Salaar losses: బాక్సాఫీస్ రికార్డులు కాదు.. సలార్‌కు అక్కడ నష్టాలే-salaar losses prabhas movie to make losses in andhra pradesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salaar Losses Prabhas Movie To Make Losses In Andhra Pradesh

Salaar losses: బాక్సాఫీస్ రికార్డులు కాదు.. సలార్‌కు అక్కడ నష్టాలే

Hari Prasad S HT Telugu
Jan 02, 2024 04:05 PM IST

Salaar losses: సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూలు చేసింది. భారీ లాభాలు అనే వార్తలే వస్తున్నాయి కానీ.. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నష్టాలు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.

సలార్ మూవీలో ప్రభాస్
సలార్ మూవీలో ప్రభాస్ (Screengrab from YouTube/Hombale Films)

Salaar losses: ప్రభాస్ నటించిన సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుందేమో కానీ.. అతని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ సినిమాకు నష్టాలు తప్పేలా లేవు. నిజానికి సలార్ వసూళ్లలో సుమారు రూ.200 కోట్ల వరకూ తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం తెలంగాణ నుంచే కావడం గమనార్హం.

2023లో రిలీజైన తెలుగు సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన మూవీగా సలార్ నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మూవీ రూ.124 కోట్ల షేర్ వసూలు చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నష్టాలు వచ్చే పరిస్థితి ఉండటం మింగుడు పడనిదే. తెలంగాణలో మైత్రీ మూవీ మేకర్స్ సలార్ ను డిస్ట్రిబ్యూట్ చేసింది. తెలంగాణలో రూ.65 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా.. ప్రస్తుతం రూ.67 కోట్ల షేర్ వసూలు చేసింది.

అంటే ఇప్పుడిప్పుడే తెలంగాణలో సలార్ లాభాల్లోకి అడుగు పెట్టింది. ఇక నుంచి వచ్చేదంతా లాభమే అనుకోవాలి. కానీ ఏపీ పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ సినిమాకు 10 నుంచి 15 శాతం నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏపీలో సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.55 కోట్లుగా ఉంది. కానీ సినిమా ఇప్పటికి కేవలం రూ.40 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

సోమవారం (జనవరి 1)తో హాలీడే సీజన్ కూడా ముగిసింది. మంగళవారం (జనవరి 2) నుంచి సలార్ ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీకి పోటీగా పెద్ద సినిమా ఏదీ లేకపోయినా.. ఇప్పటికే 12 రోజులు కావడంతో ఇక సలార్ మానియా మెల్లగా తగ్గిపోనుంది. హిందీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ డంకీ మూవీ సలార్ ను దెబ్బ కొట్టింది.

పైగా రిలీజ్ కు ముందు ఊహించిన స్థాయిలో ప్రమోషన్లు లేకపోవడం కూడా సలార్ కు ప్రతికూలంగా మారాయి. తెలంగాణ స్థాయిలో ఏపీలో టికెట్ల రేట్లు కూడా పెంచకపోవడం కూడా అక్కడ సినిమా నష్టాల వైపు వెళ్లడానికి కారణమవుతోంది.

IPL_Entry_Point