలాంటి కుట్ర‌లు జ‌రిగాయి. మ‌న్నార్ తెగ‌పై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి ఎదురుచూస్తోన్న శౌర్యంగుల తెగ‌కు చెందిన దేవా... రాజ‌మ‌న్నార్‌కు అండ‌గా ఎందుకు నిల‌బ‌డ్డాడు అన్న‌దే స‌లార్ మూవీ క‌థ‌.

Salaar Review: ప్ర‌శాంత్ నీల్ మార్క్‌...

స‌లార్ ప‌క్కా ప్ర‌శాంత్ నీల్ మార్కు మూవీ. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 స్టైల్‌లోనే క‌థ‌, క‌థ‌నాల కంటే హీరోయిజం, ఎలివేష‌న్స్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి ప్ర‌శాంత్ నీల్ స‌లార్ మూవీని తెర‌కెక్కించాడు. ప్ర‌తి సీన్‌లో ప్ర‌భాస్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌లో చూపించాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ హీరోగా ప్ర‌భాస్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై అభిమానులు చూసి చాలా కాల‌మైంది. ఆ లోటును స‌లార్‌తో(Salaar Review) భ‌ర్తీ చేశాడు ప్ర‌శాంత్ నీల్‌. దేవాగా ప్ర‌భాస్ స్క్రీన్ ప్ర‌జెన్స్‌, హీరోయిజం ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుంది.

ఉగ్రమ్ పోలిక‌లు...

స‌లార్ క‌థ చాలా వ‌ర‌కు ప్ర‌శాంత్ నీల్ మొద‌టి సినిమా ఉగ్రమ్‌ ఛాయ‌ల‌తోనే సాగుతుంది. శృతిహాస‌న్ ఎపిసోడ్ మొత్తం ఉగ్రమ్‌ సినిమా నుంచే స్ఫూర్తి పొంది రాసుకున్నాడు ప్ర‌శాంత్ నీల్‌. ఖాన్సార్ బ్యాక్‌డ్రాప్‌ను మాత్రం కొత్త‌గా రాసుకున్నాడు. ఖాన్సార్ పీఠం కోసం రాజ‌మ‌న్నార్ ఫ్యామిలీలో అంత‌ర్గ‌త పోరు...

రాజ‌మ‌న్నార్ రెండో భార్య కొడుకు, త‌న స్నేహితుడు వ‌ర‌ద రాజ మ‌న్నార్‌ను దొర‌ను చేయ‌డం కోసం ఖ‌న్సార్ సిటీలో అడుగుపెట్టిన దేవా శ‌త్రువుల‌ను చీల్చి చెండాడే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను హై ఇంటెన్స్‌గా డిజైన్ చేసుకున్నారు ప్ర‌శాంత్ నీల్‌. ఖ‌న్సార్‌ను మూడు తెగ‌లు క‌లిసి స్థాపించాయ‌ని, దేవా...మ‌న్నార్ వంశ‌స్తుల‌కు శ‌త్రువు అయినా శౌర్యంగుల తెగ‌కు చెందిన వాడంటూ క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్ ఇచ్చారు. శౌర్యంగుల‌కు రాజ‌మ‌న్నార్ ద్రోహం చేశాడంటూ చూపించి అంత‌ర్లీనంగా సెకండ్ పార్ట్‌కు సంబంధించిన స్టోరీని ర‌న్ చేశారు.

కేజీఎఫ్ గుర్తొస్తుంది.

స‌లార్(Salaar Review) బ్యాక్‌డ్రాప్‌, యాక్ష‌న్ సీన్స్‌, ఎలివేష‌న్స్, ఖాన్స‌ర్ సెట‌ప్‌...అన్ని కేజీఎఫ్‌, కేజీఎఫ్ -2ను పోలి ఉంటాయి. హీరో ల‌క్ష్యం, వారి నేప‌థ్యాలు వేరైనా...క‌థ విష‌యంలో మాత్రం కేజీఎఫ్‌, స‌లార్ ఒకేలా అనిపిస్తాయి. అయితే కేజీఎఫ్ స్థాయిలో ఎమోష‌న్స్ పండ‌లేదు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌ను రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో చూపించాడు ప్ర‌శాంత్ నీల్‌.

కొడుకు దేవా గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండాల‌ని అత‌డి త‌ల్లి ఎందుకు అనుకున్న‌ద‌న్న‌ది సెకండ్ పార్ట్‌లో చూపించ‌డానికి దాచిపెట్టాడు డైరెక్ట‌ర్‌. దాంతో ఫ‌స్ట్ పార్ట్‌లో ఆ సీన్స్ క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తాయి. త‌ల్లికొడుకుల అనుబంధం కేజీఎఫ్ స్థాయిలో వ‌ర్క‌వుట్ కాలేదు. నిడివి కూడా చాలా ఎక్కువ‌గా అనిపిస్తుంది.

Salaar Review: ప్ర‌భాస్ వ‌న్‌మెన్ షో...

ప్ర‌భాస్ వ‌న్‌మెన్ షోగా స‌లార్ నిలుస్తుంది. ప్ర‌భాస్ క‌నిపించే ప్ర‌తి సీన్ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా కిక్ ఇచ్చేలా ప్ర‌శాంత్ నీల్ జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో అయితే ప్ర‌భాస్ చెల‌రేగిపోయాడు. ఒక్కో యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా అనిపిస్తుంది.

వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ పాత్ర‌కు పృథ్వీరాజ్ ప్రాణం పోశాడు. ఈ క్యారెక్ట‌ర్‌కు తాను త‌ప్ప మ‌రొక‌రు యాప్ట్ కాద‌ని అనిపించేలా న‌టించాడు. శృతిహాస‌న్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో ఈశ్వ‌రీరావు మెప్పించింది. జ‌గ‌ప‌తిబాబు, శ్రియారెడ్డి, బాబీసింహా, టీనూ ఆనంద్‌తో పాటు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో క‌నిపించారు.

ఫ్యాన్స్‌కు పండ‌గ‌....

స‌లార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గ‌లాంటి మూవీ. త‌న లుక్‌, యాక్టింగ్‌, యాక్ష‌న్‌తో అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు ప్ర‌భాస్‌. కేజీఎఫ్‌తో పోలిక లేకుండా చూస్తే సలార్ మెప్పిస్తుంది. టాక్‌తో సంబంధం లేకుండా సినిమా ఫ‌స్ట్ డే సలార్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మే...

టీ20 వరల్డ్ కప్ 2024